శక్తి ఖర్చు హెచ్చు!

ABN , First Publish Date - 2020-02-25T17:10:53+05:30 IST

శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం మందగిస్తే అది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుని స్థూలకాయాన్ని తెచ్చి పెడుతుంది. ఈ వేగం కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా, శరీరంలో విషాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఈ

శక్తి ఖర్చు హెచ్చు!

శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం మందగిస్తే అది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుని స్థూలకాయాన్ని తెచ్చి పెడుతుంది. ఈ వేగం కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా, శరీరంలో విషాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఈ ఇబ్బంది ఏ కారణంగా తలెత్తినా, తిరిగి ఆ వేగాన్ని పుంజుకునేలా శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం ఆయుర్వేదంలో కొన్ని చికిత్సలు అనుసరించక తప్పదు. 


జీర్ణసంబంధమైన, శరీరం శక్తిని ఖర్చు చేసే 12 రకాల పద్ధతులకు జీర్ణాగ్ని మూల కారణమని ఆయుర్వేదం చెబుతోంది. ఈ జీర్ణాగ్నిని తిరిగి ప్రేరేపించడం కోసం అంతర్లీనంగా, బహిర్గతంగా కొన్ని ఆయుర్వేద విధానాలను అనుసరించాలి. వీటిలో కొన్నిటిని ఇంట్లోనే ఆచరించే వీలుంది. మరీ ముఖ్యంగా శరీరంలో అత్యధికంగా పేరుకుపోతూ ఉండే మేథో థాతు అగ్ని మహా మొండిది. దీన్ని కరిగించాలంటే ఆయుర్వేద చికిత్సలను క్రమంతప్పక పాటించాలి. అవేంటంటే..


నువ్వుల నూనె మర్దన!

శరీరంలో పేరుకునే కొవ్వు క్రమక్రమంగా గట్టిపడి తొలగించడానికి క్లిష్టంగా తయారవుతుంది. నువ్వుల నూనె చర్మంలోకి ఇంకి, అడుగున ఉండే కణజాలానికి రక్తప్రసరణను పెంచి, విషాలను బయటకు విసర్జించేలా చేయడం ద్వారా మెటబాలిజంను పెంచుతుంది. ఇందుకోసం వెచ్చని గదిలో నువ్వుల నూనెతో 15 నుంచి 30 నిమిషాలపాటు శరీరాన్ని మర్దన చేయాలి. తర్వాత సూర్యరశ్మి తగిలేలా చేసి చమట పట్టనివ్వాలి. ఆ తర్వాత నీడపట్టున 10 నిమిషాలు ఉండి, ఆ తర్వాతే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.


ఉప్పు నీటి స్నానం!

శరీర వాపు శరీరంలో పేరుకున్న విషాల విసర్జనకు అడ్డుపడుతుంది. మరీ ముఖ్యంగా లింఫ్‌ వ్యవస్థలోని విషాల విసర్జనకు స్థూలకాయం అవరోధమవుతుంది. ఇందుకు కారణం శరీరంలో కఫ దోషం పెరిగిపోవడమే. కాబట్టి వారానికి ఒకసారి ఉప్పు కలిపిన వేడి నీటితో స్నానం చేయడం  వల్ల ఈ విషాలు స్వేద రంథ్రాల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. తల మినహా శరీరం మొత్తం నీటిలో మునిగి ఉండి, శరీరం వేడెక్కేటంత వేడి నీళ్లు ఉండాలి. స్నానం తర్వాత కూడా మందమైన తువ్వాలు చుట్టుకుని స్వేదం విడుదలయ్యేలా చేయాలి.


త్రిఫల చూర్ణంతో....

త్రిఫల చూర్ణం కొవ్వు కణాలను విడగొట్టి శరీరం నుంచి బయటకు పంపడంలో సమర్థమైనది. కొవ్వు కణజాలం కరగడానికి త్రిఫల చక్కని ఉపయోగకారి. కాబట్టి త్రిఫల చూర్ణం తీసుకుని, శరీరం మీద వెంట్రుకలు పెరుగుతున్న దిశలో మర్దన చేయాలి. ఇలా 45 నిమిషాల పాటు మర్దించి, అదనపు చూర్ణాన్ని రాల్చేసి, స్నానం చేయాలి.


వేడి నీళ్లు!

శరీరం నుంచి విషాలను తొలగించి మెటబాలిజంను పెంచే అత్యంత సులువైన, చవకైన మార్గం వేడి నీళ్ల సేవనం. లవంగం, యాలకులు, దాల్చినచెక్క, నల్లమిరియాలు కలిపి మరిగించిన నీటిని కూడా తాగవచ్చు. ఈ నీటిని ఫ్లాస్కులో నింపి, ఇంట్లో, కార్యాలయాల్లో దాహం వేసినప్పుడు తాగుతూ ఉండాలి.

Updated Date - 2020-02-25T17:10:53+05:30 IST