ఎంతకాలం?

ABN , First Publish Date - 2020-09-02T06:46:49+05:30 IST

గతవారాంతంలో విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిపై జరిగిన అఘాయిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నది...

ఎంతకాలం?

గతవారాంతంలో విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిపై జరిగిన అఘాయిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నది. భద్రజీవులకు శాంతీ భద్రతా ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్టే అని కొందరు అనుకోవచ్చు. దళితులు, బలహీనులు, పీడితులు, అణగారినవారు- వీరి భద్రతకు పూచీ ఉన్నప్పుడే ఆ నేల ప్రశాంతంగా ఉన్నట్టు. మూతికి మాస్కు పెట్టుకోలేదని పోలీసు ఒక దళిత యువకుడిని కొట్టి చంపుతాడు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డం తగిలాడని ఒక రాజకీయ నేత పోలీసుల చేత ఒక దళితుడికి గుండుగీయిస్తాడు. ఇంట్లో పనిమానేసినందుకు కోపగించి, దొంగతనం అంటగట్టి ఒక ఇల్లాలు, ఆమె సేవకులు కలిసి ఒక కుర్రవాడికి శిరోముండనం చేయిస్తారు. వీటన్నిటిని గమనిస్తే అర్థం అయ్యేది ఏమిటంటే, ఎక్కడ అధికారం కులం రూపంలో, యూనిఫాం రూపంలో, రాజకీయం రూపంలో ఉన్నదో- అక్కడ దళితుడికి అవమానం జరుగుతున్నది. అవమానం జరిగినా ప్రాణం తీసినా ఏమీ నష్టం లేదని వ్యవస్థా, ప్రభుత్వాలూ భరోసా ఇస్తున్నాయి కాబట్టి, అవి పదే పదే జరుగుతున్నాయి. ఉద్యమాలు చేసి, కోర్టులు చుట్టూ తిరిగి దళిత నేత కాళ్లరగవలసిందే. కడుపు మండి, నాలుగు నినాదాలు ఇస్తే, వాటిని మూటగట్టుకుని ఒక నాయకుడు పదవులలోకి వెడతాడు, ఒక ప్రభుత్వం కాకపోతే మరొకటి మనకు న్యాయం చేయకపోతుందా అని దళితులు మార్చి మార్చి ఓట్లు వేస్తూనే ఉంటారు. దురదృష్టవశాత్తూ మోసపోతూనే ఉంటారు.


సినిమాల్లో జనం ఆదరణ పొంది, రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఉన్న ఒక కథానాయకుడికి అభిమాని నూతన్ నాయుడు. అతని ఇంట్లో అతని భార్య సమక్షంలో గత శుక్రవారం నాడు దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. అతనికీ తమ సంస్థలకీ సంబంధం ఉన్నా లేకపోయినా, అతను అభిమాని అయినా కాకపోయినా, ఒక దుస్సంఘటనగా అయినా ఆ జననాయకుడు శిరోముండనాన్ని ఖండించి ఉండవలసింది. మరో పక్కన ఆ సంఘటనకీ, రాష్ట్ర ప్రభుత్వానికీ సంబంధం ఏమిటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తారు. ఆశ్చర్యం. రాష్ట్రంలోని శాంతిభద్రతలన్నిటికి ప్రభుత్వానిది కాదా బాధ్యత? నిజానికి విశాఖ సంఘటన జరిగిన తరువాత పోలీసులు వెనువెంటనే సమర్థంగా వ్యవహరించారు. సంబంధించిన వారినందరినీ అరెస్టు చేసి, తక్కిన వారి మీద దర్యాప్తు కూడా జరుపుతున్నారు. కానీ, సంఘటన జరగడానికి కారణం ఏమిటి? 


