పక్కా ప్రణాళికతో కరోనా పనిపట్టిన దక్షిణ కొరియా!

ABN , First Publish Date - 2020-04-11T02:37:04+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అగ్రరాజ్యాలై

పక్కా ప్రణాళికతో కరోనా పనిపట్టిన దక్షిణ కొరియా!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన  వారి సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌లు కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా.. అగ్రరాజ్యమైన అమెరికాలో.. చైనా పక్కనే ఉన్న దక్షిణ కొరియాలో ఒకే రోజు మొదటి కొవిడ్-19 కేసు నమోదయ్యింది. అయితే అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ పెరుగుతుంటే.. దక్షిణ కొరియాలో మాత్రం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 17 వేలమంది మరణించగా.. దక్షిణ కొరియాలో మహమ్మారికి బలైన వారి సంఖ్య 208గా ఉంది. యూఎస్‌ఏలో 4.68లక్షల మంది కరోనా బారిన పడితే.. కొరియాలో 10,450 మందికి వైరస్ సోకింది. ఇందులో 6,776 మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి దక్షిణ కొరియా అనుసరించిన వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. 


చైనాలో కరోనా విజృంభించడంతో.. భౌగోళికంగా పక్కనే ఉన్న దక్షిణ కొరియాపై మహమ్మారి ప్రభావం అధికంగా ఉంటుందని అంతా భావించారు. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం చాకచక్యంగా వ్యవహరించి కరోనాను కట్టడి చేసింది. దక్షిణ కొరియాలో మొదటి కరోనా కేసు జనవరిలో నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మెడికల్ కంపెనీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొవిడ్ నిర్ధారణకు ఉపయోగించే టెస్టింగ్ కిట్‌లను పెద్ద మొత్తంలో తయారు చేయాలని ఆదేశించింది. కొద్ది రోజుల్లోనే అత్యంత వేగంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వేలాది టెస్టింగ్‌ కిట్‌లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష ఫలితాల కోసం నిరీక్షణకు తావులేకుండా విస్తృతంగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. దీంతో అనుమానితులకు గుర్తించడం.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం, కరోనా సోకిన వారిని నిర్ధారించడం, వైద్యం అందించడం సులభం అయింది. 


కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంది. జీపీఎస్ ద్వారా కరోనా అనుమానితుల కదలికలపై కొరియన్ ప్రభుత్వం నిఘా ఉంచింది. అనుమానితులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. జీపీఎస్ రికార్డు ద్వారా వారు తిరిగిన ప్రదేశాన్ని వెంటనే గుర్తించి, ఆ ప్రదేశంలో ఇతరులు తిరగకుండా చర్యలు తీసుకుంది. ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే.. ఫోన్‌లకు సంక్షిప్త సందేశం అందేలా ఏర్పాట్లు చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా వైరస్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించింది.  ఇలా దక్షిణ కొరియా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్లి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలించింది. ప్రస్తుతం యూకే కూడా దక్షిణ కొరియా మార్గాన్నే ఎంచుకుంది. జీపీఎస్ ద్వారా కరోనా అనుమానితుల కదలికలను గుర్తించేందుకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపోతే అమెరికా కరోనా కట్టడికి దక్షిణ కొరియా సహాయాన్ని కోరింది. టెస్టింగ్ కిట్‌లు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అభ్యర్థించింది.


Updated Date - 2020-04-11T02:37:04+05:30 IST