విద్యాదీవెన, వసతిదీవెన కింద 58 వేలిచ్చామన్నారు... పడింది మాత్రం 24 వేలే!

ABN , First Publish Date - 2022-05-07T17:55:00+05:30 IST

ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా జగన్‌ బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా తల్లి ఖాతాలో పడుతున్నాయని మన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ముందుగా మా అబ్బాయి చదువుకు పెండింగ్‌ పడిన విద్యాదీవెన, వసతిదీవెన...

విద్యాదీవెన, వసతిదీవెన కింద 58 వేలిచ్చామన్నారు... పడింది మాత్రం 24 వేలే!

జగన్‌కు మళ్లీ ఓటేయమని ఎలా అడగాలి?

నాకే ఇలా ఉంటే మిగతావారి పరిస్థితేంటి?

వైసీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఆర్‌కే చారి ఆవేదన

సోషల్‌ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తూ పోస్టింగ్‌


అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): ‘ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా జగన్‌ బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా తల్లి ఖాతాలో పడుతున్నాయని మన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ముందుగా మా అబ్బాయి చదువుకు పెండింగ్‌ పడిన విద్యాదీవెన, వసతిదీవెన రూ.58,000 ఇప్పించండి సార్‌! మళ్లీ మన పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడతాను. నాకే న్యాయం జరగకపోతే ఇక నేను ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ జగన్‌కు ఓటు వేయాలని ఎలా అడగాలి’ అని వైసీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఆర్‌.కె.చారి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ఆవేదనను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన చారి.. ఆ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూడా. జగన్‌కు వీరాభిమాని. పాదయాత్రలో తనకు వీలున్న మేరకు ఖర్చుచేసి అభిమానం చాటుకున్నాడు. ఆయన కుమారుడు విశాఖపట్నంలోని ఒక కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతడికి గత మూడేళ్లుగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.58 వేలు రావాలి. ఆ మొత్తం వచ్చేసిందని వార్డు సచివాలయ సిబ్బంది చెబుతున్నా.. ఖాతాలో పడింది మాత్రం రూ.24 వేలే. ఈ మొత్తంతోనే తన కుమారుడి కళాశాల ఫీజులు, హాస్టల్‌ ఫీజులు కట్టుకోవడం కుదురుతుందా? దానికి నాలుగింతలు కడుతున్నారు. కష్టపడి కొడుకును ఎలాగోలా చదివించుకుంటానని.. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిందైనా ఇవ్వకుంటే ఎలాగని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఏం పీకలేరన్న రోజు వేసిన డబ్బు ఇంకా రాలేదు

ఇటీవల ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వసతిదీవెన డబ్బులను విడుదల చేశారు. ఆ నిధుల విడుదలకు బటన్‌ నొక్కి 10 రోజులు దాటింది. ఆ రోజు సభలో జగన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, మీడియా తననేం పీకలేవని అన్నారు. కానీ ఆ రోజు బటన్‌ నొక్కి వేసేసిన వసతిదీవెన డబ్బులు చారి కుటుంబానికి ఇంకా అందలేదు. అదేవిధంగా గురువారం తిరుపతిలో విద్యాదీవెన ఇస్తున్నామంటూ సీఎం మళ్లీ బటన్‌ నొక్కారు. ఆ డబ్బూ చారి కుటుంబానికి రాలేదు. ‘వైసీపీ నేతగానే కాదు..  అర్హుడిగానైనా నాకు రావాలి కదా’ అని చారి ప్రశ్నిస్తున్నారు. తాను రైతులకు నాగళ్లు తయారుచేసే చిన్న పౌండ్రీ నడుపుతానని.. సొంతంగా పనిచేసుకుంటానని చెబుతున్నారు. వైసీపీ నేతనైన తన పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా లబ్ధిదారులు, అసలేమీ తెలియని వారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.

Read more