లేఅవుట్‌ చేశాక వ్యవసాయ భూమిగా మారడమేంటి?

ABN , First Publish Date - 2020-09-20T09:31:31+05:30 IST

లేఅవుట్‌ చేసిన తరువాత వ్యవసాయ భూమిగా ఎలా మారుతుందని సాయికృష్ణనగర్‌ ప్లాట్‌ఓనర్స్‌ ఆందోళన చేశారు...

లేఅవుట్‌ చేశాక వ్యవసాయ భూమిగా మారడమేంటి?

అంకుశాపూర్‌ సాయికృష్ణనగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ ఆందోళన


ఘట్‌కేసర్‌ రూరల్‌: లేఅవుట్‌ చేసిన తరువాత వ్యవసాయ భూమిగా ఎలా మారుతుందని సాయికృష్ణనగర్‌ ప్లాట్‌ఓనర్స్‌ ఆందోళన చేశారు. అంకుశాపూర్‌లోని తమ ప్లాట్ల వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992లో మండలంలోని అంకుశాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్లు 231, 212లలో పట్టాదారు రత్నబాయి నుంచి రామిరెడ్డి జీపీఏ తీసుకొని లేఅవుట్‌ చేశారని తెలిపారు. ఈ లేఅవుట్‌లో సగానికి పైగా ప్లాట్‌ఓనర్స్‌ హెచ్‌ఎండీఏ నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు పొందినట్లు తెలిపారు. 2016 నుంచి ఓ మాజీ సర్పంచుతో పాటు మరో ఇద్దరు కలిసి తమ ప్లాట్ల హద్దురాళ్లు తొలగించి కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకాలు పొంది గ్రామంలో ఓ రియల్‌వ్యాపారికి విక్రయించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కసారి లేఅవుట్‌ చేసిన తరువాత మళ్లీ వ్యవసాయ భూమిగా ఎలా మారుతుందని, పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తమ ప్లాట్లవద్దకు వస్తే పోలీసు ఉన్నతాధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకే ఎక్కువగా ఈ లేఆవుట్‌లో ప్లాట్లు విక్రయించామని తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అనుమతులు పొందడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ప్లాట్ల ఓనర్స్‌ రాజ్‌షరెడ్డి, రవికుమార్‌, ఆనంద్‌, మధు, నవీన్‌రెడ్డి, పటేల్‌, బ్రహ్మానందరెడ్డి, పరమేష్‌, ప్రసాద్‌, రాజు, శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-20T09:31:31+05:30 IST