తవ్వకాలతో విధ్వంసమెంత?

ABN , First Publish Date - 2021-12-06T08:26:19+05:30 IST

గోదావరికి ఉప నదిగా ఉన్న మంజీరాలో 20 ఏళ్లుగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల ఎలాంటి మార్పులు సంభవించాయి..

తవ్వకాలతో విధ్వంసమెంత?

  • మంజీరా నదిపై కేంద్ర సర్కారు అధ్యయనం.. 
  • 20 ఏళ్లలో వచ్చిన మార్పులపై పరిశోధన
  • ఇసుక తవ్వకాలపై జల వనరుల శాఖ సర్వే


నిజామాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గోదావరికి ఉప నదిగా ఉన్న మంజీరాలో 20 ఏళ్లుగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల ఎలాంటి మార్పులు సంభవించాయి..? నది స్వరూపంలో ఏమైనా తేడాలు వచ్చాయా..? పరీవాహకంలో భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి..? పంటలపై ఏమేర ప్రభావం ఉంది..? వరదల వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది..? తదితర అంశాలను తెలుసుకోవడానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మంజీరా నదిపై కేంద్ర జలవనరుల శాఖ పైలట్‌ ప్రాజెక్టు కింద సర్వే చేపట్టింది. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, నేషనల్‌ హైడ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. రెండు దశాబ్దాల్లో నదిలో జరిగిన మార్పులను అంచనా వేసి.. కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక అందించనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని బిచ్కుంద, మద్నూర్‌, బీర్కూర్‌, కోటగిరి, బోధన్‌, రెంజల్‌ మండలాల పరిధిలోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. 20 ఏళ్లలో నది నుంచి భారీగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారు.  


మంజీరాలో 30 కి.మీ మేర అధ్యయనం.. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని బాన్సువాడ మండలం తాడ్కోల్‌ నుంచి కోటగిరి మండలం హంగర్గ వరకు ఉన్న మంజీరా నదిపై సుమారు 30 కి.మీ మేర ఈ అధ్యయనం చేయనున్నారు. ఈ పరిధిలోని నదిలోనే ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నదికి అటు వైపుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలోనే తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అధ్యయనంలో రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ చిత్రాల ద్వారా ఈ 20 ఏళ్లలో జరిగిన పరిస్థితులను అంచనా వేస్తారు. భారీగా ఇసుక తవ్వకాలు చేయడం పరీవాహక ప్రాంతాల రైతుల మీద ఎంతమేర ప్రభావం చూపింది..? వర్షాలు వచ్చినపుడు భారీ వరదలు వస్తే నది కోతకు గురైందా? అనే అంశాలను పరిశీలిస్తారు. ఇలా రెండేళ్ల పాటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి.. మూడు శాఖల బృంద సభ్యులు కేంద్ర జలవనరుల శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్‌లో ఇసుక తవ్వకాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2021-12-06T08:26:19+05:30 IST