Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 14 Mar 2022 17:19:16 IST

ఇండియాలో రోహింగ్యాల జీవన పోరాటం.. మద్దతు లేక అగచాట్లు!

twitter-iconwatsapp-iconfb-icon

బెంగళూరు: ఉత్తర బెంగళూరులోని దాసరహళ్లిలో నగరంలోని అతిపెద్ద టెక్నాలజీ పార్కుల్లో ఒకటైన మాన్యత ఎంబసీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో 315 మంది రోహింగ్యా శరణార్థులు తాత్కాలిక నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. దాదాపు 500 మంది ఉన్న రోహింగ్యా శరణార్థులు ఉన్న మూడు స్థావరాల్లో ఇదొకటి. మయన్మార్‌లో ‘జాతి ప్రక్షాళన’ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారే వీరంతా.


వెదురు కర్రలతో నిర్మించుకున్న చిన్నచిన్న గుడారాలకు మరుగుగా చుట్టూ గోనె సంచులు కప్పుకున్నారు. ఒక్కో గుడారంలో సగటున ఆరుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. మొత్తంగా 60 మంది చిన్నారులు సహా 63 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి కుటుంబం తాము ఉంటున్న భూమి యజమానికి నెలకు రూ. 2 వేలు అద్దెగా చెల్లిస్తోంది. వారి గుడారాల చుట్టూ ప్లాస్టిక్ వ్యర్థాలు, బీరు సీసాలు వంటివి గుట్టలుగా పడి ఉన్నాయి. వ్యర్థాల సేకరణ ద్వారా వచ్చే డబ్బుల నుంచి వీరు ఇంటి అద్దె చెల్లిస్తారు. మిగిలిన దాంతో పొట్ట నింపుకుంటారు.


వీరు ప్రధానంగా ముస్లింలే. నాలుగు దశాబ్దాలుగా హింసను ఎదుర్కొంటున్న జాతి సమూహమే రోహింగ్యాలు. మయన్మార్‌లో వీరికి అధికారికంగా గుర్తింపు లేదు. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థి శిబిరంగా పేరుగాంచిన బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ ప్రాంతానికి జనవరి 2022 నాటికి 9,20,994 మంది రోహింగ్యాలు తరలిపోయినట్టు అంచనా.


భారత్‌లోని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రకారం 31 డిసెంబరు 2021 వరకు 23,592 మంది శరణార్థులు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, యూఎన్‌హెచ్‌సీఆర్ భారత గణాంకాల ప్రకారం జనవరి 2019 నాటికి 18 వేల మంది రోహింగ్యాలు దేశంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత హింసను ఎదుర్కొంటున్న మైనారిటీగా ఐక్యరాజ్య సమితి వీరిని గుర్తించింది. వీరికంటూ ఎక్కడా ప్రాథమిక హక్కులు లేవు. లైంగకంగానూ హింసను ఎదుర్కొంటున్నారు. 


ఇండియా, బంగ్లాదేశ్‌సహా ప్రపంచంలోని పలు దేశాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడానికి ముందు వీరంతా తూర్పు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో ఉండేవారు. ఇప్పుడు వీరంతా శరణార్థులుగా మారిపోయి కాస్తంత గౌరవం కోసం, జీవనోపాధి కోసం కష్టపడుతున్నట్టు ‘ఇండియా స్పెండ్’ పేర్కొంది. బెంగళూరులోని గుడారాల్లో తలదాచుకుంటున్న శరణార్థుల్లో చాలా మంది రైతులే. వారికి తమ గ్రామాల్లో పశు సంపదతోపాటు వ్యాపారాలు కూడా ఉండేవి. 


‘‘నా కుటుంబానికి 200-250 ఎకరాల భూమి ఉంది. 15 నుంచి 20 మంది మా కోసం పనిచేసేవారు. నేనేమీ పేదవాడిగానో, మురికివాడలోనో పుట్టిన వ్యక్తిని కాదు’’ అని రఖైన్‌లోని బోలి బజార్‌కు చెందిన శరణార్థి కరీముల్లా (42) తెలిపారు. మయన్మార్‌లో రోహింగ్యాలపై హింస తర్వాత 2013లో కరీముల్లా కుటుంబం 15 రోజులపాటు అడవుల్లో నడుస్తూ చివరికి భారత్ చేరుకుంది. ‘‘మేం ఆకులు తినడం ద్వారానే ప్రాణాలు నిలుపుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఎంతోమంది చనిపోవడాన్ని మేం కళ్లారా చూశాం’’ అని కరీముల్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారందరివీ దాదాపు ఇలాంటి గాధలే.


శరణార్థుల కోసం కానీ, ఆశ్రయం కోరే వారి కోసం కానీ భారత్‌లో ప్రత్యేకించి ఎలాంటి చట్టమూ లేదు. వీరికోసం ఉన్నవి పరిమిత చట్టాలే. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపైనే వీరు ఆధారపడతారు. కాబట్టి శరణార్థులకు మద్దతు ఇవ్వడంతోపాటు వారి నిర్వహణ కోసం జవాబుదారీగా ఉండే చట్టం చేయాల్సిన అవసరం ఉందని శరణార్థులు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల జీవనోపాధి ముప్పును ఎదుర్కొంటున్న వేలాదిమంది రోహింగ్యాలు, ఇతర శరణార్థులకు ఆరోగ్య సంరక్షణ, రేషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుతాయని చెబుతున్నారు.  


అక్టోబర్ 2021లో కర్ణాటక ప్రభుత్వం దాని మునుపటి వైఖరిని సవరిస్తూ.. బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న రోహింగ్యాలను పంపించివేసేందుకు తక్షణ ప్రణాళిక ఏదీ చేయలేదని, బహిష్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. ఆర్ఆర్ఏజీ నివేదిక ప్రకారం.. 2021 వరకు నాలుగేళ్లలో కనీసం 1,178 మంది రోహింగ్యాలు వివిధ రాష్ట్రాల్లో అరెస్టయ్యారు. కర్ణాటకలోనూ ఏడుగురిని అరెస్టు చేశారు. 2021లో కనీసం 354 మంది రోహింగ్యా శరణార్థులు అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా 174 మంది, ఢిల్లీలో 95మంది అరెస్టయ్యారు.


వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్టీ, క్రిస్టియన్ వంటి హింసను ఎదుర్కొన్న మతపరమైన మైనారిటీలకు మాత్రమే పౌరసత్వాన్ని అందిస్తుంది. ప్రధానంగా రోహింగ్యా వంటి ఏ దేశమూ లేని వర్గాలను ఇది మరింత దూరం చేస్తుంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.