ఇల్లు కట్టేదెలా?

ABN , First Publish Date - 2022-01-22T04:49:34+05:30 IST

గృహ నిర్మాణదారులు ఎన్నడూలేనంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల స్థిరీకరణ అంటూ ఏదీ లేదు. ప్రతీ నెల బాదుడు తప్పడం లేదు. డిసెంబరు చివరి వారంలో రూ.320 ఉన్న సిమెంట్‌ బస్తా.. జనవరి మొదటి వారానికి రూ.350కు చేరింది. ఇప్పుడు తాజాగా రూ.30లు పెంచడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఇల్లు కట్టేదెలా?

 గృహ నిర్మాణం..పెనుభారం!

 భారీగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు

 అవసరానికి అందని ఇసుక

 సిమెంట్‌ రేటు పైపైకి..

  తాజాగా ఖనిజాలపై భారీగా పెరిగిన పన్నులు

  కంకర, గ్రానైట్‌ ధరలను పెంచిన క్వారీ యాజమాన్యాలు

 ఆందోళనలో గృహ నిర్మాణదారులు

(నెల్లిమర్ల)

గృహ నిర్మాణదారులు ఎన్నడూలేనంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల స్థిరీకరణ అంటూ ఏదీ లేదు. ప్రతీ నెల బాదుడు తప్పడం లేదు. డిసెంబరు చివరి వారంలో రూ.320 ఉన్న సిమెంట్‌ బస్తా.. జనవరి మొదటి వారానికి రూ.350కు చేరింది. ఇప్పుడు తాజాగా రూ.30లు పెంచడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.  టన్ను ఐరన్‌ రూ.60,000, ట్రాక్టరు ఇసుక రూ.4,000, లారీ లోడు ఇసుక రూ.20 వేలకుపైగా పలుకుతోంది. దీంతో గృహ నిర్మాణం భారమవుతోందని నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. చాలావరకూ నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి నిర్మాణాలకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అన్నది ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలింది. జిల్లా అవసరాలకు తగ్గట్టు ఇసుక సరఫరా కావడం లేదు. ఎప్పటికప్పుడు ఇసుక పాలసీలను మార్చుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇటీవల ప్రభుత్వం ఇసుక పాలసీని ప్రకటించింది. వారం వారం పత్రికల్లో ఇసుక ధరలను ప్రకటిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎక్కడా ఆశించిన స్థాయిలో ఇసుక లభ్యత లేదు. జిల్లాలో చంపావతి,వేగావతి  గోస్తని నదులతో పాటు  కాలువల్లో అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జగనన్నకాలనీ లేఅవుట్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల పేరిట ఇసుక తరలించుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలోమాత్రం ఎక్కడా పనులు జరుగుతున్న దాఖలాలు లేవు.కొందరు గృహనిర్మాణ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నట్టు అరోపణలున్నాయి. చంపావతి నది నుంచి అయితే ప్రతిరోజూ వందలాది టైరుబళ్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. ప్రస్తుతం నదుల్లో నీరు తగ్గినా కొత్తగా రీచ్‌లు ప్రకటించలేదు. ఇది అక్రమార్కులకు కలిసివస్తోంది. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక ధర రూ.4,000 పైమాటే. లారీ లోడు ఇసుక రూ,20,000లకు దాటుతోంది. దూరం బట్టి రూ.25,000 వసూలు చేస్తున్నారు. 

 పన్నులను పెంచిన ప్రభుత్వం

గృహ నిర్మాణం భారమవుతున్న వేళ ప్రభుత్వం ఖనిజాలపై  భారీగా పన్నులు పెంచింది. జీవోలు జారీచేసింది. జీవో 42 ప్రకారం  అన్ని రకాల చిన్న ఖనిజాలు, గ్రానైట్‌పై సీనరేజ్‌తో పాటు కన్సిరైజేషన్‌ ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వారీల వద్ద రూ.12,000కు లభించే కంకరాయి (చిప్స్‌) లోడు రూ.19 వేలకు పెరిగింది. సాధారణంగా గ్రానైట్‌ చదరపు అడుగు రకాలు బట్టి రూ.60 నుంచి రూ.130 ల వరకూ దొరుకుతాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అన్నిరకాల గ్రానైట్‌పై రూ.30 ధర పెరిగింది. గతంలో టన్ను చిప్స్‌కు రూ.60 సీనరేజ్‌ ఫీజు ఉండేది. ప్రస్తుతం కన్సరైజేషన్‌ ఫీజుతో కలిపి సినరేజ్‌ను రూ.120లు వసూలు చేస్తున్నారు. గ్రానైట్‌కు సీనరేజ్‌తో పాటు 50 శాతం కన్సరైజెషన్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి రావడంతో క్వారీ యాజమాన్యాలు అన్నిరకాల ఖనిజాల ధరలను పెంచాయి. ఆ ప్రభావం గృహ నిర్మాణంపై పడుతోంది. 



Updated Date - 2022-01-22T04:49:34+05:30 IST