ఎన్నాళ్లకెన్నాళ్లకో...

ABN , First Publish Date - 2022-08-11T05:12:55+05:30 IST

ఎన్నాళ్లకెన్నాళ్లకో...

ఎన్నాళ్లకెన్నాళ్లకో...
ప్రారంభానికి సిద్ధంగా వికారాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌



  •  సీఎం హోదాలో తొలిసారిగాఉద్యమ గడ్డకు.. 
  •  కలెక్టరేట్‌తో పాటు టీఆర్‌ఎస్‌ భవన్‌   ప్రారంభోత్సవం
  •  జిల్లాపై వరాల జల్లు కురిసేనా!
  •  రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మంజూరు చేస్తారని ఆశాభావం

 సీఎం కేసీఆర్‌ పర్యటన కోసం ఎదురు చూస్తున్న  వికారాబాద్‌ జిల్లా ప్రజలకు శుభవార్త. టీఆర్‌ఎస్‌ అధినేతగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయాల్లో ప్రచారం కోసం మాత్రమే  జిల్లాకు వచ్చిన కేసీఆర్‌.. సీఎం హోదాలో తొలిసారిగా ఈ నెల 14న వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన  కలెక్టరేట్‌ భవనంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి   కార్యాలయాన్ని చంద్రశేఖర్‌రావు   ప్రారంభించనున్నారు. 

వికారాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు గడిచినా కేసీఆర్‌ ఇంత వరకు సీఎం హోదాలో జిల్లాలో పర్యటించలేదు. ఈనెల 14న సీఎం హోదాలో తొలిసారిగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్‌ భవనంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.  కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల, ఏరియా ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రిగా స్థాయి పెంపు తదితర పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జిల్లాలో మునిసిపాలిటీలు, పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు ప్రకటించే అవకాశంఉంది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లాకు రావడంలో మాత్రం అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ భవన నిర్మాణం పనులుపూర్తయి ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నాయి.  సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తారని, ప్రాంత అభివృద్ధికి దోహదపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు మంజూరుపై ప్రకటనలు చేస్తారని ఎంతో ఆశగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొత్త జోన్ల ఏర్పాటులో వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కాకుండా ఏ సంబంధం లేని జోగులాంబ జోన్‌లో చేర్చడాన్ని ఇక్కడి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించడంతో. ప్రజల ఆకాంక్షను గుర్తించిన కేసీఆర్‌.. జిల్లాను చార్మినార్‌ జోన్‌లో చేరుస్తూ ప్రతిపాదనలు పంపించి దానిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసేలా చొరవ తీసుకున్నారు.  గత ఏడాది వికారాబాద్‌, పరిగిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతిపాదనకు సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేసి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది వికారాబాద్‌లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి, ఏరియా ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రికి స్థాయి పెంచేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.235 కోట్లు కేటాయించి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.  వికారాబాద్‌ జిల్లాను ఆనుకుని రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్‌ తన పర్యటనలోబజిల్లాపై ఎలాంటి వరాలు కురిపిస్తారోనని జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

