‘గోడ’ ఆపడం కోసం బైడెన్ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2021-07-26T11:11:28+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

‘గోడ’ ఆపడం కోసం బైడెన్ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలను ఆపేశారు. ఇలా ఆపేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై 2 బిలియన్ డాలర్ల భారం పడుతోందని ఒక రిపబ్లికన్ కాంగ్రెషనల్ నివేదిక పేర్కొంది. ఈ గోడ నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఉక్కు, కాంక్రీటును ఎడారిలో వదిలేశారని, వాటిని కాపలా కాయడం కోసమే రోజుకు 3 మిలియన్ డాలర్లు ఖర్చవుతోందని ఈ నివేదిక పేర్కొంది. గవర్నమెంట్ ఆపరేషన్స్ అండ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ (ప్రభుత్వ కార్యకలాపాలు, సరిహద్దు నిర్వహణ)పై విధించిన ఒక సబ్-కమిటీ దీనిపై స్పందిస్తూ.. ‘‘పన్ను కట్టే ప్రజల సొమ్ము ఈ విధంగా వృధా అవడం మిలటరీ సంసిద్ధతకు, జాతీయ భద్రతకు ముప్పు’’ అని పేర్కొంది. ఈ గోడ నిర్మాణం ఆపేయడం వల్ల గోడ లేని ప్రాంతాల నుంచి కొందరు వలసలు అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ చాలా మందిని కస్టమ్స్, సరిహద్దు భద్రతా దళాలు పట్టుకుంటున్నాయి. ఒక్క జూన్ నెలలోనే అక్రమంగా సరిహద్దు దాటుతున్న 1,88,829 మందిని భద్రతా దళాలు పట్టుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-07-26T11:11:28+05:30 IST