మూడేళ్లలో ఎన్ని పక్కా గృహాలు నిర్మించారో...

ABN , First Publish Date - 2022-10-04T06:41:11+05:30 IST

మూడేళ్ల పాలనలో నిరుపేద ప్రజలకు ఎన్ని పక్కా గృహాలు నిర్మించారో సమాధానం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మూడేళ్లలో ఎన్ని పక్కా గృహాలు నిర్మించారో...
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేత సత్యనారాయణ

బీడు భూములను తలపిస్తున్న జగనన్న లేఅవుట్‌లు

సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ


చింతపల్లి, అక్టోబరు 3: మూడేళ్ల పాలనలో నిరుపేద ప్రజలకు ఎన్ని పక్కా గృహాలు నిర్మించారో సమాధానం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి పక్కా గృహం కట్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో ఒక్క పక్కా గృహం నిర్మించిన దాఖలాలు లేవన్నారు. పేదలకు పంపిణీ చేసిన జగనన్న లేఅవుట్లు బీడు భూములను తలపిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు సైతం పక్కా గృహాలకు ఎదురుచూపులే మిగిలాయని ఆయన వాపోయారు. ప్రభుత్వం ఆదివాసీలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములకు పట్టాలు పంపిణీ చేశామని చేస్తున్న ప్రకటలను సత్యదూరమన్నారు. ఆదివాసీల సాగులోనున్న భూములకు పట్టాలు మంజూరు చేయలేదని, హక్కు పత్రాల కోసం గిరిజనులు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. చెక్‌ డ్యామ్‌లు మరమ్మతులకు గురయ్యాయని, ఖరీఫ్‌లోనూ రైతుల పంట పొలాలకు సాగు నీరు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఒక్క సీసీ రోడ్డు నిర్మించిందిలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల అభివృద్ధి పదేళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు, సీనియర్‌ నాయకులు సెగ్గె కొండలరావు, మొట్టం రాజబాబు, సర్పంచ్‌ పేట్ల రాజుబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T06:41:11+05:30 IST