  •  తాండూరులో కందిబోర్డు ఏర్పాటు  ప్రతిపాదన కలగానే ఉండిపోయింది. 
  •  తాండూరులో నాపరాతి పరిశ్రమ అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
  •  ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఆహార పరిశ్రమ ఏర్పాటు పనులు ఫైళ్ల వరకే పరిమితమయ్యాయి.
  •  జిల్లాలో గ్రామీణ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి. అనంత పద్మనాభస్వామి, బుగ్గ, పాంబండ శ్రీ రామలింగేశ్వర దేవాలయాలు, జుంటుపల్లి సీతారామచంద్రస్వామి, వెల్చాల్‌ లక్ష్మీ నర్సింహస్వామి, రాకంచర్ల దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి.
  •  తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలను ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యాటక పరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.
  •   జిల్లాలో ఆర్టీసీ అలా్ట్ర మోడల్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి
  •   సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ద్వారా జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించాలి.
  •  కోట్‌పల్లి, లక్నాపూర్‌, నందివాగు, కొంశెట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. 
  •  ఎంఎంటీఎస్‌ సదుపాయాన్ని వికారాబాద్‌ వరకైనా పొడిగించాలన్న డిమాండ్‌ కార్యరూపం దాల్చడం లేదు
  •  జిల్లాకు మంజూరైన విద్యా సంస్థలు మంజూరైన చోటనే ఏర్పాటు  చేయాలి 
  •   వికారాబాద్‌, పరిగిలో డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలి 
  •  అనంతగిరిలో ఆయుష్‌ కేంద్రం మంజూరై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు 
  •  వికారాబాద్‌ చుట్టూ రైల్వే లైన్‌ ఉన్నందున  అండర్‌పాస్‌ బ్రిడ్జిలు మంజూరు చేయాలి 
  •  వికారాబాద్‌ చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్డు   ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. 
  •  జిల్లాకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు అనంతగిరి ప్రభుత్వ వైద్య కళాశాలగా నామకరణం చేయాలి
  •  పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలో మరిన్ని కొత్త మండలాల ఏర్పాటుతో పాటు పరిగి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి
  •  పరిగిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 
  •  జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఒక్కో మునిసిపాలిటీకి రూ.50 కోట్లకు తగ్గకుండా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి 
  •  పరిగి- షాద్‌నగర్‌, వికారాబాద్‌ - తాండూరు, పరిగి-మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ - సదాశివపేట్‌ రహదారులను అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
  •  ప్రతి గ్రామాన్ని మండల కేంద్రంతో, మండల కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాలతో అనుసంధానం చేసే విధంగా రోడ్ల నిర్మాణం  చేపట్టాలి.

 సభకు భారీ బందోబస్తు: ఎస్పీ కోటిరెడ్డి

 సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభతో పాటు,  సీఎం వచ్చే మార్గల్లో పట్టిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి పోలీస్‌ సిబ్బంది విధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.  ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని వివరించారు. సీఎం కాన్వాయ్‌కి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని సంఘవిద్రోహ శక్తులను ముందుగానే అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ వ్యవస్థకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా విధులు నిర్వహించి ప్రశాంతంగా కార్యక్రమం ముగించేయాలని తెలిపారు.  




సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌: ఈనెల 14న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లా పర్యాటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టరేట్‌ కార్యాలయ భవనం, హెలీప్యాడ్‌, బహిరంగసభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యేఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్‌ను ఎస్పీ కార్యాలయంలో, బహిరంగ సభా ప్రాంగణాన్ని నూతన కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సూచించారు. టీఆర్‌ఎ్‌సపార్టీ కార్యాలయాన్ని పరిశీలించి రోడ్లు, పరిసరాలను పరిశుభ్రం చేయాలని, దట్టంగా మొక్కలు నాటి ప్రధాన రహదారులన్నీ అందంగా తీర్చి దిద్దాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని విద్యుత్‌దీపాలు ,పూలతో అందంగా అలంకరించాలని కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్బంగా వివిధ శాఖల అధికారులకు వారు చేపట్టాల్సిన పనులను కేటాయించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.




  • 17న శామీర్‌పేటకు సీఎం కేసీఆర్‌ రాక
  •  అంతాయిపల్లిలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ను ఈనెల 17న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాఅధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈనెల 17న మధ్యాహ్నం 3 గంటలకు శామీర్‌పేటలోని అంతాయిపల్లి వద్ద నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కలెక్టరేట్‌ భవనంలో ఇంకా ఏమైనా పనులు మిగిలినట్లయితే వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.  కాగా నూతన కలెక్టరేట్‌ భవనాన్ని బుధవారం కలెక్టర్‌ హరీశ్‌ పరిశీలించారు.  పెండింగ్‌ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌ భవనాన్ని విద్యుద్ధీపాలతో అలంకరించాలని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లాఅదనపు కలెక్టర్లు శ్యాంసన్‌, లింగ్యానాయక్‌, జడ్పీ సీఈవో దేవసహాయం, డీఆర్‌డీఏ పద్మజారాణి, బాలానగర్‌ డీసీపీ సందీప్‌, డీపీవో రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:12:55+05:30 IST