ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌లలో పని చేస్తే...

ABN , First Publish Date - 2020-03-08T17:01:39+05:30 IST

నేను ఉద్యోగస్తురాలిని. ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌లలో పని చేస్తుంటాను. ఆహారపు అలవాట్లను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌లలో పని చేస్తే...

ఆంధ్రజ్యోతి(08-03-2020)

ప్రశ్న: నేను ఉద్యోగస్తురాలిని. ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌లలో పని చేస్తుంటాను. ఆహారపు అలవాట్లను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?


- సత్యశ్రీ, హైదరాబాద్‌

డాక్టర్ సమాధానం: నైట్‌ షిఫ్టులలో పని చేసేప్పుడు నిద్ర, ఆహార వేళల్లో మార్పుల వల్ల ఆరోగ్యంలో కూడా తేడా వస్తుంది. బరువు పెరగడం లేదా తగ్గడం, అరుగుదల మందగించడం, మలబద్దకం, ఎప్పుడూ నీరసంగా ఉండడం, షిఫ్ట్‌ లేని సమయంలో నిద్ర సరిగా పట్టకపోవడం... లాంటి ఇబ్బందులు కలగవచ్చు. ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి  సర్దుబాట్లు చేసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చు. షిఫ్ట్‌ను బట్టి ఆహారం, నిద్ర వేళలను మార్చుకోవాలి. మెలకువగా ఉంటూ పని చేసే సమయంలో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే అలసట ఉండదు. పైగా భుక్తాయాసంతో నిద్ర మత్తు ఆవహించే సమస్యా తగ్గుతుంది. సలాడ్లు, పండ్లు ఎక్కువగా తినాలి. దీంతో అరుగుదల బాగుంటుంది. రోజూ కనీసం రెండున్నల లీటర్ల నీళ్లు తాగాలి. పడక గది నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేలా చేసుకుంటే ఎప్పటిలానే ఏడెనిమిది గంటలు నిద్రపోవచ్చు. నిద్ర వేళకు కనీసం గంటన్నర లేదా రెండు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. మధ్యలో కాకుండా పూర్తి నిద్ర తరువాతే లేచి ఆహారం తీసుకోవడం మేలు. ఏదో ఓ సమయంలో  అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చేస్తే నిద్ర సమయాలు మారినా ఆ ప్రభావం ఆరోగ్యంపై పెద్దగా ఉండదు.


డా. లహరి సూరపనేని

 న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


Updated Date - 2020-03-08T17:01:39+05:30 IST