ఎన్నాళ్లకు వస్తున్నాయో !

ABN , First Publish Date - 2020-10-01T09:54:48+05:30 IST

ఎట్టకేలకు వివిధ ప్రాంతాలకు మంజీర జలాలును సరఫరా కానున్నాయి. గతంలో సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం

ఎన్నాళ్లకు వస్తున్నాయో !

ఏడాదిన్నర తర్వాత మంజీర జలాల సరఫరాకు సిద్ధం

గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌ నియోజవకవర్గాలకు నీళ్లు

బీడీఎల్‌, ఓడీఎఫ్‌, బీరు కంపెనీ, నగర శివార్లకు కూడా


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 30 : ఎట్టకేలకు వివిధ ప్రాంతాలకు మంజీర జలాలును సరఫరా కానున్నాయి. గతంలో సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ఠస్థాయికి పడిపోవడంతో 2019 ఫిబ్రవరి నుంచి మంజీర నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 24.373 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో నాలుగైదు రోజుల కిందట అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించడంతో మంజీర నీటి సరఫరాకు సానుకూలంగా స్పందించారు. దీంతో మూడు నియోజకవర్గాల దాహార్తిని తీరనుంది. 


మూడు నియోజకవర్గాలకు మంజీర జలాలు

గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు మంజీర జలాలు సరఫరా కానున్నాయి. ఆయా నియోజకవర్గాలకు హత్నూర మండలం బోర్పట్ల ఫిల్టర్‌ బెడ్‌ నుంచి సరఫరా చేస్తారు. దీని కోసం మంజీర రిజర్వాయర్‌ అంతర్భాగంలో ఉన్న చక్రియాల శివారులో నిర్మించిన ఇన్‌టెక్‌వెల్‌కు మంజీర నీళ్లను సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బోర్పట్ల ఫిల్టర్‌ బెడ్‌కు వస్తున్న మంజీర నీళ్లతో అక్కడ మూడుహౌస్‌లను శుభ్రం చేసి, దిగువన ఉన్న భీముని చెరువులోకి వదులుతున్నారు. ఈ ఫిల్టర్‌ బెడ్‌ నుంచి రెండు, మూడు రోజుల్లో ఆయా నియోజకవర్గాల ప్రజలకు మంజీర నీళ్లు అందనున్నాయి.


పెద్దాపూర్‌ ఫిల్టర్‌ బెడ్‌కు మంజీర జలాలు

మెట్రో వార్‌ వర్క్స్‌ అధికారులు మంజీర నీటిని సరఫరా చేసేందుకు బుధవారం ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్దాపూర్‌ ఫిల్టర్‌బెడ్‌కు బుధవారం నీటిని తరలించి ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. ఆయా పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేసి పరీక్షించారు. ఇక్కడి నుంచి  సింగాపూర్‌, భానూర్‌, కొండకల్‌ల మీదుగా ఉన్న పైపులైన్‌ ద్వారా లింగంపల్లికి చేరుకున్నాయి. ఈ పైపులైన్‌ ద్వారా సంగారెడ్డి, కొండాపూర్‌ మండలాలలో ఉన్న బీరు కంపెనీలకు, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ పరిశ్రమలకు, ఆయా టౌన్‌షి్‌పల ప్రజలకు తాగేందుకు మంజీర నీళ్లు అందించనున్నారు. అలాగే లింగంపల్లి నుంచి సిటీ శివారు ప్రాంతాలైన చందానగర్‌, మాదాపూర్‌, మియాపూర్‌ ప్రాంతాల ప్రజలకు ఈ నీరు సరఫరా కానున్నది.


రుచికరం కానున్న బీరు

బీరు కంపెనీలు మంజీర నీటితో తయారు చేయనున్న బీరు రుచికరంగా ఉంటుందని ఆయా కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది ఫిబ్రవరి నుంచి మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులు మంజీర నీటిని నిలిపేయడంతో బోరుబావుల నీటితో బీరు కంపెనీలు బీరును తయారు చేసి, సరఫరా చేశాయి. ఇన్నాళ్ల తర్వాత మళ్ల్లీ మంజీర నీరు సరఫరా కానుండడంతో బీరు కంపెనీల నుంచి రుచికరమైన బీరు మద్యం ప్రియులకు అందించనున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-10-01T09:54:48+05:30 IST