ఎంత పని చేశావ్‌ చేపా

ABN , First Publish Date - 2022-05-22T06:55:16+05:30 IST

‘రోడ్‌ సైడ్‌ బిజినెస్‌ వద్దు. నీట్‌గా.. క్వాలిటీగా చేప మాంసాన్ని అమ్ముదాం. వినియోగదారులను మనవైపు తిప్పుకుందాం.

ఎంత పని చేశావ్‌ చేపా
రంగులు, బోర్డులు వేసినప్పటికీ ఇంకా ప్రారంభం కాని షాపు

రోడ్డు పక్కన అమ్మేటోళ్లం

ఫిష్‌ అంధ్రా అన్నావ్‌.. ఫినిష్‌ చేశావ్‌

రూ.10 తక్కువని.. రూ.20 ఎక్కువకు..

హబ్‌ వలలో దుకాణదారుల విలవిల

మత్స్యశాఖ తీరుపై బాధితుల ఆగ్రహం


‘రోడ్‌ సైడ్‌ బిజినెస్‌ వద్దు. నీట్‌గా.. క్వాలిటీగా చేప మాంసాన్ని అమ్ముదాం. వినియోగదారులను మనవైపు తిప్పుకుందాం.  రిచ్చెస్ట్‌ వ్యాపారాలు చేద్దాం. లాభాలు గడిద్దాం..’ ఇవి మత్స్యశాఖ అధికారులు జిల్లాలోని మత్స్యకారులు, ఔత్సాహికులకు చెప్పిన మాటలు. సమావేశాలు నిర్వహించి మరీ ఊరించారు. ‘రూ.30 వేలు పెట్టుబడి పెట్టండి. దుకాణం చూపించండి. ఇక అంతా మేము చూసుకుంటాం. మార్కెట్లో కన్నా కేజీ చేపలపై రూ.10 తక్కువకు ఇస్తాం. మీరు ఏ రకం చేపలు కావాలంటే అవి సరఫరా చేస్తాం. మీరు చేయాల్సిందల్లా వ్యాపారం’ అన్నారు. ఊహల్లో విహరించేలా చేశారు. అనంతపురం నగరంలో ఫిష్‌ ఆంధ్రా పేరుతో చేపల యూనిట్లను ఏర్పాటు చేశారు. కొందరు నమ్మి, రూ.30 వేలు చెల్లించి మరీ షాపులను తెరిచారు. నెల రోజులు కూడా గడవలేదు. అంతా మాయ అని తేలిపోయింది. ‘తక్కువ ధర సంగతి దేవుడెరుగు, కనీసం మేము కోరిన రకాలనైనా ఇవ్వండయ్యా.. వ్యాపారం చేసుకుంటాం’ అన్నా ఇచ్చేవారు కరువయ్యారు. అధికారులు సృష్టించిన ‘ఫిష్‌ ఆంధ్రా’ మాయాలోకంలో పడి నష్టపోయిన మత్స్యకారులు, ఔత్సాహికులు లబోదిబోమంటున్నారు.

- అనంతపురం ప్రెస్‌క్లబ్‌


వల విసిరారా..?

రోడ్డు పక్కన చేపల వ్యాపారంతో పెద్దగా లాభాలు ఉండవని, ఫిష్‌ ఆంధ్రా షాపులు ఏర్పాటు చేస్తే లాభాలు గడించవచ్చని మత్స్యశాఖ అధికారులు సూచించారు. 2020లో సీఎం జగన ఫిష్‌ హబ్‌ల ఏర్పాటు గురించి ప్రకటించారు. దీంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తూ, గత ఏడాది నవంబరులో ఔత్సాహికుల సమావేశాలు నిర్వహించారు. నాణ్యమైన చేపలు, శుభ్రంగా అందించి, వినియోగదారులను ఆకట్టుకోవచ్చని చెప్పారు. పైగా సముద్ర తీర ప్రాంతాల్లో లభించే పలు రకాల చేపలను అందిస్తామని చెప్పారు. కేవలం రూ.30 వేలు బ్యాంకులో డీడీ తీస్తే, మిగిలిన రూ.1.70 లక్షలు తామే భరించి ఫ్రిజ్‌, చేపలను వండేందుకు గ్యాస్‌ స్టవ్‌, బతికిన చేపలను చూపించేందుకు నీటితొట్టె తదితర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. దీంతో నగరంలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఈ ఏడాది జనవరిలో కొన్ని దుకాణాలు మొదలయ్యాయి. కానీ హామీ మేరకు చేపలను సరఫరా చేయలేకపోయారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.


నిరుపయోగం

ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌షాపులకు ఫ్రిజ్‌లు, గ్యాస్‌ స్టవ్‌, నీటితొట్టె తదితర సామగ్రిని సమకూర్చారు. కానీ వ్యాపారాలు లేకపోవడంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. సామగ్రిని మూలన పడేశారు. 


ఏం లాభం..?

