భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ధర ఎంత ఉండొచ్చంటే..?

ABN , First Publish Date - 2020-10-31T22:45:58+05:30 IST

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? వస్తే ధర ఎంత ఉంటుంది? భారీగా ఉంటుందా? ..

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ధర ఎంత ఉండొచ్చంటే..?

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? వస్తే ధర ఎంత ఉంటుంది? భారీగా ఉంటుందా? ఉచితంగా ఇస్తారా? భరించగలిగే ధరకే అందుబాటులోకి వస్తుందా? ఇవన్నీ ప్రస్తుతం అందర్నీ ఆలోచింప చేస్తున్న ప్రశ్నలు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయనే సమాధానం ఒక్కటే ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు మార్గాలు అన్వేషిస్తుండగా, వ్యాక్సిన్ విడుదలయ్యే నాటికి దాని రెండు డోసుల (డబుల్ డోస్) ధర రూ.450 నుంచి రూ.5,500 వరకూ ఉండొచ్చని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా అంచనా ధర (ఎస్టిమేటెడ్ ప్రైజ్) సింగిల్ డోస్ రూ.2,700 వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.


ధరను నిర్ణయించడమెలా?

వ్యాక్సిన్‌ ధరను దానికయ్యే పరిశోధన, అభివృద్ధి ఖర్చులను బట్టి నిర్ధారించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 170 వ్యాక్సిన్లు అనుమతుల (అప్రూవల్) కోసం ఎదురుచూస్తుండగా, వీటిలో 50 వరకూ క్లినకల్ హ్యూమన్ ట్రయిల్స్‌‌‌లోకి అడుగుపెట్టాయి. వీటిలో 10 వరకూ ట్రయిల్స్ చివరి స్థాయిలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా వంటి దేశాలు ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా ముందు అందుకునేలా అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాయి.


వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశంలోని కనీసం 60 శాతం మందికైనా వ్యాక్సిన్స్ అసరమని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి ఒకటికి బదులు రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసింది. బీహార్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. అయితే ఆర్థిక మాంద్యం, నెగిటివ్ వృద్ధి రేటు పరంగా చూసినా, వ్యాక్సిన్ లభ్యత దృష్ట్యా చూసినా, ఈ వాగ్దానం అమలు చేయడం కష్టంగానే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-10-31T22:45:58+05:30 IST