Abn logo
Jul 7 2020 @ 12:30PM

శ్వాస తీసుకొనే సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు, పద్ధతులు..

ఆంధ్రజ్యోతి(07-07-2020)

ఊపిరి నింపుదాం!

-లంగ్ కేర్

కరోనా వైరస్‌ సోకితే ప్రధానంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. వైరస్‌ తాకిడి నుంచి ఊపిరితిత్తులను రక్షించుకోవాలంటే... వాటిని శుద్ధి చేయడంతో పాటు శ్వాస తీసుకొనే సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు, పద్ధతులను అనుసరించాలి. అందుకోసం తోడ్పడే మార్గాలు ఇవే! 

ఆర్సెనిక్‌ ఆల్బమ్‌తో... హోమియో

హోమియో వైద్య విధానంలో కరోనా చికిత్స భిన్నంగా సాగుతుంది. వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ ఒకే రకం మందు విధానం హోమియోలో ఉండదు. లక్షణాల ఆధారంగా వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మందులు వాడవలసి ఉంటుంది. అయితే ఇతర వ్యాధుల్లో మాదిరిగానే, కరోనా వ్యాధిలో కూడా సింగిల్‌ డోస్‌, సింగిల్‌ రెమెడీ హోమియో మందులు అద్భుతంగా పని చేస్తాయి. హోమియో చికిత్సలో వ్యాధి నయం కావడం అంటే... అందుకు తోడ్పడే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా చికిత్స చేయడం. ఇందులో భాగంగా జెంటిల్‌, ర్యాపిడ్‌, పర్మినెంట్‌ (సున్నితంగా, వేగంగా, శాశ్వతంగా) అనే మూడు ప్రధాన గుణాలతో హోమియో చికిత్స కొనసాగుతుంది. 


ఊపిరితిత్తులు బలపడడం కోసం...

వైరస్‌ నుంచి రక్షణ కోసం, ఊపిరితిత్తులను బలపరచడం కోసం ముందు జాగ్రత్తగా ‘ఆర్సెనిక్‌ ఆల్బమ్‌’ను వాడుకోవచ్చు. ఇందుకోసం 30 పొటెన్సీతో మూడు రోజులు మూడు పూటలు వాడుకోవాలి. లేదా 200 పొటెన్సీతో వారానికి ఒకసారి వాడుకోవచ్చు. ఈ మందుతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ క్రమంగా వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. ఊపిరితిత్తుల నిండా శ్వాస పీల్చుకుని, వదిలే వ్యాయామాలు ప్రతి రోజూ ఉదయాన్నే సాధన చేయాలి. భస్త్రిక, కపాలభాతి, అనులోమ, విలోమ అనే శ్వాస సంబంధిత వ్యాయామాల సాధన వల్ల కూడా ఊపిరితిత్తులను బలపరుచుకోవచ్చు. 


క్షయ ఉంటే: క్షయ వ్యాధి లక్షణాలు లేకుండా, ఆ వ్యాధి నిద్రావస్థలో ఉన్న వారికి కరోనా వైరస్‌ సోకినప్పుడు, క్షయ ప్రేరేపితమై పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. కాబట్టి ఈ వ్యాధి చరిత్ర ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 


-డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు

హోమియో వైద్యులు


అలా ఊదితే...  అల్లోపతి

ఊపిరితిత్తులు బలపడాలంటే శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం ప్రాణాయామం ఎంచుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తుల సామర్ధ్యం సమతులంగా ఉంచడం కోసం స్పైరోమీటర్‌ పరికరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పరికరంలోకి గాలి ఊదడం, పీల్చడంతో ఊపిరితిత్తులు సమర్థంగా పని చేస్తాయి. ఈ పరికరంతో రోజుకు రెండు సార్లు పది నిమిషాల పాటు సాధన చేయడం మంచిది. అలాగే అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి సమకూరడం కోసం ఇ, డి, సి, ఎ, బి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్యలు కలిగినవారిలో వాటి సామర్థ్యం నూటికి నూరు శాతం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సామర్థ్య లోటుకు కారణాన్ని సరిదిద్దుతూ, సామర్థ్యాన్ని పెంచే మందులు ఇచ్చే చికిత్స అవసరం. ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేని వారికి కూడా కరోనా సోకే వీలుంది. కాబట్టి ఆ అవకాశం లేకుండా ఊపిరితిత్తులను బలంగా ఉంచే శారీరక వ్యాయామాలు ప్రతి రోజూ సాధన చేయాలి. ఇందుకోసం గుండె వేగాన్ని పెంచి, శ్వాస ఎక్కువ సార్లు తీసుకునే అవకాశం ఉన్న రన్నింగ్‌, వేగంగా నడవడం, సైకిల్‌ తొక్కడం, స్కిప్పింగ్‌... మొదలైన వ్యాయామాలు చేయాలి. 


-డాక్టర్‌ నాగరాజు బోయిళ్ల

సీనియర్‌ పల్మనాలజిస్ట్

ఇంట్లోనే... ఇలా..!   

ఆయుర్వేదం

ఊపిరితిత్తులు బలంగా ఉండాలంటే, వాటికి ఆసరాగా ఉండే అవయవాలను కూడా బలంగా ఉంచాలి. అలాగే ఊపిరితిత్తుల్లోకి గాలి పూర్తిగా చేరుకోకుండా అడ్డుపడే అడ్డంకులనూ తొలగించాలి. అలాగే ఊపిరితిత్తులు గాలితో నిండి విస్తరించకుండా చేసే ఇతరత్రా సమస్యలనూ పరిష్కరించుకోవాలి. ఇందుకోసం గృహవైద్యంతో పాటు, అవసరాన్ని బట్టి ఆయుర్వేద చికిత్సలను అనుసరించాలి. అలాగే వ్యాయమంలో భాగంగా ప్రాణాయామం చేయవచ్చు. 


లేహ్యం: ఆవాలు, పసుపు పొడికి తులసి, లేదా తమలపాకు రసాలు, తేనె కలిపి లేహ్యంగా తయారుచేసుకోవాలి. ఈ లేహ్యాన్నిరోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఊపిరితిత్తులకు శక్తి సమకూరుతుంది. అలాగే వ్యాధికారక సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కూడా దక్కుతుంది. 


కషాయం: ఒక చెంచాడు త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) చూర్ణానికి నాలుగు కప్పుల నీళ్లు కలిపి, ఒక కప్పు అయ్యేంతవరకు కాచాలి. ఈ కషాయానికి తేనె కలిపి, రోజుకు మూడు సార్లు సేవించాలి. ఈ కషాయంతో ఊపిరితిత్తుల్లోకి చేరే కఫం కరిగి, బయటకు వచ్చేస్తుంది. దాంతో వాయుకోశాలు శుభ్రపడి, ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. 


ఆహారం: ఊపిరితిత్తులు సామర్థ్యం మేరకు విప్పారాలంటే దాని చుట్టూ ఉన్న ఎముకలు, కండరాలు బలంగా ఉండాలి. ఇందుకోసం విటమిన్‌-డి, విటమిన్‌-బి12, మాంసకృత్తులు, పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా అందించాలి. ఇవన్నీ ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం. 


రసాయన చికిత్స: చ్యవనప్రాశ, అగస్త్య రసాయనం, అగస్త్య హరీతకి రసాయనాలన్నీ ఊపిరితిత్తులను బలపరుస్తాయి. 


మర్దన: కర్పూరానికి రక్తనాళాలను విప్పార్చే గుణం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులకు రక్తప్రసరణ పెరగడం కోసం, కర్పూర తైలంతో ఛాతీ మీద మర్దన చేసుకోవచ్చు. 


