విమానాల్లో భారతీయుల తరలింపునకు ఖర్చు ఎంతంటే..?

ABN , First Publish Date - 2022-02-28T00:25:26+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఉచిత ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకువస్తామని భారత ప్రభుత్వం..

విమానాల్లో భారతీయుల తరలింపునకు ఖర్చు ఎంతంటే..?

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఉచిత ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకువస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా విమాన సర్వీసులను కూడా శనివారం నుంచి మొదలుపెట్టింది. ఖర్చులన్నీ ఉచితంగా భరిస్తామని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరలింపు ప్రక్రియలో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత అనేది ఆసక్తి కలిగించే అంశం. ఎయిర్ ఇండియా ఇప్పటికే వందల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. ఇందుకోసం భారీ బోయింగ్ 787 విమాన సేవలను ఉపయోగించుకుంటోంది.


విమానం ఇటు నుంచి  బయులేదిర..అటు నుంచి తిరిగి రావడానికి..అంటే.. ఒక్కో ట్రిప్పుకు రూ.1.10 కోట్లు అవుతుందని ఎయిర్‌లైన్ వర్గాల సమాచారం.  ఫ్లయిట్ ప్రయాణించిన సమయాన్ని బట్టి ఖర్చు కూడా పెరుగుతుంది. గంటకు అయ్యే ఖర్చు రూ.7 నుంచి 8 లక్షలు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎంతదూరం వెళ్తున్నాం అనే దానిపైనే ప్రధానంగా ఖర్చు ఆధారపడి ఉంటుంది. సిబ్బంది, ఇబ్బంది, నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింక్ చార్జీలతో కలిపి మొత్తం ఖర్చు ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ఫ్లయిట్స్ కావడంతో రెండు బ్యాచ్‌ల (టు సెట్స్) సిబ్బంది వీటిల్లో ప్రయాణిస్తారు. వెళ్లేటప్పుడు ఒక బ్యాచ్ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. రెండో బ్యాచ్ విశ్రాంతి తీసుకుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు రెండో బ్యాచ్ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. మొదటి బ్యాచ్ రెస్ట్ తీసుకుంటుంది.


ప్రస్తుతం బుచారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరి) నుంచి ఎయిర్ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ఎవేర్ ప్రకారం, బుచారిస్ట్ నుంచి బయలుదేరిన విమానం శనివవారం రాత్రి ముంబై చేరుకుంది. ఇందుకు 6 గంటలు పట్టింది. బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక విమానం 6 గంటల సమయం తీసుకుంటే, ఢిల్లీ నుంచి బుడాపెస్ట్ బయలుదేరిన మరో విమానం 7 గంటల సమయం తీసుకుంది. బుచారిస్ట్ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో ఎయిర్ ఇండియా విమానం 5 గంటలు తీసుకుంది. ఖర్చుపరంగా చూసినప్పుడు ఒక్కో గంటకు రూ.7 నుంచి 8 లక్షలు అవుతుంది. ఆ ప్రకారం ఒక్కో రౌండ్ ట్రిప్పుకు రూ.1.10 కోట్లు అవుతుంది. ఒక విమానం వెళ్లి, తిరిగి రావడానికి అయ్యే కనీస సమయం సుమారు 14 గంటలుగా లెక్కించవచ్చు. సమయం మరింత ఎక్కువ తీసుకుంటే ఖర్చు కూడా పెరుగుతుంది.


ఉచితం...

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే వారి నుంచి ఎలాంటి ప్రయాణ ఖర్చులు వసూలు చేయమని, ప్రయాణం పూర్తిగా ఉచితమని భారత ప్రభుత్వం ప్రకటిచింది. కొన్ని రాష్ట్రాలు సైతం ముందుకు వచ్చి ఉక్రెయిన్‌ నుంచి వచ్చే తమ రాష్ట్ర ప్రజల ఖర్చులను తామే భరిస్తామని ప్రకటించాయి. డ్రీమ్‌లైనర్‌లో 250కి పైగా సీట్లు ఉంటాయి. గంటకు ఐదు టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. ఇతమిత్థంగా ఎంత ఖర్చు అయ్యిందనేది ఎయిర్‌లైన్ లెక్కించిన తర్వాత ఆ బిల్లును రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వానికి పంపుతుంది.


ఎంతమంది చిక్కుకున్నారు?

ఉక్రెయిన్‌లో ప్రధానంగా విద్యార్థులతో కలిసి 16,000 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా ఈనెల 24న చెప్పారు. అప్పటి నుంచి 900 మందికి పైగా భారతీయులు భారత్‌కు తిరిగి వచ్చారు. మరో 15,000 మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనూ, ఆ సరిహద్దు ప్రాంతాల్లోనూ భారత్‌కు తిరిగి వచ్చేందుకు వేచిచూస్తున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పౌర విమాన సర్వీసుల కోసం తమ ఎయిర్‌స్పేస్‌ను ఉక్రెయిన్ మూసేసింది.

Updated Date - 2022-02-28T00:25:26+05:30 IST