ఇల్లు కట్టేదెలా?

ABN , First Publish Date - 2022-07-02T06:05:26+05:30 IST

జిల్లాలో జగనన్న గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఏడాది క్రితం జిల్లాలో ఈ నిర్మాణాలను ప్రారంభించగా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి.

ఇల్లు కట్టేదెలా?
దర్శి పట్టణ వాసులకు ఇచ్చిన జగనన్న కాలనీలో పునాదుల్లోనే నిలిచిపోయిన ఇళ్లు

69,360 మంజూరు.. పూర్తయినవి 2వేలలోపే!

అడుగు ముందుకు పడని జగనన్న కాలనీ నిర్మాణాలు 

నెల నుంచి అందని బిల్లులు

అప్పులు తెచ్చుకుంటేనే పూర్తయ్యే అవకాశం 

చాలీచాలని యూనిట్‌ విలువ

లేఅవుట్లలో కనీస సౌకర్యాలు కరువు  

అన్నిచోట్లా ఏపుగా పెరిగిన చెట్లు

అధికారుల ఒత్తిళ్లు  

ఎలా నిర్మించుకోవాలంటున్న లబ్ధిదారులు

తాళ్లూరు మండలంలో జగనన్న కాలనీల కోసం 17 లేఅవుట్‌లు వేశారు. వాటిలో 822 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి కాలనీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాళ్లూరు-1, తాళ్లూరు-2, విఠలాపురం, బొద్దికూరపాడు, మన్నేప ల్లిలో 384 మందికి గృహాలు మంజూరు చేశారు. వాటి నిర్మాణాలు చేపట్టేందుకు సన్నద్ధమైనట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. 

దర్శి నియోజకవర్గంలో 4,559 గృహాలు మంజూరుచేయగా ఇప్పటి వరకు కేవలం 548 మాత్రమే పూర్తి చేశారు. 2865 గృహాలు పునాదులు, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 1,146 గృహాలు ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదు. ప్లాట్లు అలాగే ఖాళీగా ఉన్నాయి. నిర్మాణం చేపట్టని 296 మందికి మంజూరైన గృహాలను అధికారు లు రద్దుచేశారు.  కాలనీ స్థలాల్లో చిల్లచెట్లు  దట్టంగా పెరిగి ఉన్నాయి. 

రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా సంకల్పించిన జగనన్న కాలనీల నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. ప్లాట్లు కేటాయించి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ 15శాతం ఇళ్లు కూడా పూర్తికాలేదు. అనేకచోట్ల గ్రామాలకు దూరంగా కొండలు, వాగుల పక్కన ప్లాట్లు కేటాయించటంతో లబ్ధిదారులు గృహాల నిర్మాణానికి ఆసక్తిచూపటం లేదు.  లేఅవుట్లలో నీరు, విద్యుత్‌ వసతి లేదు. ప్రభుత్వం మొదట తామే నిర్మిస్తామని ప్రకటించి ఇప్పుడు మీరే కట్టుకోవాలని చెప్పటంతో  లబ్ధిదారులు వెనక్కితగ్గుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 1.80లక్షలు ప్రస్తుత ధరల ప్రకారం సరిపోవన్న కారణంతో నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇల్లు రద్దుచేసినప్పటికీ పెద్దగా పట్టించుకోవటం లేదు. 

ఒంగోలు నగరం, జూలై 1: జిల్లాలో జగనన్న గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఏడాది క్రితం జిల్లాలో ఈ నిర్మాణాలను ప్రారంభించగా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేసి నివేశన స్థలాలను ఇచ్చింది. అందులో పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులపై అధికారులు ఒత్తిడి కూడా పెంచారు. అయితే జిల్లాలో జగనన్న గృహాల నిర్మాణాలు అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కి వేస్తున్నాయి. జిల్లాకు మొత్తం 69,360 పక్కాగృహాలను మంజూరు చేయగా అందులో ఇప్పటివరకు 2వేలు కూడా పూర్తికాలేదు. దీనినిబట్టి జగనన్న ఇళ్ల  నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు ఎటూ సరిపోక అప్పులు తెచ్చి పనులు పూర్తిచేయాల్సిన పరిస్థితి ఉంటే, మరోవైపు ఆ బిల్లులు కూడా సకాలంలో అందటం లేదు. జిల్లాలో ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు గత నెలరోజులుగా బిల్లులు అందలేదు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలను ఆపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


బేస్‌మట్టం పూర్తయినా బిల్లులు ఏవీ?

జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా బేసుమట్టం వేసుకున్న లబ్ధిదారులకు మొదటి బిల్లుగా రూ.70వేలు ఇవ్వాల్సి ఉంది. బేసుమట్టం వేసుకునేందుకు గృహ నిర్మాణశాఖ 40 బస్తాల సిమెంటు, 343 కేజీల స్టీల్‌ ఇస్తుంది. సిమెంటు 40బస్తాల విలువ రూ.10,600, స్టీల్‌ విలువ రూ.26.500 పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయాల్సి ఉంది. అయితే జిల్లాలో బేస్‌మట్టం పూర్తిచేసిన వారు అధికారుల లెక్కల ప్రకారమే 6,202మంది ఉన్నారు. వారికి మే 25వతేదీ నుంచి బిల్లులు అందలేదు. 


దారి, విద్యుత్‌ లేదు..

ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన జగనన్న లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేవు. ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే కరెంటు అవసరం. జిల్లాలో ఎక్కడా జగనన్న లేఅవుట్లకు విద్యుత్‌ సౌకర్యం లేదు. దీంతో ఐరన్‌తో చేయాల్సిన పనులన్నింటినీ తమ పాత ఇళ్ల వద్దనే చేయించుకొని వాటిని నిర్మాణాల వద్దకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలోని ఎక్కువ జగనన్న లేఅవుట్లకు ఇప్పటికీ సక్రమంగా దారిలేదు. ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకుపోయేందుకు కూడా వీలు లేకుండా ఉంటోంది. దీంతో నిర్మాణాలను ప్రారంభించాలంటేనే లబ్ధిదారులు భయపడిపోతున్నారు. ఇలా ప్రతిదీ ప్రతికూలంగానే ఉంటోంది. జిల్లాలో 2వేల పక్కాగృహాలు పూర్తయినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తుండగా పూర్తయిన గృహాల్లోకి లబ్ధిదారులు గృహప్రవేశం చేయటానికి వీలులేకుండా పోయింది. విద్యుత్‌ సౌకర్యం లేకపోవటంతో ఆ కొద్దిమంది కూడా గృహప్రవేశం చేయలేకపోతున్నారు. 



Updated Date - 2022-07-02T06:05:26+05:30 IST