వమన చికిత్స: అతిమధురం, పిప్పళ్లు, వస, సైంధవ లవణాలను నీళ్లలో కలిపి వాంతి వచ్చేంతవరకూ తాగాలి. ఈ నీళ్లను వాంతి చేసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోని కఫం వెలుపలికి వచ్చి, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. 


నస్య చికిత్స: జలనేతి, సూత్రనేతి చికిత్సలతో ముక్కులోని నాడులను ప్రేరేపించి, తద్వారా ఊపిరితిత్తులను శుద్ధి చేసే చికిత్సను అనుసరించవచ్చు. 


శంక ప్రక్షాళన: పేగుల్లోని మలినాలను వదిలించడం ద్వారా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఊపిరితిత్తులను విప్పార్చడం కోసం తోడ్పడే ప్రక్రియ ఇది. ఇందుకోసం స్వచ్ఛమైన నీటినే ఉపయోగించాలి. 


నౌళి ప్రక్రియ: సముద్రపు అలల్లా పొట్ట కండరాలను కదలించడం ద్వారా కూడా ఊపిరితిత్తులను చైతన్యంగా ఉంచవచ్చు.


- డాక్టర్‌ చిలువేరు రవీందర్‌

ఆయుర్వేద వైద్యులు.

ఆహారం, వ్యాయామంతో... నేచురోపతి

ఊపిరితిత్తులను బలపరిచే వ్యాయామాలు చేయడం, కుంటుపరిచే పదార్థాలకు దూరంగా ద్వారా కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకునే వీలుంది. ఇందుకోసం ప్రాణాయామంతో పాటు, ఊపిరితిత్తులను ప్రేరేపించే ఎలాంటి వ్యాయామాలనైనా అనుసరించవచ్చు. పరుగెత్తడం, మెట్లెక్కడం, వేగంగా నడవడం, ఇతరత్రా వ్యాయామాలూ మేలైనవే! భస్ర్తిక, కపాలభాతి, భ్రామరి లాంటి ప్రాణాయాయ మెలకువలు ఊపిరితిత్తులను బలంగా ఉంచుతాయి. వీటిలో భ్రామరి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడికి లోనైతే, శరీర జీవక్రియలు కొంత కుంటుపడతాయి. కాబట్టి శారీరక వ్యాయామంతో పాటు, మానసిక సాంత్వన చేకూర్చే సాధనలూ అనుసరించాలి. 


ఆహారమూ ప్రధానమే! 

ఊపిరితిత్తుల మీద ఆహార ప్రభావం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల మీద ఒత్తిడి, కఫాలను పెంచే వీలున్న మాంసాధారిత ప్రొటీన్లతో పాటు, పాలు, పాల ఉత్పత్తులు మానేయాలి. అలాగే ఏ పదార్థమైతే తేలికగా జీర్ణం కాదో దానికి దూరంగా ఉండాలి. వ్యక్తులను బట్టి ఇలాంటి పదార్థాల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి వారు ఆ యా పదార్థాలను కనిపెట్టి, వాటిని మానేయాలి. బెల్లం వాడకం కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మితంగా, నియమితవేళల్లో తినాలి. మెరుగైన ఆరోగ్యానికి ఆహార భిన్నత్వం ప్రధానం. కాబట్టి మూడు పూటలా వేర్వేరు పదార్థాలు తీసుకోవాలి. ఉదయం అన్నం తింటే, మధ్యాహ్నం రాగులు, రాత్రి భోజనంగా జొన్నలు... ఇలా భిన్నత్వాన్ని అనుసరించాలి. 


