ఎన్నాళ్లీ ‘ఘోష’

ABN , First Publish Date - 2022-08-08T05:39:38+05:30 IST

ఘోష ఆసుపత్రిలో గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్యం అందుతుందని, వసతులు బాగుంటాయని ఎంతో ఆశతో వస్తున్నారు. పరిస్థితి చూశాక నిరాశ చెందుతున్నారు.

ఎన్నాళ్లీ ‘ఘోష’
ఘోషా ఆసుపత్రి

 
అందుబాటులోనూ ఉండని వైద్యులు
పరీక్షలకు ఎప్పుడు రావాలో స్పష్టంగా చెప్పని వైనం
సహకరించని ఇతర సిబ్బంది
గర్భిణులకు తప్పని అవస్థలు

విజయనగరం(ఆంధ్రజ్యోతి) ఆగస్టు7 :
ఘోష ఆసుపత్రిలో గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్యం అందుతుందని,  వసతులు బాగుంటాయని ఎంతో ఆశతో వస్తున్నారు. పరిస్థితి చూశాక నిరాశ చెందుతున్నారు. వైద్యుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అట్నుంచి అటు ప్రైవేటు ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ఘోషా అసుపత్రికి రోజూ సుమారు 100 మందికి పైగా ఆరోగ్య తనిఖీలకు వస్తుంటారు.  పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. అంతవరకు బాగానే ఉంది. కొంతమంది డాక్టర్ల తీరుతో 7,8,9 నెలలు నిండిన గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించాక 15 లేదా నెలరోజుల తరువాత రమ్మంటున్నారు. స్పష్టంగా ఏ రోజు రావాలి? వచ్చేముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. చత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల నుంచి ఘోషాసుపత్రికి వచ్చే గర్భిణులు చాలా అవస్థలు పడుతున్నారు. వారికి నర్సుల నుంచి కూడా సహకారం ఉండడం లేదు.
ఫ నెలలు నిండిన గర్భిణులు ఓపీ ముందు గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఆసుపత్రికి వచ్చేవారు ముందుగా బీపీ, షుగర్‌, బ్లడ్‌టెస్టులు చేయించుకున్న తరువాతే సుమారు అరగంటకు పైగా లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తే వైద్యులు ముఖ్యమైన విషయమై ఫోన్‌లో మాట్లాడుతున్నారని, పై అధికారి వచ్చారని తదితర కారణాలు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒకేసారి   10 నుంచి 15 మంది వరకు లోపలికి పంపుతుంటారు. ఆ సమయంలో తూతూమంత్రంగా పరీక్షిస్తున్నారన్న ఆవేదన గర్భిణుల నుంచి వ్యక్తమవుతోంది. జాగ్రత్తలు, ఆహార నియామాలు, రిపోర్టులో ఉన్న అంశాలను స్పష్టంగా చెప్పడం లేదంటున్నారు. ప్రసవ సమయం వచ్చేసరికి ఉన్నఫలంగా బ్లడ్‌కావాలని చెప్పటంతో రోగి బంధువులు హడలెత్తిపోతున్నారు.

సమస్యలు రాకుండా చూస్తాం
రోజూ ఆస్పత్రికి వందకు పైగా ఓపీలు వస్తాయి. గర్భిణులు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అయినాగాని పరిశీలించి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.
        -సీతారామరాజు, సూపరింటెండెంట్‌, ఘెషాసుపత్రి


Updated Date - 2022-08-08T05:39:38+05:30 IST