ఇచ్చింది ఎంత? గుంజుకున్నది ఎంత?

ABN , First Publish Date - 2022-05-03T08:42:16+05:30 IST

అందినకాడికి అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. చాలవన్నట్టుగా రకరకాల పేర్లతో పన్నులు బాదుతున్నారు.

ఇచ్చింది ఎంత? గుంజుకున్నది ఎంత?

  • ప్రజలపై పన్నులు.. సంక్షేమంలో కోతలు
  • సంక్షేమ ప్రభుత్వమంటూ సర్కారు గొప్పలు
  • వచ్చే రాబడిలో ‘సంక్షేమం’ అంతంతే
  • 2014-15లో ఆదాయం 86,736 కోట్లు
  • అప్పుడు ‘చెత్త’పన్నుల్లేవ్‌..
  • అయినా సంక్షేమానికి 53% ఖర్చు
  • 2020-21లో సర్కారు 
  • ఆదాయం 1,86,551 కోట్లు
  • పన్నుల బాదుడు, అప్పులు అదనం..
  • కానీ సంక్షేమ ఖర్చు 41 శాతమే 
  • రకరకాల నిబంధనలతో పథకాలు కట్‌
  • అమ్మఒడి, రైతు భరోసా సహా 
  • పలు సంక్షేమ పథకాల్లో కోత 

రాష్ట్ర ప్రభుత్వ రాబడి ఎంత..? పన్నుల బాదుడు ఎంత..? సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది ఎంత..? గణాంకాలను పరిశీలిస్తే వైసీపీ సర్కారు చేస్తున్న ‘సంక్షేమం’ అంతంతే. ఈ మాత్రానికే మాది ‘సంక్షేమ సర్కారు’ అంటూ గొప్పలు.. ప్రజల సొమ్ము కోటానుకోట్లు కుమ్మరించి సొంత మీడియాలో ప్రచారార్భాటం..


చంద్రబాబు హయాంలో 2014-15లో ప్రభుత్వ ఆదాయం రూ.86,736 కోట్లు. ఇప్పటిలా అప్పుడు ‘చెత్త’ పన్నులు లేవు. అయినా రాబడిలో 53% సంక్షేమానికి ఖర్చు చేసింది. 2020-21లో జగనన్న సర్కారు ఆదాయం రూ.1,86,551 కోట్లు. అప్పటితో పోలిస్తే లక్ష కోట్లు ఎక్కువ. అలాగే పన్నుల బాదుడు కూడా ఎంతెంతో! అదనంగా లక్ష కోట్ల అప్పు. అయినా ఆ ఏడాది సంక్షేమానికి ఖర్చు చేసింది ఆదాయంలో 41% మాత్రమే. ప్రభుత్వానికి రాబడి పెరిగినప్పుడు సంక్షేమ వ్యయం పెరగాలి కదా! అయితే ఇక్కడ ‘రివర్స్‌’ అన్నమాట. 


ఎవరు రద్దు చేయమన్నారు? 

రకరకాల నిబంధనలతో 6 లక్షల పెన్షన్లు రద్దు చేశారు. 20 లక్షల రేషన్‌కార్డులు రద్దు చేశారు. 86 లక్షల మంది లబ్ధిదారుల్లో 45 లక్షల మందికే రైతుభరోసా ఇస్తున్నారు. 15 లక్షల మంది కౌలు రైతుల్లో 57 వేలమందికే భరోసా. 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి 20 లక్షల మందికే ఇచ్చారు. ఇలాంటి కోతలు ఇంకా ఎన్నెన్నో..! పథకాలను తానే రద్దుచేసి.. వాటిని ఆపమంటున్నారంటూ మీడియాపై జగన్‌ అభాండాలు వేస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అందినకాడికి అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. చాలవన్నట్టుగా రకరకాల పేర్లతో పన్నులు బాదుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూనే.. మరోవైపు ప్రజల నుంచి గుంజుకుంటున్నారు. కేంద్రం నుంచి నిధులూ వస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిలో సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది చాలా తక్కువ. అంతేగాక రకరకాల నిబంధనల పేరుతో సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన చాలామంది లబ్ధిదారులకు ఇప్పుడు పథకాలు అందడం లేదు. జగనన్న సర్కారు వచ్చాక మొదట్లో ప్రయోజనం పొందినవారు కూడా చాలామంది ఇప్పుడు సంక్షేమానికి అనర్హులయ్యారు. అయితే, అంకెల గారడీతో తమది సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్నారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగనన్న సర్కారు సంక్షేమానికి చేస్తున్న ఖర్చు ఎంతో తక్కువ. గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15లో గత ప్రభుత్వం మొత్తం రాబడిలో సంక్షేమానికి 53శాతం ఖర్చు చేసింది.


