ఇంకా ఎన్నేళ్లు...?

ABN , First Publish Date - 2022-04-20T05:30:00+05:30 IST

మదనపల్లె తాగునీటి అవసరాల నిమిత్తం 2007-08లో చిప్పిలి, గుట్టకిందపల్లె సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు (ఎ్‌సఎస్‌) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఇంకా ఎన్నేళ్లు...?
మదనపల్లె చిప్పిలి గుట్టపై నిర్మించిన నీటి శుద్ధి కేంద్ర సముదాయ భవనం

పూర్తి కాని ఎస్‌ఎ్‌స ట్యాంకు మొరవ పనులు

తుప్పుపడుతున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు

రూ.కోట్ల నిధులు నీళ్ల పాలేనా!?


మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు మొరవ పనులు ముందుకు సాగడం లేదు. ఆ నీటిని శుద్ధి చేయడానికి చేపట్టిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లూ అదే దారిలో పయనిస్తున్నాయి. ఈ రెండు పనులు నడకలో నత్తతో పోటీ పడుతున్నాయి. పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. కళ్లెదుటే వర్షపు నీరు వృథాగా ఏటి పాలవుతుండగా పూర్తయిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు తుప్పుపడుతున్నాయి. దీంతో రూ.కోట్ల నిధులు నీళ్ల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


మదనపల్లె, ఏప్రిల్‌ 20: మదనపల్లె తాగునీటి అవసరాల నిమిత్తం 2007-08లో చిప్పిలి, గుట్టకిందపల్లె సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు (ఎ్‌సఎస్‌) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.100 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా అధికారులు చేపట్టిన ఎస్‌ఎ్‌స ట్యాంకులను మూడేళ్ల క్రితం పూర్తి చేశారు. కానీ వాటికి మొరవ పనులు మాత్రం వదిలేశారు. చిప్పిలి ఎస్‌ఎ్‌స ట్యాంకుకు మొరవ నిర్మాణానికి పునాదులు పడగా గుట్టకిందపల్లె ట్యాంకుకు పనులే ప్రారంభం కాలేదు. కృష్ణా జలాల ఆధారంగా హంద్రీ-నీవా కాలువపై వీటిని నిర్మించారు. హంద్రీ-నీవా కాలువ పనులే పూర్తయి నాలుగుసార్లు కృష్ణా జలాలు మదనపల్లెకు వచ్చినా.. ఎ్‌సఎస్‌ ట్యాంకుల్లో చుక్కనీరు నిల్వలేదు. పైప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు కూడా వచ్చినట్లే వృథాగా ఏటి పాలవుతోంది. ఒక్కో ట్యాంకుకు రూ.50 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే రూ.4 కోట్లతో పూర్తయ్యే పనులను చేపట్టడం లేదు. వర్షాకాలంలో పైనుంచి వంకలు, వాగులు మూడు నెలలు ప్రవహిస్తుంటాయి. ఈ నీరంతా వృథాగా పోతోంది. పట్టణానికి ఇప్పటికిప్పుడే నీటిని తీసుకోకున్నా..నీరు నిల్వ ఉంటే, దిగువ ప్రాంతంలోని తాగునీటి పథకాలు, రైతుల వ్యవసాయ బోర్లు పుష్కలంగా ఉంటాయి. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా, పాలకుల్లోనూ చొరవ కనిపించడం లేదు.

తుప్పు పడుతున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు

చిప్పిలి, గుట్టకిందపల్లె ఎస్‌ఎ్‌స ట్యాంకుల్లోని నీటిని శుద్ధి చేసి పట్టణ ప్రజలకు సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంట్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. 2007లో చేపట్టిన వీటి పనులు 2011లో పూర్తయ్యాయి. వీటిని చిప్పిలి వద్ద బెంగళూరురోడ్డు పక్కన, గుట్టకిందపల్లె ట్యాంకునకు పుంగనూరు రోడ్డు సమీపంలోని గుట్టలపై నిర్మించారు. రూ.40 కోట్ల హడ్కో నిధులతో వీటిని ప్రజారోగ్య శాఖ చేపట్టింది. రెండు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, అక్కడి నుంచి గ్రావిటీతో పట్టణానికి నీటి సరఫరాకు రెండడుగుల వ్యాసంతో పైపులైన్‌, నాలుగు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. గుట్టలపై నిర్మించిన ప్లాంట్లు, సంపులతో మూడు స్టేజీల్లో నీటిని శుద్ధి చేసి పంపేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తయి పదేళ్లు కావడంతో యంత్రాలు తుప్పుపట్టిపోగా, భూమిలోని పైపులైన్‌ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇక గుట్టలపై నిర్మించిన భవనాలు  వినియోగంలోకి రాకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఊరికి దూరంగా ఉన్న వీటిపై పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడంతో ఆకతాయిలు తలుపులు, కిటికీలు, అందులోని పైపులు, విద్యుత్తు వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. నీటిని పంపింగ్‌ చేసే దశలో రెండో భాగమైన ఎస్‌ఎ్‌స ట్యాంకుల్లో ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణం, అక్కడి నుంచి గుట్టలపైన గల ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి కోసం 2019లో హడ్కో రూ.4.50 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ క్రమంలో చిప్పిలి ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిర్మాణం పూర్తి కాగా, గుట్టకిందపల్లె ట్యాంకులో వెల్‌ నిర్మాణం పునాది దశకే పరిమితమైంది. ఈ రెండు ట్యాంకుల నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేసే వ్యవస్థలో భాగంగా వివిధ స్థాయిల్లో 30 కి.మీ.పైపులైన్‌ ఏర్పాటు చేసినట్లు అంచనా. మొదట్లో రూ.40 కోట్ల అంచనాతో పనులు చేపట్టగా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం, ధరలు పెరుగుదల వెరసి భారం తడిసిమోపెడవుతోంది. మరోవైపు పనులు పూర్తయి ఏళ్లయినా వినియోగం లేకపోవడంతో పైపులైన్‌ పనితీరు, సామర్థ్యంపై ఇంజనీరింగ్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లేమితో ప్రజాధనం వృథా కావడమే కాదు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి.


అమృత్‌-2లో పూర్తి చేస్తాం

-కె.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ప్రజారోగ్య శాఖ, తిరుపతి

అసంపూర్తిగా ఉన్న ఆ రెండు ఎస్‌ఎస్‌ ట్యాంకుల పనులు, పైప్‌లైన్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ తదితర పనులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమృత్‌ పథకంలో పూర్తి చేస్తాం. నిధులు లేక  ఇంతకాలం ఆ పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది అమృత్‌-2లో రూ.35 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ఒకటి రెండు నెలల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.



Updated Date - 2022-04-20T05:30:00+05:30 IST