Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాలు ఏ వయసు వాళ్లు ఎంత తాగాలంటే..?

ఆంధ్రజ్యోతి(24-02-2020)

ప్రశ్న: పాలు చాలా మంచివని అంటారు. ఏ వయసు వాళ్ళు ఎంత మోతాదులో తాగాలో వివరిస్తారా?


- రమ్యశ్రీ, నల్గొండ


జవాబు : పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, పనీర్‌, చీజ్‌ నుంచి కాల్షియం, ప్రోటీన్లు; వెన్న తీయని పాల నుంచి అధిక మొత్తంలో శక్తి, కొవ్వు పదార్థాలు లభిస్తాయి. ఎదిగే వయసులోని పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం. పాలలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తప్పనిసరి. సంవత్సరం లోపు పిల్లలకు తల్లి పాలు లేదా వైద్యులు సూచించిన ఫార్ములా పాలు మాత్రమే పట్టాలి. రెండేళ్లు దాటినప్పటి నుంచీ  పిల్లలకు రోజుకు రెండు, మూడు గ్లాసుల పాలు ఇవ్వవచ్చు. పాలలోని పోషకాలు పెరుగుతో కూడా వస్తాయి కాబట్టి, పద్దెనిమిదేళ్లు దాటిన వారంతా రోజుకు మూడు కప్పుల పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. టీనేజ్‌ దాటిన తరువాత...  వెన్న తగ్గించిన లేదా తీసివేసిన పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల అందులోని అధిక కెలోరీలకు దూరంగా ఉండవచ్చు. ఎదిగే పిల్లలకే కాదు... మెనోపాజ్‌కు దగ్గరలో ఉన్న మహిళలకు కూడా కాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. వయసుతో పాటు ఎముకలు పెళుసుబారడమనే సమస్యను నివారించడానికి మహిళలకు రోజుకు మూడు గ్లాసుల పాలు లేదా పెరుగు అవసరం. ఒకవేళ లాక్టోస్‌ పడకపోవడమో లేదా ఏదైనా ఎలర్జీ వల్లో పాలు, పాల ఉత్పత్తులు తీసుకోలేనివారు డాక్టరు సలహా మేరకు విటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. సోయా పాలు, సోయా పనీర్‌ వంటి ప్రత్యామ్నాయాలు వాడాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...