వండేదెలా... వడ్డించేదెలా?

ABN , First Publish Date - 2022-07-28T04:15:44+05:30 IST

సమగ్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు ఆకలి భాదలు వెంటాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలలో పోటీ పడుతున్నాయి. అందుకు అనుగుణంగా వసతిగృహాల్లో మెనూ చార్జీలు మాత్రం పెరగకపోవడంతో వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందడం లేదు. ఒకప్పుడు వసతిగృహాల్లో వార్డెన్‌ పోస్టు కోసం పోటీ పడేవారు. ప్రస్తుతం వార్డెన్లు తమకెందుకు వెట్టిచాకిరీ అంటూ నిట్టూర్చుతున్నారు.

వండేదెలా... వడ్డించేదెలా?
గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం చేస్తున్న విద్యార్థులు

గిరిజన వసతిగృహాల్లో ఆకలికేకలు
ధరలు పెరిగినా మారని మెనూ చార్జీల కేటాయింపు
తమపై భారం పడుతోందని వార్డెన్ల ఆవేదన
(టెక్కలి రూరల్‌)

సమగ్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు ఆకలి భాదలు వెంటాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలలో పోటీ పడుతున్నాయి. అందుకు అనుగుణంగా వసతిగృహాల్లో మెనూ చార్జీలు మాత్రం పెరగకపోవడంతో వసతిగృహాల్లో  నాణ్యమైన భోజనం అందడం లేదు. ఒకప్పుడు వసతిగృహాల్లో వార్డెన్‌ పోస్టు కోసం పోటీ పడేవారు. ప్రస్తుతం వార్డెన్లు తమకెందుకు వెట్టిచాకిరీ అంటూ నిట్టూర్చుతున్నారు. నాలుగేళ్ల కిందట ధరల ప్రకారంగా మెనూ చార్జీలు అందజేయడంతో విద్యార్థులకు భోజనం పెట్టడం వార్డెన్లకు తలనొప్పిగా పరిణమించింది. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు- 47, గిరిజన ప్రాథమిక పాఠశాలలు-198, పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలు(కళాశాల)- 16, మినీగురుకులాలు-2, ఏకలవ్య పాఠశాలలు-2, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు-4, గిరిజన గురుకుల కళాశాలలు -4 ఉన్నాయి. వీటిలో సుమారు 21వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గిరిజన వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న 3, 4 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున మెనూ కోసం కేటాయిస్తోంది. 5 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,250 చొప్పున, ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.1400 చొప్పున ప్రతినెలా కేటాయిస్తోంది. నాలుగేళ్ల కిందట రూ.500కు లభ్యమయ్యే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,150కు పెరిగింది. ఒక్కో గుడ్డు ధర కూడా రెట్టింపు అయింది. నిత్యావసర వస్తువులైన వంటనూనె, పప్పు దినుసులు, బియ్యం, కూరగాయల వంటి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రభుత్వం పాత మెనూ ధరల ప్రకారం బిల్లులు చెల్లిస్తే.. ప్రతినెలా తమపై అదనపు భారం పడుతోందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఆరు నెలలుగా బిల్లులు బకాయిలు ఉన్నాయని, అప్పు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని వాపోతున్నారు. వార్డెన్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడమే మేలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులే నెలకు ఒకరు చొప్పున లాటరీ పద్ధతి ద్వారా వార్డెన్ల అవతారమెత్తడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెనూ చార్జీలు పెంచాలని, బిల్లులు సకాలంలో మంజూరు చేయాలని వార్డెన్లు కోరుతున్నారు. తమకు నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సక్రమంగా అమలు
జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో సక్రమంగా మెనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల లభ్యతను బట్టి బిల్లులు చెల్లిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వసతిగృహాల్లో భోజనాలు పెడుతున్నాం.
- బి.నగేష్‌, డిప్యూటీ డైరెక్టర్‌, గిరిజన సంక్షేమశాఖ, శ్రీకాకుళం.  

Updated Date - 2022-07-28T04:15:44+05:30 IST