‘వారానికి’ ఎన్నేళ్లు?

ABN , First Publish Date - 2022-08-06T08:08:56+05:30 IST

‘వారానికి’ ఎన్నేళ్లు?

‘వారానికి’ ఎన్నేళ్లు?

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం ఎప్పుడు?

ఎన్నికల ముందు ఓట్లకు వాడుకున్న జగన్‌


చెప్పింది బారెడు... చేసింది బెత్తెడు.. వారంలోనే న్యాయం చేస్తానని హామీ

ఆపై 10 వేలలోపు డిపాజిటర్లకేనని మెలిక.. రూ.3,944 కోట్లకు గానూ ఇచ్చింది 905 కోట్లే

మరో 8.60 లక్షల మంది బాధితులు ఎదురుచూపులు.. మృతుల కుటుంబాలకు 7లక్షల హామీ గాలికి

రోడ్డెక్కుతున్న డిపాజిటర్లు.. కలెక్టరేట్ల ముట్టడి.. త్వరలో విజయవాడలో భారీ ర్యాలీ చేస్తాం: ముప్పాళ్ల


పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ మాటలు కోటలు దాటాయి! సమస్య ఏదైనా సరే... వారాల్లో పరిష్కరిస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని మైకు పట్టుకుని హోరెత్తించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వారంలోనే న్యాయం చేస్తానని వారిని ఓట్ల కోసం వాడుకున్నారు. కానీ... చెప్పింది బారెడు. చేసింది బెత్తెడు కూడా లేదు. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు తీరనే లేదు. దీంతో... వారానికి ఎన్నేళ్లు? అంటూ జనం వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఇస్తున్న పరిహారానికి అదనంగా ఏడు లక్షలు పువ్వుల్లో పెట్టి ఇస్తాం’’ ..  పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇచ్చిన హామీ ఇది. మాట తప్పను, మడమ తిప్పను అంటూ.. ముఖ్యమంత్రి అయ్యాక పది వేల లోపు డిపాజిటర్లకు మాత్రమే ఇస్తామంటూ మెలిక పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్క బాండ్‌ మాత్రమే చెల్లిస్తామన్నారు. ఆ తర్వాత రూ.20 వేలు లోపు బాండ్లకు చెల్లింపులు చేస్తామన్నారు. అతి త్వరలో మిగతావారికీ ఇస్తామన్న మాటకు ఇప్పటికీ అతీగతీ లేదు. నమ్మి ఓటేసినందుకు మోస పోయామంటూ బాధితులు మరోసారి రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వరుసగా రోడ్డెక్కి ఉద్యమిస్తున్న బాధితులు విజయవాడ, గుంటూరులోనూ నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షంలో జగన్‌ చెప్పిన మాటలు బారెడు ఉంటే.. కుర్చీలో కూర్చున్నాక ఇచ్చిన మొత్తం మూరెడు అంటూ మండిపడుతున్నారు. రూ.4000 కోట్లు చెల్లించాల్సి ఉండగా మొదటి బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించి, రూ.905 కోట్లు మాత్రమే చెల్లించారని అగ్రిగోల్డ్‌ బాధితులు గుర్తు చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్‌ పేద, మధ్య తరగతి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు సకాలంలో తిరిగి చెల్లించలేదు. దీంతో 2014లో పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరిన్ని చోట్ల ఫిర్యాదులు పెరగడంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కేసు సీఐడీకి అప్పగించింది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి 6 వేల కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్‌ విభజిత ఏపీలో 19 లక్షల మంది నుంచి రూ.3,965 కోట్లు సేకరించినట్లు తేల్చింది. సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్‌ చైౖర్మన్‌తో పాటు డైరెక్టర్లు, ఇతర ముఖ్యులను అరెస్టు చేశారు. ఏపీలో రూ.2,585 కోట్ల విలువైన ఆస్తులతో పాటు పలు రాష్ట్రాల్లో రూ.3,785 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేశారు. అదే సమయంలో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల ఆస్తులు సైతం జప్తు చేసి, బాధితులకు న్యాయం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. డిపాజిట్‌ సొమ్ము రాదన్న బెంగతో ప్రాణాలు కోల్పోయినవారు, ఆత్మహత్యకు పాల్పడినవారి 142 కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. జప్తు చేసిన ఆస్తులు వేలం వేసి బాధితులకు చెల్లింపులు చేసే క్రమంలో 50 కోట్ల వేలం డబ్బుకు 250 కోట్ల ప్రభుత్వ నిధులు కలిపి 300 కోట్లు పంపిణీకి సిద్ధమైంది. ఆ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో పంపిణీ ఆగిపోయింది. 


