ఆపదకాలంలో ఆదుకునేలా...

ABN , First Publish Date - 2020-06-29T05:30:00+05:30 IST

కొవిడ్‌ సంక్షోభం పలు రకాల కష్టాలు తెచ్చిపెట్టింది. ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు జరగకపోవడం వల్ల ఆదాయం లేక ‘రేపు ఎలా’ అనే చింత ఎక్కువైంది. ఆర్థిక అనిశ్చితి వల్ల రానున్న కొన్ని నెలలు రుణాలు దొరకడం కూడా కష్టమే...

ఆపదకాలంలో ఆదుకునేలా...

కొవిడ్‌ సంక్షోభం పలు రకాల కష్టాలు తెచ్చిపెట్టింది. ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు జరగకపోవడం వల్ల ఆదాయం లేక ‘రేపు ఎలా’ అనే చింత ఎక్కువైంది. ఆర్థిక అనిశ్చితి వల్ల రానున్న కొన్ని నెలలు రుణాలు దొరకడం కూడా కష్టమే! కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ఇతర రుణ  సంస్థలు వెనుకాడుతున్నాయి. చాలా పరిమితంగానే వినియోగదారులకు రుణాలు ఇస్తున్నాయి. అయితే తక్కువ వ్యయ ప్రయాసలతో అత్యవసరంగా రుణం కావాలంటే కింది పద్ధతుల్లో ప్రయత్నిస్తే తప్పక దొరికే అవకాశం ఉంది. కష్టసమయాల్లో ఆదుకునే ఆరు రకాల రుణాలు ఇవి...




ఆస్తిపైన రుణం 

బ్యాంకులు ఆస్తిని కుదువబెట్టుకొని రుణం ఇస్తాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులపైన ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి మొదలవుతుంది. ఆస్తి విలువ, దరఖాస్తుదారు పరపతి, తిరిగి చెల్లించే సామర్థ్యంపై  రుణ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధి ఆధారపడి ఉంటాయి. గరిష్ఠంగా 20 సంవత్సరాల గడువు ఉంటుంది. 




డిజిటల్‌ టాప్‌ అప్‌ గృహరుణాలు

ఇప్పటికే ఇంటి రుణం తీసుకొన్నవారు అదనంగా మరికొంత మొత్తం రుణం తీసుకోవచ్చు. దీన్నే సాధారణంగా ‘టాప్‌ అప్‌ లోన్‌’ గా వ్యవహరిస్తారు. ఇతర రుణాలతో పోల్చితే గృహరుణాల వడ్డీరేట్లు చాలా తక్కువ కాబట్టి టాప్‌ అప్‌కు వెళితే సరిపోతుంది. అప్పటికే ఇంటిపైన ఉన్న రుణాన్ని, చెల్లించే వ్యవధిని లెక్కగట్టి, ‘టాప్‌ అప్‌’ రుణం ఇస్తారు. దీన్ని చెల్లించడానికి అదనపు వ్యవధిని ఇస్తారు.




బంగారంపై రుణం 

బంగారం కుదువబెట్టి రుణం తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే బంగారంపై రుణాలను మంజూరు చేస్తున్నారు. బంగారం విలువలో 75 శాతం దాకా, అంతకు మించి బ్యాంకులు రుణంగా ఇస్తారు. వడ్డీ రేటు 9.10 శాతం నుంచి మొదలవుతుంది. 




ప్రీ అప్రూవ్‌డ్‌  పర్సనల్‌ లోన్స్‌

తమ బ్యాంకులో చాలాకాలంగా ఖాతా ఉండడంతో పాటు మంచి రుణ చరిత్ర, వాయిదాలు సకాలంలో చెల్లిస్తున్న కస్టమర్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్‌డ్‌ పర్సనల్‌ లోన్‌లు ఇస్తున్నాయి. ఆదాయం, ఖర్చు, పొదుపు, అప్పటికే ఉన్న వాయిదా చెల్లింపులు లాంటి వాటిని పరిగణలోకి తీసుకొని రుణమొత్తాన్ని నిర్ణయిస్తున్నారు. అనవసర తంతు, కాలయాపన లేకుండా ఈ రుణాలు మంజూరు చేస్తున్నారు.




‘కొవిడ్‌ - 19’ వ్యక్తిగత రుణాలు

కొన్ని బ్యాంకులు ఇప్పుడు కొవిడ్‌ - 19 రుణాలను అందజేస్తున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో తమ పాత ఖాతాదారులకు, తమ బ్యాంకు శాఖల్లో జీతం ఖాతాలు ఉన్నవారికీ, ఇప్పటికే బ్యాంకు నుంచి గృహరుణం, వ్యక్తిగత రుణం ఉన్నవారికీ, మంచి రుణ చెల్లింపుల చరిత్ర ఉన్న వారికీ, బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. సాధారణ వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఇందులో తక్కువ వడ్డీరేటు వసూలు చేస్తున్నారు. ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజూ ఉండదు. ‘కొవిడ్‌ - 19’ వ్యక్తిగత రుణాల కాలపరిమితి మూడు నుంచి ఐదేళ్లు. ఈ రుణాల చెల్లింపులపైనా బ్యాంకులు వెసులుబాటు ఇస్తున్నాయి. మూడు నుంచి ఆరు నెలలపాటు వాయిదాలు చెల్లించకుండా వడ్డీ చెల్లించినా సరిపోతుంది.




క్రెడిట్‌ కార్డుపై రుణాలు 

ఇప్పటికే క్రెడిట్‌ కార్డు వాడేవారికి ఖర్చులు, చెల్లింపుల ఆధారంగా క్రెడిట్‌ కార్డు కంపెనీలు రుణాలు ఇస్తాయి. కొన్ని కంపెనీలు ఈ రుణం మొత్తాన్ని క్రెడిట్‌ కార్డురుణ పరిమితిలో తగ్గిస్తాయి. మరికొన్ని క్రెడిట్‌ పరిమితికి మించి కూడా రుణాలు ఇస్తున్నాయి.  


Updated Date - 2020-06-29T05:30:00+05:30 IST