Abn logo
Oct 30 2020 @ 18:03PM

ఆసక్తిగా మారిన ప్లేఆఫ్స్ సమరం!

Kaakateeya

యూఏఈ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లీగ్ స్టేజ్ దాదాపు ముగింపునకు చేరుకోగా, గత వారం రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌ల్లో వస్తున్న ఫలితాలు ప్లేఆఫ్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. ముంబై ఇండియన్స్ మాత్రం దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకోగా మిగతా జట్లు మాత్రం ఊగిసలాడుతున్నాయి. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయన్న అంచనాలు గత వారం వరకు ఉండగా, ఇప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారయ్యారు.


కీలక మ్యాచుల్లో ఓడిపోతున్న ఈ రెండు జట్లు తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఇక, ప్రదర్శనలోనూ, పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచిన ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోగా, గత రెండు మ్యాచ్‌ల్లోనూ తిరిగి మునుపటి ఫామ్ ప్రదర్శిస్తున్న సీఎస్‌కే ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీస్తోంది. అయితే, మిగతా జట్లన్నీ మాత్రం ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్‌లో బలమైన జట్టుగా ఉన్నప్పటికీ పేలవ ప్రదర్శనతో ఇప్పటి వరకు కప్పు నోచుకోని బెంగళూరు జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానికి చేరుకుంది. 14 పాయింట్లతో ఉన్న ఆ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం ఖాయమని అందరూ భావించారు. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి ఆ జట్టుపై అభిమానులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. ఆ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లాలంటే కనీసం ఒక్కమ్యాచ్‌లోనైనా గెలవాల్సి ఉంటుంది. బెంగళూరు తన తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత ఢిల్లీతో ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లు బలమైనవే కావడంతో బెంగళూరు భవిత్యాన్ని ఇప్పుడే చెప్పలేం. 


ఢిల్లీ కేపిటల్స్ 

ఢిల్లీ కేపిటల్స్ పరిస్థితి కూడా ఇంచుమించు బెంగళూరు లాంటిదే. తొలి నాలుగు జట్లలో ఉంటుందని ఆశించినా ప్లే ఆఫ్స్ ముంగిట వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలై పీకల మీదికి తెచ్చుకుంది. దీనికి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా, ఆ తర్వాత బెంగళూరుతో ఆడనుంది. ముంబై ఇండియన్స్‌తో ఓడిపోయి, హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైతే, ఆ తర్వాత ఢిల్లీ-బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారుతుంది. 


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 

ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్‌ పరిస్థితి కొంత భిన్నం. వరుస పరాజయాలతో అట్టడుగున ఉన్న ఆ జట్టు గేల్ బ్యాట్ పట్టిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలవడం క్రీడా పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. 12 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ గెలిస్తే ఆ జట్టు నేరగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. నేడు (శుక్రవారం) రాజస్థాన్‌తో తలపడనుండగా, ఆ తర్వాత చెన్నైతో తలపడనుంది. 


కోల్‌కతా నైట్ రైడర్స్ 

ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడి పీకల మీదికి తెచ్చుకుంది. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా, మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ కనుక గెలిస్తే కోల్‌కతా పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కోల్‌కతా తన తర్వాతి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో మోర్గాన్ సేన గెలిచినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తారన్న నమ్మకం లేదు. అప్పుడు ఇతర జట్ల జయాపజయాలపై దాని అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ 

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా కోల్‌కతా, రాజస్థాన్ లాంటిదే. వారి భవిష్యత్తు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే దాని నెట్ రన్‌రేట్ ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉండడమే. హైదరాబాద్ తన తర్వాతి మ్యాచుల్లో బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఆ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు. 

 

రాజస్థాన్ రాయల్స్ 

రాజస్థాన్ నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు చావో, రేవో. ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలకు ముగిసిపోయినట్టే. అయితే, గెలిస్తే, అది కూడా భారీ తేడాతో విజయం సాధిస్తే మాత్రం నాలుగో స్థానం కోసం బరిలో నిలిచే ఉంటుంది. అయితే, ఇది గెలుపు మార్జిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక, చివరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. అప్పుడా మ్యాచ్ ప్లే ఆఫ్స్‌కు స్ట్రెయిట్ షూటవుట్‌ అవుతుంది.

Advertisement
Advertisement