‘రుణం’ చెల్లించేదెలా?

ABN , First Publish Date - 2020-06-06T10:17:24+05:30 IST

లాక్‌డౌన్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు.

‘రుణం’ చెల్లించేదెలా?

స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆవేదన


చిత్తూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ మారటోరియం విధించినా.. క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడం సమస్యగా మారుతోంది. మరోవైపు తీసుకున్న రుణాలకు నెలవారీ కంతులు చెల్లించాల్సిందేనని డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి మొదలైంది. పనులే లేకుంటే.. రుణాల కంతులు ఎలా చెల్లించాలని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా విపత్తు ముగిసేవరకు రుణాలపై వడ్డీ రాయితీ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు సంఘంలోని ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఆర్థికంగా బాగుంటే.. మిగిలినవారు ఇబ్బందుల్లో ఉన్నారు.


ఈ పరిస్థితుల్లో సభ్యుల మధ్యా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. జిల్లాలో 72,067 స్వయం సహాయక సంఘాల్లో 7,43,458 మంది సభ్యులున్నారు. 71,546 సంఘాల్లోని 7,15,580 మంది సభ్యులు రూ.2350 కోట్ల రుణాలు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో నెలవారీ చెల్లింపులు రూ.80 కోట్లలో ఉంది. లాక్‌డౌన్‌తో ఈ చెల్లింపులు నెలకు రూ.4 నుంచి రూ.5 కోట్లకు పరిమితమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


ఇక్కడా అదే పరిస్థితి 

ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి పెట్టాల్సిన తరుణంలో రుణాల కంతులు చెల్లించడం సాధ్యం కాదన్న అభిప్రాయం రైతుల్లోనూ వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌తో గృహ రుణాలు, వాహనాల కొనుగోలు, వ్యక్తిగత రుణ గ్రహీతలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఐదో విడత లాక్‌డౌన్‌ నడుస్తుండగా, ఇప్పటికీ సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. 


ఒత్తిడి తేవడం లేదు 

నెలవారీ రుణ వాయిదాలు చెల్లించాలని డ్వాక్రా సంఘాల సభ్యులపై ఒత్తిడి తేవడం లేదు. రిజర్వుబ్యాంకు మారటోరియం విధించినా వడ్డీ రాయితీ ఉండదు. దీనిపై అవగాహన ఉన్న సంఘాల సభ్యులు కంతులు చెల్లిస్తున్నారు. వడ్డీ రాయితీ విషయం ఇప్పట్లో కచ్చితంగా చెప్పలేం.

- గణపతి, లీడ్‌ బ్యాంకు మేనేజరు

Updated Date - 2020-06-06T10:17:24+05:30 IST