 ఆ తర్వాత నాలుగేళ్లు సంక్షేమ పథకాలను కొనసాగించింది. అప్పుడు ఇప్పటిలా చెత్తపన్ను, ట్రూఅప్‌ చార్జీలు, విలువ ఆధారిత ఆస్తి పన్ను, పెట్రో ఉత్పత్తులపై పన్నుల పెంపు.. బాదుడు లేదు. ఇక వైసీపీ సర్కారు విషయానికొస్తే 2019-20లో మొత్తం రాబడిలో సంక్షేమానికి ఖర్చుచేసింది 39శాతం మాత్రమే. ఆ మరుసటి సంవత్సరం 41శాతం ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వ హయాం నాటికి, ఇప్పటికి ఆదాయాన్ని పరిశీలిస్తే చాలా పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో చివరి సంవత్సరం 2018-19లో రాష్ట్రానికి రూ.1,50,415 కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ పాలనలో 2019-20లో రూ.1,55,076 కోట్లు, 2020-21లో రూ.1,86,551 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఏటా లక్ష కోట్లకు తగ్గకుండా అప్పులు చేస్తోంది. ఆదాయం పెరిగినా ఆ స్థాయిలో సంక్షేమానికి ఖర్చు చేయడం లేదు. ప్రజలపై రకాల పన్నులు వేస్తున్న జగన్‌ సర్కారు సంక్షేమానికి ఒక్క పైసా కూడా అదనంగా ఖర్చు చేయడం లేదు. 


నిధులన్నీ ఎక్కడికెళ్తున్నాయి? 

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌లు, రాష్ట్రానికి వచ్చే వాటాలు, పన్నుల బాదుడు కలిపి.. వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచి ఆదాయం పెరుగుతూనే ఉంది. ఉదాహరణకు 2014-15లో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదా యం రూ.86,736 కోట్లు. 2020-21లో ఈ ప్రభుత్వ ఆదాయం రూ.1,86,551 కోట్లు. అప్పటితో పోలిస్తే దాదాపు లక్ష కోట్లు అదనంగా రాబడి వచ్చింది. ఆదాయం పెరిగినప్పుడు ఆ మేరకు సంక్షేమ కార్యక్రమాల వ్యయం కూడా పెరగాలి. అయితే వైసీపీ సర్కారు తగ్గించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు 2014లో 53శాతం ఖర్చు చేయగా, 2020-21లో 41శాతమే ఖర్చు చేశారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన పలు సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాల అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గురుకులాలకు బడ్జెట్‌ తగ్గించారు. రైతులకు ఉపయోగపడే ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, బకాయిలు చెల్లించకుండా ఆదాయమంతా ఎక్కడికి పోతోంది? ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి? గజిబిజీ గారడీల లెక్కలతో జగనన్న సర్కారు అయోమయానికి గురి చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు రూ.40 వేల కోట్ల మేర ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతోంది. 


నిబంధనల పేరుతో పథకాలు కట్‌ 

సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొనే వైసీపీ సర్కారు అర్థం పర్ధం లేని నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేసింది. ఏ ప్రభుత్వమైనా ఎంతమంది లబ్ధిదారులు సంక్షేమ పథకాలు పొందుతున్నారు? ఎంత ఖర్చు అవుతోందనే లెక్కలు వేస్తుంది. జగన్‌ సర్కారు  మాత్రం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలంటే ఎలాంటి నిబంధనలు పెట్టాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ పథకాల కింద ప్రయోజనాలు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం లేదు. గత ప్రభుత్వంలో ప్రయోజనం పొందిన చాలామంది లబ్ధిదారులకు ప్రస్తుతం పథకాలు అందడం లేదు. 


‘జలసిరి’ మాయం.. ‘జలకళ’ లేదు

గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరి కింద పేద రైతుల పొలాల్లో బోర్లు ఉచితంగా వేసి సోలార్‌ పంపుసెట్లు ఇచ్చింది. సుమారు 10 వేల మందికి పంపుసెట్లు ఏర్పాటు చేసింది. మరింత మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిన ఈ పథకాన్ని జగనన్న సర్కారు నీరుగార్చింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ పథకానికి వైఎ్‌సఆర్‌ జలకళగా పేరు మార్చింది. కొంతమంది రైతుల పొలాల్లో బోర్లు తవ్వి  మోటార్లు, పైపులు ఇవ్వకుండా నిలిపేసింది. ఈ పథకం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఆర్భాటంగా బడ్జెట్‌లో రూ.200 కోట్లు పెట్టి, రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇక రైతులు పండిన పంటల్లో పదో వంతు కూడా కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు.


