ఇంకా ఎంతకాలం?

ABN , First Publish Date - 2022-08-06T05:59:00+05:30 IST

రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారి మూడేళ్ళు ముగిసాయి. 2019 ఆగస్టు 5న రాజ్యసభ తీర్మానంతో, మర్నాడు రాష్ట్రపతి ఆమోదంతో ఆర్టికల్ 370 రద్దయింది...

ఇంకా ఎంతకాలం?

రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారి మూడేళ్ళు ముగిసాయి. 2019 ఆగస్టు 5న రాజ్యసభ తీర్మానంతో, మర్నాడు రాష్ట్రపతి ఆమోదంతో ఆర్టికల్ 370 రద్దయింది. కేంద్రపాలిత ప్రాంతాలు తగ్గుతూ, రాష్ట్రాలుగా అవతరించాల్సిన ప్రజాస్వామ్యదేశంలో అందుకు పూర్తి భిన్నమైన ఈ నిర్ణయం తీసుకుంటూ, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అన్న హామీ ఆ రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చింది. ఈ నిర్ణయానికి ముందు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను అటుంచితే, ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఉద్ధరించడం ఇత్యాది లక్ష్యాలనేకం ఇందుకు కారణమని కేంద్రప్రభుత్వం చెప్పింది. విపక్షనేతలను గృహనిర్బంధాల్లో ఉంచి, పౌరుల కదలికలను, పాత్రికేయుల రాతలనూ నియంత్రిస్తూ నెలల తరబడి తీవ్రనిర్బంధం మధ్యన జమ్మూకశ్మీర్ విషయంలో తాను అనుకున్నది చేసింది కేంద్రప్రభుత్వం. 


జమ్మూకశ్మీర్‌కు పర్యాటకులు ఇంతపెద్ద సంఖ్యలో రావడం డెబ్బయ్యేళ్ళలో ఎన్నడూలేదనీ, హోటళ్ళు, పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయాలు జనంతో కిటకిటలాడిపోతున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్నకు మాత్రం అది ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ, బీజేపీదీ కాదన్నారు. 2018 జూన్‌లో పీడీపీతో బీజేపీ తెగతెంపులు చేసుకోగానే రాష్ట్రంలో గవర్నర్ పాలన వచ్చింది. నవంబరులో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత ప్రకటించగానే రద్దయిన అసెంబ్లీ ఇప్పటికీ తెరుచుకోలేదు. డీలిమిటేషన్ ప్రక్రియతో ఎన్నికలను ముడిపెట్టినందున, మొన్న మే నెలలో కమిషన్ నివేదిక సమర్పించడంతో మళ్ళీ ప్రశ్నలు మొదలైనాయి. కమిషన్ నివేదిక యావత్తూ ఎన్నికల్లో బీజేపీ విజయానికి దారులుపరిచే రీతిలో తయారైందని విపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. తన ఉనికిని చాటుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు సత్వరమే జరిపించిన బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎందుకు వేగం చూపడం లేదన్నది స్థానికుల ప్రశ్న.


మూడేళ్ళ తరువాత జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మారలేదని నిట్టూరుస్తున్నవారు ఉన్నట్టే, ఎంతోకొంత గాడినపడిందని అంటున్నవారూ ఉన్నారు. ముందు నిర్బంధం, ఆ తరువాత కరోనా కారణంగా మూడేళ్ళుగా తెరుచుకోని పాఠశాలలు మొన్న మార్చినుంచి పనిచేయడం ఆరంభించాయి. రాళ్ళు రువ్వడం, నిరసనలు వంటి సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. బహిరంగంగా చేసే ఓ చిన్నవ్యాఖ్య, ఓ నినాదంతో జనాన్ని ప్రజాభద్రత, ఉపా వంటి కఠినమైన చట్టాల ప్రయోగంతో జైళ్ళలోకి నెడుతున్నందున ఎవరూ అంత ధైర్యం చేయడం లేదు. గతంతో పోల్చితే ఉగ్రవాదులు భారీగా విరుచుకుపడే పరిస్థితులు కూడా లేవు. కానీ, ఓ చిన్న తుపాకీతో వచ్చి ఎవరు ఎవరిని కాల్చిపోతారన్న భయం మాత్రం కొనసాగుతున్నది. ముఖ్యంగా, మే నెలలో కశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను కార్యాలయంలోనే ఉగ్రవాదులు హత్యచేసిన తరువాత, ఐదువేలమంది పండిట్లు ఉద్యోగానికి రావడం మానేశారు. వీరంతా గత పదేళ్ళుగా అక్కడ అమలవుతున్న ప్రధానమంత్రి పథకంలో భాగంగా జమ్మూనుంచి కశ్మీర్‌కు తిరిగివచ్చినవారు. కనీసం నెలకొకసారి ఓ హిందువు హత్య జరుగుతున్న స్థితిలో, గతంలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా కల్పించిన రిజర్వేషన్‌తో ఉద్యోగాలు చేసుకుంటున్న షెడ్యూల్డ్ కులాలవారు కూడా లోయను విడిచిపోయారు. వీరంతా ఇప్పుడు తమ ఉద్యోగాలను జమ్మూకు బదలాయించాలని ధర్నాలు చేస్తున్నారు. గవర్నర్ రేడియోలో ఇచ్చే ఉపన్యాసాలు వినడం తప్ప ప్రజలకు తమ గోడు చెప్పుకోవడానికి ప్రతినిధులంటూ ఎవరూ లేరు. వారి తరఫున మాట్లాడే హక్కుల సంఘాలు, పౌరసమాజం కనిపించకుండా పోయాయి. భారత అనుకూల ప్రధాన స్రవంతి పార్టీలనూ, నాయకులనూ ఉగ్రవాద అనుకూల శక్తులుగా ముద్రవేసి, చాలాకాలం గృహనిర్బంధాలకూ జైళ్ళకూ పరిమితం చేసినందున అవి కూడా నామమాత్రంగా మిగిలిపోయాయి. భద్రత ముసుగులో, తీవ్రనిర్బంధం మధ్యన సామాన్యులు, పాత్రికేయులు, నాయకులు కూడా నోరువిప్పలేని ఈ ఉక్కపోతవాతావరణాన్ని మరింతకాలం కొనసాగించడం ప్రమాదకరం. సాధ్యమైనంత వేగంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించి, నాలుగేళ్ళుగా ప్రజాస్వామ్య హక్కును అక్కడి ప్రజలకు అందించడం కేంద్రప్రభుత్వం విధి.

Updated Date - 2022-08-06T05:59:00+05:30 IST