ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2020-11-29T06:19:13+05:30 IST

తుంగభద్ర నదిలో మురుగునీరు కలుస్తుండడంపై పుష్కరాలకు వస్తున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత నిర్లక్ష్యమా?
నగర శివార్లలోని పంప్‌హౌస్‌ వద్ద నదిలో కలుస్తున్న మురుగునీటిని పరిశీలిస్తున్న నాయకులు

  1. తుంగభద్రలో డ్రైనేజీ నీరు.. భక్తుల ఆగ్రహం
  2. ప్రభుత్వం, అధికారుల తీరుపై అసంతృప్తి
  3. నగర ఘాట్లలో టీడీపీ నాయకుల పరిశీలన
  4. తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై అసహనం


కర్నూలు, ఆంధ్రజ్యోతి: తుంగభద్ర నదిలో మురుగునీరు కలుస్తుండడంపై పుష్కరాలకు వస్తున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటితోనే స్నానం చేస్తే పుణ్యం సంగతెలా ఉన్నా.. రోగాల బారిన పడుతామని ఆందోళన చెందుతున్నారు. పుష్కరాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, కర్నూలు కార్పొరేషన్‌ చేతులెత్తేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తుంగభద్రలో నగరంలోని మురుగునీరంతా కలిపేస్తున్నారని, ఆ నీటిలోనే పుష్కర స్నానాలు చేయాల్సి వస్తోందని శనివారం ఆంధ్రజ్యోతిలో ‘పుణ్యమేమోగానీ.. రోగాలు రాకుంటే సరి’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీడీపీ నాయకులు కూడా స్పందించారు. కర్నూలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, అనంతపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాల టీడీపీ సమన్వయకర్త ప్రభాకర్‌ చౌదరి, నంద్యాల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి,  నరసింహయ్య యాదవ్‌ తదితరులు నగరంలోని పుష్కర ఘాట్లను శనివారం సందర్శించారు. రాఘవేంద్ర మఠం, రాంబొట్ల దేవాలయం ఘాట్లతో పాటు పంప్‌ హౌస్‌ వద్ద తుంగభద్రలో సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్ద మురుగు నీరు కలుస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. 


పనిచేయని శుద్ధి ప్లాంట్లు

ఎస్టీపీ 0.80 ఎంఎల్‌డీ చొప్పున సామర్థ్యంతో ఎస్టీపీలు పంప్‌ హౌస్‌, సంకల్‌భాగ్‌ ఘాట్‌, వన్‌టౌన్లోని జమ్మిచెట్టు వద్ద ఉన్నాయి. వన్‌టౌన్‌ ప్లాంటు రెండున్నరేళ్ల క్రితం మూతపడింది. పుష్కర పనుల్లో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్లు పగిలి రెండోది కూడా పనిచయలేదు. ఒక్క కేంద్రమే అందుబాటులో ఉంది. ఆ మూడూ పనిచేనా 2.4 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి జరుగుతుంది. నగరం నుంచి విడుదలవుతున్న 60 ఎంఎల్‌డీ మురుగు నీటికిగాను 0.80 ఎంఎల్‌డీ మాత్రమే అధికారులు శుద్ధి చేస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా కొంత నీటిని మళ్లించేందుకు తాత్కాలిక పైపులైన్లు వేశారు. వీటి ద్వారా సుమారు 20 ఎంఎల్‌టీ మురుగును రాంబొట్ల దేవాలయం ఘాట్‌ పక్కనే విడుదల చేస్తున్నారు. మిగిలీన 60 ఎంఎల్‌డీ నీటిని మళ్లిస్తున్నామని అధికారులు చెప్పుకుంటున్నారు. తాత్కాలిక పైపులైన్లతో ఆ నీటిని మళ్లిస్తున్నా.. అధిక శాతం పంప్‌ హౌస్‌ కింద, సంకల్‌ భాగ్‌ ఘాట్‌కు కొన్ని మీటర్ల పైన నదిలో కలిసిపోతోంది. 


సుప్రీం ఆదేశాలు బేఖాతరు

పట్టణాల నుంచి విడుదలయ్యే డ్రైనేజీ నీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు కూడా ఆ ఆదేశాలను బలపరుస్తున్నాయి. కానీ ఆ ఆదేశాలను కర్నూలులో బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మునిసిపాలిటీ, కార్పొరేషన్ల నుంచి విడుదలయ్యే మురుగు నీటిని భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా పంపింగ్‌ హౌస్‌కు, తద్వారా సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు మళ్లించాలి. అక్కడ దశల వారీగా శుద్ధి చేసి సంపుల ద్వారా పొలాలకు లేదా డివైడర్లలోని గ్రీనరీ పెంపుదలకు వినియోగించాలి. మిగిలిన వాటిని నదిలోకి వదలొచ్చు. కర్నూలులో వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు ఉన్న నిధులను ఉపయోగించుకోలేక నేరుగా నదిలోకే వదిలేస్తున్నారు. 


కేఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలి 

సీఎం జగన్‌ పుష్కర ప్రారంభానికి వస్తున్నారని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించి తుంగభద్రలో డ్రైనేజీ వదిలిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలంపూర్లో భక్తులు నిండుగా ఉన్నా.. నిర్వహణ లోపంతోనే  జిల్లాలో స్నానాలకే రావడంలేదు. పైపులైన్ల ద్వారా మురుగు నీరు మరల్చలేకపోయిన అధికారుల చేతుల్లో పుష్కర బాధ్యతలు పెట్టిన జగన్‌ ప్రభుత్వం భక్తులకు సమాధానం చెప్పాలి. -మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు


ముందుచూపులేని నాయకత్వం

నాయకులను, కాంట్రాక్టర్లను బాగుచేసేందుకే స్నానాల్లేని పుష్కరాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. సౌకర్యాలు కల్పించలేక, కలుషిత నీటిని తుంగభద్రలోకి వదిలేస్తోంది. పుష్కరాలలో భారీ అవినీతి జరిగింది. ముందుచూపు లేని నాయకత్వానికి తుంగభద్ర పుష్కరాలే ప్రత్యక్ష ఉదాహరణ. - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు


ప్రోక్షణకు కూడా ఇష్టపడరు

మురుగునీళ్లను ప్రోక్షణకు వాడటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఇక్కడ ఏకంగా స్నానాలకు పంపిణీ చేస్తున్నారు. పుష్కరాలు ఎలా నిర్వహించాలో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి. - ప్రభాకర్‌ చౌదరి, కర్నూలు, నంద్యాల లోక్‌సభల టీడీపీ సమన్వయకర్త



ఏఈకి చార్జిమెమో

కర్నూలు(అర్బన్‌), నవంబరు 28: తుంగభద్ర నదిలోకి మురుగునీరు వదులుతున్న వైనంపై కార్పొరేషన్‌ కమిషనర్‌ డీకే బాలాజీ ఏఈ జయదేవ్‌కు శనివారం చార్జి మెమో జారీ చేశారు. ఈ అంశంపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి  స్పందించారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌ సమీపంలోని సంప్‌వెల్‌లోకి ఎంత మురుగు నీరు వచ్చి చేరుతోంది? పైపు లైన్‌ ద్వారా ఎంత నదిలోకి పంపుతున్నాం? అనే అంశాలపై పర్యవేక్షణ విస్మరించడంతో పాటు విధులకు హాజరు కాకపోవడంపై మెమో జారీ చేశారు. 24 గంటల్లోపు సంజాయిషీ ఇవ్వకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. 


నిధులన్నీ డివైడర్లు, రోడ్లకే సరిపెట్టారు 

కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రోడ్లు, ఘాట్లు, డివైడర్ల నిర్మాణంతో సరిపెట్టారు. స్నానాలకు స్వచ్ఛమైన నీటిని అందించలేకపోయారు. నగరంలోని మురుగు నీటిని ప్రత్యేక పైపులైన్ల ద్వారా మళ్లించలేకపోయారు. రోజా వీధి, అమీర్‌ హైదర్‌ నగర్‌ తదితర కాలనీల నుంచి వచ్చే కలుషిత నీరు తుంగభద్రలో చేరడంతో దుర్వాసన వస్తోంది. కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి. అధికారులు ప్రజారోగ్యాన్ని మరిచిపోయారు. - రాజేష్‌ అండ్‌ ఫ్యామిలీ, వెంకటరమణ కాలనీ, కర్నూలు


ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి 

భక్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కనీసం పుష్కరాల సమయంలో మురుగు నీరు తుంగభద్రలో కలవకుండా చూడాల్సిన బాధ్యత వారిది. జల్లు స్నానాలు ఏర్పాటుచేశారే కానీ భక్తులంతా నదీ స్నానాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మురుగు నీటిలో స్నానాలు చేయాల్సి వస్తుందని ఊహించలేదు. - ముంతాజ్‌ అండ్‌ ఫ్యామిలీ, కర్నూలు

Updated Date - 2020-11-29T06:19:13+05:30 IST