సర్కారు ‘కోతలు’..  సంక్షేమానికి కోతలు 

వాస్తవానికి రైతు భరోసా కింద 86 లక్షల మంది లబ్ధిదారులుండగా, 45 లక్షల మందికి మాత్రమే అందిస్తున్నారు.

15 లక్షల మంది కౌలురైతుల్లో భరోసా అందుతోంది 57 వేల మందికే.  

అమ్మఒడి కింద 82 లక్షల మంది అర్హులకు గాను 43 లక్షల మంది ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇచ్చింది 20 లక్షల మందికే. విద్యుత్‌ బిల్లు పెరిగిందనో, రూ.10 వేల జీతం పొందుతున్నారనో, ఇంటి స్థలం ఉందనో కోతలు పెట్టింది.

6 లక్షల మంది డ్రైవర్లకు గాను 1.80 లక్షల మందికి వాహనమిత్ర  ఇచ్చి చేతులు దులుపుకొంది.  

రాష్ట్రంలో 3 లక్షల మంది చేనేతలకు మగ్గాలున్నాయి. రకరకాల నిబంధనలు పెట్టి 80 వేలమందికే నేతన్ననేస్తం అందిస్తోంది. మగ్గాల్లేక కూలీలుగా పనిచేస్తున్న వారికి మొండిచేయి చూపింది. 

3 లక్షల మంది మత్స్యకారులకు గాను 1.09 లక్షల మందికే మత్స్యకార భరోసా అందిస్తోంది. గతంలో ఇస్తున్న పెట్రోల్‌ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా వలలు, బోట్లు ఇచ్చే పథకాలను రద్దు చేసింది. 

రకరకాల నిబంధనలతో సుమారు 6 లక్షల పెన్షన్లు రద్దు చేసింది. 

అనర్హత పేరుతో 20 లక్షల రేషన్‌కార్డులు రద్దు చేసింది. 

‘అందరికీ ఇళ్ల పట్టాలు’ పేరుతో సెంటు స్థలమిచ్చి వారికున్న అసైన్డ్‌ భూములను లాక్కుంటోంది. ఇంటి స్థలాలకు భూములు కొనుగోలు చేసి వైసీపీ పెద్దలు మాత్రం భారీగా సొమ్ము చేసుకున్నారు.  



  • బాదుడే బాదుడు.. 
  • వైసీపీ సర్కారు సంక్షేమమంటూనే.. మరోవైపు పేదల నుంచి గుంజుకుంటోంది. పన్నులు, చార్జీల బాదుడుతో సామాన్యులపై భారం మోపుతోంది. విద్యుత్‌ చార్జీలు పెంచేసింది. ట్రూఅప్‌ చార్జీల పేరుతో మరింత పిండుతోంది. ఒకప్పుడు రూ.300 వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు రూ.1500 వస్తోంది.

  • ఇక పెట్రో ఉత్పత్తులపై అదనపు పన్నులు వసూలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్‌ ధర అధికం. బస్సు చార్జీలనూ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఇక మద్యంపై భారీగా ధరలు పెంచేసి వేలకోట్ల ఆదాయం రాబడుతోంది.

  • దశలవారీ సంపూర్ణ మద్యనిషేధం హామీని అటకెక్కెంచింది. ఆస్తి పన్నును విలువ ఆధారిత పన్నుగా మార్చి వినియోగదారుడిపై భారం వేసింది. ఎప్పుడో నిర్మించుకున్న పేదల ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో బకాయిలు వస్తోంది. ఇక పట్టణాల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో పిండుతోంది. ఆస్తి పన్ను రూపంలో రూ.500 కోట్ల మేర వసూలు చేస్తోంది.

  • ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను కూడా వసూలు చేస్తోంది. వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ పెట్రో ఉత్పత్తుల ధరల భారం మోపింది. మరోవైపు చలానాల రూపంలో జరిమానాలు బాదుతోంది. ఓ చేత్తో ఇస్తూ.. మరో చేత్తో లాక్కుంటోంది. పన్నులు, చార్జీల బాదుడు, పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. మూడేళ్ల కిందట సాధారణ కుటుంబ నెలవారీ ఖర్చు ఇప్పుడు రెట్టింపు అయ్యింది. 

Read more