జలనేతి: ఉబ్బసం, ఇతరత్రా ఊపిరితిత్తుల సమస్యలు కలిగి ఉన్నవారు జలనేతి ప్రక్రియను సాధన చేయాలి. ఇది చేసిన వెంటనే కపాలభాతి చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఊపిరితిత్తుల్లో మిగిలిపోయిన కొద్ది కఫం వెలుపలికి వచ్చేస్తుంది. ప్రకృతి చికిత్సల్లో ఆవిరి స్నానం, ముఖానికి ఆవిరిపట్టడం, ఆవిరి పీల్చడం, వేడి పానీయాల (అల్లం రసం, సూప్‌, కషాయం) సేవనం ఉపయోగపడుతుంది. ఛాతీకీ, వెన్నుకూ ఉప్పు లేదా వేడి నీటి కాపడం పెట్టుకున్నా ఊపిరితిత్తులు క్లియర్‌గా ఉంటాయి. 


- డాక్టర్‌ సత్యలక్ష్మి,

డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి, పుణే

సింహ క్రియతో... యోగా

గాలి పీల్చుకోవడం అంటే శరీరంలో జీవం నింపడమే! అయితే అవయవాలు పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడానికి సరిపడా ఆక్సిజన్‌ను మనం శ్వాస ద్వారా తీసుకుంటున్నామా? మన ప్రమేయం లేకుండా జరిగే నిరంతర ప్రక్రియ కాబట్టి శ్వాసక్రియను నిర్లక్ష్యం చేస్తున్నామా? నిజానికి మిగతా శారీరక వ్యవస్థలతో పాటు, శ్వాసవ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉండాలంటే శ్వాస క్రియ సజావుగా సాగాలి. దీన్ని ఒక వ్యాయామంలా సాధన చేయాలి. ఇందుకోసం తోడ్పడేదే సింహ క్రియ. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దిగజార్చే కరోనా వైరస్‌ విస్తరించిన ఈ సమయంలో సింహక్రియను సాధన చేయడం ద్వారా శ్వాస, వ్యాధినిరోధక వ్యవస్థలను సమర్థంగా ఉంచుకోవచ్చు.


ఇలా సాధన చేయాలి:

మొదట పద్మాసనంలో కూర్చోవాలి.

రెండు చేతులతో మోకాళ్లను నెడుతున్నట్టుగా వాటి మీద ఆనించి ఉంచాలి.

నోరు తెరచి, నాలుకను వీలైనంత బయటకు చాపి నోటి ద్వారా గాలిని బలంగా పీల్చి వదలాలి. 

ఉచ్ఛ్వాసనిశ్వాసాలు బలంగా, వేగంగా ఉండాలి. 

ఇలా 21 సార్లు చేయాలి. 

తర్వాత నాలుకను అంగిలి వైపు మడిచి, నోటిని తెరచి ఉంచి, గాలిని బయటకు లోపలికి 21 సార్లు తీసుకోవాలి. 

సింహ క్రియలో నాలుకను చాపి, మడిచి గాలి పీల్చి వదిలేటప్పుడు నోటి వెంట శబ్దం రావాలి. 

గొంతు లోపల అడ్డంకి ఏర్పడిన విధంగా ఆ శబ్దం ఉండాలి. 

ఈ ప్రక్రియ మొత్తంలో కళ్లను మూసి ఉంచాలి. 

పొట్టను కదల్చకూడదు. 

ఆ తర్వాత కనీసం నిమిషం పాటు గాలి పీల్చుకుని, వదలకుండా నిలిపి ఉంచాలి. 

అంతసేపు ఉండలేని వారు కనీసం ముప్పై సెకండ్లపాటైనా ఉండే ప్రయత్నం చేయాలి. 

నిలిపి ఉంచిన గాలిని ముక్కు ద్వారా బయటకు వదలాలి.

ఈ సాధన చేసే సమయంలో పొట్ట నిండుగా కాకుండా, కొంత మేరకైనా ఖాళీగా ఉండాలి.

సింహ క్రియను రోజులో రెండు సార్లు సాధన చేయగలిగితే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.  


- ఉషా ముర్తినేని,

హఠయోగా శిక్షకురాలు