మనకు ఎంత మంది స్నేహితులు ఉన్నారనేది ముఖ్యం కాదు.. ఎలాంటి స్నేహితులు ఉన్నారనేది ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. మన జీవితం సంతోషంగా ఉండాలంటే ఎలాంటి స్నేహితులు అవసరమో వారు సూచిస్తున్నారు.
ఆత్మ బంధువు: ఒకే రక్తం పంచుకొని పుట్టుకపోవచ్చు కానీ అవసరమైతే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆదరించే స్నేహితుడు ఒకరైనా మనకు తప్పనిసరిగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఇలాంటి స్నేహితుడు ఒకరైనా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
చెబితే వినాలి: ఆధునిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిలను తట్టుకోవాలంటే మన మనసులో ఉన్న మాటలు వినే స్నేహితుడు ఒకరైనా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి మాటకు అడ్డుతగిలే వారు కాకుండా.. మన అభిప్రాయాలు వినే వారు ఉంటే జీవితంలో అనేక సమస్యలు దూరమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఫన్ ఫ్రెండ్: మన మూడ్ బావుండలేనప్పుడు నవ్వించే స్నేహితుడు ఒకరుంటే అనేక సమస్యలు దూరమవుతాయి. అలాంటి స్నేహితుడు మనకు ప్రతి సమస్యలోను కొత్త కోణాన్ని చూపించటమే కాకుండా.. మనకు ఎదురయిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పగలుగుతారు.