మార్కెట్లో కట్ల, రోహు చేపల ధర కిలో రూ.100 నుంచి రూ.105 వరకూ ఉంది. దీనికంటే ఫిష్‌ ఆంధ్రాకు రూ.10 తక్కువ ధరకు, కిలో రూ.90 నుంచి రూ.95కు ఇవ్వాలి. కానీ హబ్‌ ప్రమోటర్లు కేజీ రూ.120 చెబుతున్నారు. ఇది మార్కెట్‌ ధరకంటే రూ.20 వరకూ ఎక్కువ. ఇదేమని అడిగితే ఇష్టముంటే తీసుకోండి, లేదంటే లేదు అంటున్నారట. దీంతో దుకాణ నిర్వాహకులు అవాక్కవుతున్నారు. లైవ్‌ ఫిష్‌ విషయంలోనూ ఇట్లే వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కిలో రూ.120 ఉండగా, హబ్‌ నిర్వాహకులు రూ.150కి ఇస్తామని చెబుతున్నారు. రవాణా ఖర్చు, సైజును బట్టి ధరలుంటాయని అంటున్నారని దుకాణ నిర్వాహకులు వాపోతున్నారు. ఇవన్నీ షాపులను ఏర్పాటు చేయకముందే చెప్పాల్సిందని, ఇప్పుడు చెబితే ఎలా అని బాధితులు మండిపడుతున్నారు. అధికారులను అడగలేక, హబ్‌ నిర్వాహకులతో వాదించలేక కొందరు షాపులను ఖాళీ చేసేందుకు సిద్ధపడుతున్నారు.  వీరి కష్టాలను చూసి, కొత్తవారు దుకాణాలను తెరవాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయారు. 


హబ్‌ కోసం ఇంత కష్టపడాలా...?

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతలో ఏర్పాటు చేసేందుకు ఆరేడు నెలలు హబ్‌ నిర్వాహకుల కోసం అన్వేషించారు. చివరకు ఓ పారిశ్రామికవేత్త ముందుకొచ్చారు. కానీ, వంద యూనిట్లు ఉంటేనే హబ్‌ సాగుతుందని, కనీసం 50 యూనిట్లు ఏర్పాటు చేస్తే ముందుకొస్తామని ఆయన షరతు పెట్టినట్లు సమాచారం. ఆ టార్గెట్‌ మేరకు అధికారులు ఏడాదిన్నరపాటు తంటాలు పడ్డారు. ఇప్పటి వరకూ 16 యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మరో రెండుమూడు ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. ఇచ్చిన హామీ మేరకు తక్కువ ధరకు చేపలు సరఫరా చేయనందుకే కొత్త యూనిట్లు రావడం లేదని, ఉన్నవి మూతబడే పరిస్థితి ఉందని విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ల కోసం, పైస్థాయిలో గొప్పలు చెప్పుకునేందుకు తమను బలి చేశారని పలువురు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 నిర్వీర్యం చేసేందుకే..

ఫిష్‌ ఆంధ్ర షాపుల ఏర్పాటుతో తమకు నష్టమొస్తుందని కొందరు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారు. చెప్పిన ధరల మేరకే చేపలను విక్రయిస్తున్నాం. ఒక్కోరోజు ఒక్కో ధర ఉంటుంది. ఇదంతా కావాలనే చేస్తున్నారు. వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే జరుగుతున్న కుట్ర ఇది. 

- శాంతి, డీడీ, మత్స్యశాఖ


మోసపోయాం సార్‌..

‘మేమేదో మంగళ, ఆదివారాల్లో మార్కెట్లో 10-15 కేజీలు చేపలు కొని అమ్ముకునేవాళ్లం. దుకాణం పెడితే లాభాలొస్తాయని అధికారులు చెప్పారు. అప్పటికీ మాకెందుకు సార్‌ అవన్నీ.. ఏదో రోడ్డుపక్కన రెండుమూడు గంటలు అమ్ముకునేటోళ్లం అన్నాం. చెప్పినా వినలేదు. మా సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులతో చెప్పించారు. బలవంతంగా రూ.30 వేలు కట్టించి షాపు తెరిపించారు. చేపల తొట్టి, ఐసు బాక్సు, గ్యాస్‌ స్టవ్‌ ఇచ్చారు. మేం ఉండేచోట చేపలు కొనడమే ఎక్కువ. బతికిన చేపలు చూసి కొనేదెవరు..? మేము వండితే తినేవాళ్లు ఎవరున్నారు..? బయటకన్నా రూ.10 తక్కువకు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేజీపై రూ.20 ఎక్కువ అంటున్నారు. ఇదేందని అడిగితే... దూరం నుంచి తీసుకొస్తున్నాం.. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు అవుతున్నాయి.. సైజును బట్టి రేట్లు ఉంటాయి అంటున్నారు. ఏం చేస్తాం.. మోసపోయాం..’

- నగర శివారులోని ఓ దుకాణదారుడి ఆవేదన


‘నేను చేపలు పట్టుకొని బళ్లారి బైపాస్‌, కళ్యాణదుర్గం బైపా్‌సలో అమ్ముకునేవాడిని. 10 కేజీల చేపలు మార్కెట్లో రూ.800కు వచ్చేవి. అమ్మితే రూ.1200 వచ్చేది. రూ.400 మిగిలేది. ఫిష్‌ ఆంధ్రా షాపు పెట్టుకుని మూడు నెలలు అయింది. రోజుకు ఐదు కేజీలు కూడా పోవడం లేదు. పైగా షాపు పెట్టేముందు బయటకన్నా కేజీపై రూ.10 తగ్గించి ఇస్తామన్నారు. ఇప్పుడు చూస్తే కేజీ కట్ల, రోహు చేపలు రూ.120 అంటున్నారు. బతికిన చేపలైతే కేజీ రూ. 150 అంట. ఎవరుకొనుక్కుంటారు..? అక్కడ రూ.30 వేలు పాయ. నెలన్నర నుంచి వ్యాపారం లేదు. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే షాపును ఖాళీ చేద్దామనుకున్నాను. హబ్‌ వాళ్లతో కాకుండా, మార్కెట్లో చేపలు తెచ్చి అమ్ముకుంటున్నా.

- నగరంలోని ఓ దుకాణదారు

Updated Date - 2022-05-22T06:55:16+05:30 IST