ప్రతిపక్ష నేతగా మాట చెప్పి.. 

విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన దీక్షకు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ సంఘీభావం ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే డిపాజిటర్లకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఏడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్‌ సమావేశంలోనే అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సమస్యపై చర్చించి, తొలి బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. అప్పటికే గత ప్రభుత్వం కేటాయించిన రూ.300 కోట్లు ఉండటంతో సుమారు 15 లక్షల మంది సమస్య తీరుతుందని భావించారు. ఆర్నెల్ల పాటు ఊరించిన జగన్‌ పదివేల లోపు డిపాజిటర్లకు మాత్రమే ఇస్తామన్నారు. 2019 నవంబరులో గుంటూరులో 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వమే రూ.300 కోట్లు కేటాయించినప్పుడు కనీసం పాతిక వేల లోపు బాండ్లన్నింటికీ చెల్లించవచ్చు కదా? అనే ప్రశ్నలు   తలెత్తాయి. అయితే చెప్పినదాంట్లో కూడా జగన్‌ కోత విధించి ఒక్కొక్కరికి ఒక్క బాండ్‌ మాత్రమే చెల్లిస్తామని, ఆపైన ఉండే వాటికి ఇవ్వబోమంటూ మడమ తిప్పారు. చివరికి 3.40 లక్షల బాండ్లకు రూ.238 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. 


ముఖ్యమంత్రి అయ్యాకా అదేతీరు 

జగన్‌ మాట నమ్మి ఓటేస్తే మోసం చేస్తారా? అంటూ అగ్రిగోల్డ్‌ బాధితులు ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఉద్యమానికి సిద్ధమవడంతో.. మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని ముఖ్యమంత్రి మాటిచ్చారు.  రెండో బాండ్‌ ఉన్న వాళ్లు సీఎంపై నమ్మకం లేక జిల్లాల్లో వినియోగదారుల ఫోరంలో కేసులు పెట్టారు. అంతలో కరోనా రావడంతో రెండేళ్లు గడిచిపోయింది. జగన్‌ ప్రభుత్వం గత ఆగస్టులో రూ.20 వేలు లోపు బాండ్లకు చెల్లింపులు చేస్తామంటూ 7 లక్షల బాండ్లకు గానూ రూ.667 కోట్లు విడుదల చేసింది. దీంతో మొత్తం 10.40 లక్షల మందికి రూ.905 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలోనే మిగతావారికి కూడా న్యాయం చేస్తామని మళ్లీ మాటిచ్చారు. ఏడాదైనా అతీగతీ లేకపోవడంతో అగ్రిగోల్డ్‌ బాధితులు జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులతో త్వరలో విజయవాడలో ర్యాలీ నిర్వహిస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. 


సీఐడీ చెప్పింది ఎంత? 

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ అధికారులు బాధితుల వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. 2019 జూలైలోనే జాబితా సిద్ధం చేశారు. ఏ విభాగంలో ఎంతమంది ఉన్నారు? వారిలో డేటా మ్యాచ్‌ అయిన వారెందరు? కాని వారి సంఖ్య ఎంత? ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది? తదితర వివరాల జాబితాను  ప్రభుత్వానికి ఇచ్చారు. రూ.5వేల లోపు డిపాజిట్‌ చేసిన 7.35 లక్షల మందికి రూ.212.23 కోట్లు, రూ.10 వేలు డిపాజిట్‌ చేసిన 12.86 లక్షల మందికి రూ.720.29 కోట్లు, రూ.20 వేల వరకూ డిపాజిట్‌ చేసిన వారికి పూర్తిన్యాయం చేయాలంటే రూ.1,429 కోట్లు అవసరమవుతాయని వివరించారు. రూ.50 వేల వరకూ డిపాజిట్లు చేసిన వారందరికీ డబ్బులు చెల్లించాలంటే రూ.1,851.81 కోట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం రూ.905 కోట్లు చెల్లించింది.

Updated Date - 2022-08-06T08:08:56+05:30 IST