ఎడ్లబండ్ల రైతులపై కేసులు పెడితే ఎలా ?

ABN , First Publish Date - 2021-04-13T05:29:47+05:30 IST

బతికేందుకు ఎడ్లబండ్లు ఒక్కటే ఆధారం. అలాంటి రైతు ఇసుక తోలుకుంటుంటే అనుమతి లేదంటూ అక్రమంగా ఎద్దులబండ్లను పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేస్తారా. ఇదేమి న్యాయం, వారేమన్నా ఇసుకను స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా ? అంటూ మండల టీడీపీ శ్రేణులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఎడ్లబండ్ల రైతులకు బాసటగా నిలిచారు.

ఎడ్లబండ్ల రైతులపై కేసులు పెడితే ఎలా ?
నిరసన తెలుపుతున్న ఎడ్లబండ్ల యజమానులు

తహసీల్దారు కార్యాలయం ఎదుట రైతుల నిరసన

మద్దతు పలికిన టీడీపీ నేతలు

చెన్నూరు, ఏప్రిల్‌ 12: బతికేందుకు ఎడ్లబండ్లు ఒక్కటే ఆధారం. అలాంటి రైతు ఇసుక తోలుకుంటుంటే అనుమతి లేదంటూ అక్రమంగా ఎద్దులబండ్లను పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేస్తారా. ఇదేమి న్యాయం, వారేమన్నా ఇసుకను స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా ? అంటూ మండల టీడీపీ శ్రేణులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఎడ్లబండ్ల రైతులకు బాసటగా నిలిచారు. అనంతరం మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఐ.శివారెడ్డి, టీడీపీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునరెడ్డిలు మాట్లాడారు. పంటల కాలం తరువాత ఎడ్లబండ్ల రైతులకు ఎలాంటి ఆధారం లేదని, స్థానికంగా ఇంటి నిర్మాణాలు, ఇతరత్రా చిన్న చిన్న నిర్మాణాల కోసం అవసరమైన వారికి సమీప పెన్నానది నుంచి ఇసుక తోలుకుని జీవిస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపు ఇసుకను తీసుకుపోవచ్చని, గృహ, స్థానిక అవసరాలకు వాడుకోవచ్చని నిబంధనలున్నా పోలీసులు కేసులు నమోదు చేసి ఇసుక బండ్ల రైతులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. కాగా సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ ఎడ్లబండ్ల యజమానులు, టీడీపీ నేతలతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇసుకను తరలించుకోవాలే తప్ప ఇష్టానుసారంగా తీసుకుపోతే ఒప్పుకునేది లేదన్నారు. తహసీల్దారు ద్వారా కానీ, గ్రామ సచివాలయం ద్వారా కానీ అనుమతి పొంది ఇసుక తీసుకెళితే తమకు అభ్యంతరం లేదన్నారు. రైతులంటే తమకు అభిమానమేనని, అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు క్రిష్ణారెడ్డికి రైతుల సమస్యలను తె లియజేస్తూ వారిని ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆటో బాబు, సుదర్శనరెడ్డి, షబ్బీర్‌, సుధాకర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఎడ్లబండ్ల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:29:47+05:30 IST