ఆటుపోట్ల మార్కెట్లో పెట్టుబడుల రక్షణ ఎలా?

ABN , First Publish Date - 2022-06-26T08:17:04+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకున్న స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. సమీప భవిష్యత్‌ కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు.

ఆటుపోట్ల మార్కెట్లో పెట్టుబడుల రక్షణ ఎలా?

కొవిడ్‌ నుంచి కోలుకున్న స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. సమీప భవిష్యత్‌ కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. దీంతో కొత్తగా పెట్టుబడులకు సిద్ధమయ్యే మదుపరులు ఎటూ పాలుపోవడం లేదు. పెట్టుబడుల కేటాయింపులో అవసరమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మదుపరులు ఈ సమస్య నుంచి చాలా వరకు బయటపడొచ్చు. కాకపోతే ఎప్పుడు ఏ పెట్టుబడి మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలదో అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ ఊపు మీద ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్‌ మంచి రాబడులు ఇస్తుంది. అదే ఆర్థిక వ్యవస్థ నీరసిస్తుంటే రుణ పత్రాల మార్కెట్‌ మంచి రాబడులు ఇస్తుంది. ద్రవ్యోల్బణం సెగలు కక్కేటపుడు బులియన్‌ మార్కెట్లో పెట్టుబడులు, అసలుకు ఢోకా లేకుండా ఆదుకుంటుంది. ఈ విషయా లను అర్థం చేసుకుని మదుపరులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మదుపరుల్ని ప్రభావితం చేస్తాయి. అవేమిటంటే..


భావోద్వేగం: అత్యాశ, భయం వంటి భావోద్వేగాలకు లోనుకాని మదుపరులు ఉండరు. ఈ రెండు కారణాలతోనే ఇన్వెస్టర్లు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. బేర్‌ మార్కెట్లో మార్కెట్‌ ఇంకా పడిపోతుందనే భయంతో, మంచి కంపెనీల షేర్లు చౌకగా లభిస్తున్నా ధైర్యం చేయరు. అలాగే తన పోర్టుఫోలియోలోని ఏదైనా ఒక కంపెనీ షేరు ధర పడిపోతున్నా.. ఏదో ఒక రోజు మళ్లీ కోలుకుంటుందనే ఆశతో నష్టాలు మూటగట్టుకుంటారు.


నిర్ణయించుకోలేక పోవడం: అన్ని గుడ్లూ ఒకే బుట్టలో పెట్టకూడదనేది సామెత. ఈ సామెత పెట్టుబడులకూ వర్తిస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి పోర్టుఫోలియోలో షేర్లు, రుణ పత్రాలు, పసిడి పెట్టుబడులు ఉండాలి. కాకపోతే ఏ పెట్టుబడి ఎంత ఉండాలి? వాటి నుంచి ఎప్పుడు బయటికి రావా లి? పునర్‌ వ్యవస్థీకరించుకోవాలి? అనే దానిపై పూర్తి స్పష్టత ఉండాలి.


ఎంపికలో సమస్యలు: మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే ఈక్విటీ, రుణ పథకాల్లో అనేక ఆప్షన్లు లభిస్తున్నాయి. ఇందులో ప్రతి ఫండ్‌కు ఒక్కో పెట్టుబడి వ్యూహం ఉంటుంది. మదుపరులు వారి వారి ఆర్థిక అవసరాలు, పన్ను పోటు ఆధారంగా వీటిని ఎంచుకోవాలి.


పాసివ్‌ ఫండ్స్‌: మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లలో ఉన్నప్పుడు పాసివ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఈటీఎ్‌ఫలు, ఇండెక్స్‌ ఫండ్స్‌ ఈ కోవలోకి వస్తాయి. పెట్టుబడుల వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌) ఈ ఫండ్స్‌ ప్రత్యేకత. వీటిలో పెద్దగా రాబడులు రాకపోయినా.. నష్టాలు మాత్రం అంతగా ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే బేర్‌ మార్కెట్‌ సమయాల్లో ఈ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెద్దగా తరిగిపోకుండా ఎంతో కొంత రక్షణ కల్పిస్తాయి. ఈ ఫండ్స్‌ పనితీరు కూడా చాలా వరకు ఫండ్‌ మేనేజర్ల పెట్టుబడి నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2022-06-26T08:17:04+05:30 IST