సిసి కెమెరాలు చూస్తుండగా, విడియో తీస్తూ మరి తమ ఘనకార్యాన్ని నిర్వహించడానికి వారికి ధైర్యం ఎట్లా వచ్చింది? దళితులతో ఎట్లా వ్యవహరించినా ఏమీ కాదనే ధీమా ఉన్నందునే కదా? గోదావరి జిల్లాలో పోలీసుల శిరోముండనం చేసినప్పుడే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు విశాఖలో జరిగేదా? అక్కడ చర్యలు తీసుకోలేదనే కదా బాధితుడు రాష్ట్రపతికి నివేదన పంపాడు- నక్సలైట్లలో చేరతాను, అనుమతివ్వమని. ఏమిటి, ఇటువంటి అభ్యర్థన వచ్చింది, అతనికి జరిగిన అన్యాయంపై సరైన చర్య తీసుకోండి- అంటూ సాక్షాత్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచే తాఖీదు వస్తే, అన్ని చర్యలూ తీసుకున్నాం అని బుకాయించారు కానీ, పోలీసుల చేత ‘చేయించిన’ రాజకీయ నేతను అరెస్టు చేశారా? ఎస్ఐ స్థాయికి మించిన అధికారులపై చర్య తీసుకున్నారా? తన 34 ఏళ్ల పోలీసు సర్వీసులో ఇంత త్వరగా పోలీసుపై చర్య తీసుకోవడం రాజమండ్రి సీతానగరంలోనే జరిగిందంటారు డిజిపి గౌతమ్ సవాంగ్. కాసేపు ఆశ్చర్యపడ్డ తరువాత అయినా డిజిపి తేరుకుని, ఎందుకు శీఘ్రచర్యలు తీసుకోవడం గతంలో సాధ్యపడలేదో సమీక్షించుకుంటే మంచిది. 


1996 డిసెంబర్ చివరి రోజుల్లో అప్పుడు స్వతంత్ర శాసనసభ్యుడిగా ఉన్న తోట త్రిమూర్తులు నిందితుడిగా జరిగిన శిరోముండనం కేసు జగత్ ప్రసిద్ధమే. తూర్పుగోదావరి జిల్లా తెలుగు రాష్ట్రాలలోనే అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లా అని చెప్పుకునేవారు. ఆనకట్ట వచ్చి అక్కడ చదువుని, సంస్కారాన్ని పెంచిందని, సాంఘిక సంస్కరణకు అక్కడి నుంచే పునాదులు పడ్డాయని చరిత్రలో చదువుకుంటాం. మరి అటువంటి చోట, పరమ భూస్వామ్య, కులరక్కసి దురాచారాన్ని ఎట్లా పాటిస్తున్నట్టు? త్రిమూర్తులు కేసు 21 ఏళ్లు సాగింది. ఇప్పటికీ ఆయన ప్రముఖ రాజకీయ నాయకుడే. కాంగ్రెస్ వారు, టిడిపి వారు ఆయనను పోటీలు పడి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైసిపి కూడా ఆయనను కలిపేసుకుంది.

 

ఏ పార్టీలోని దళిత నాయకులూ అభ్యంతరం చెప్పరు. ఫలానా కేసులో నిందితుడిగా ఉన్నవాడు, మన పార్టీలోకి వస్తే దళితుల ఓట్లు పోతాయి- అని కూడా హెచ్చరికలు చేయరు. వివిధ పార్టీలలో రిజర్వుడు స్థానాల నుంచి అభ్యర్థిత్వాల కోసం పోటీలో- అన్ని రకాల ప్రాతిపదికలను వదులుకుంటున్న దళిత రాజకీయనేతలను చూస్తే జాలి వేస్తుంది. ఇప్పుడు దళితులపై అత్యాచారాలు, దళిత వైద్యులపై, న్యాయమూర్తులపై జరుగుతున్న వేధింపులు- ఈ విషయంలో కూడా దళిత నేతలు ఎదుటి పార్టీని నిందించడానికి ఉపయోగపడుతున్నారు తప్ప, తమ తమ స్థానాలను పటిష్ఠం చేసుకునే ప్రయత్నం చేయడంలేదు.


బలవంతంగా ఒక మనిషికి శిరోముండనం చేయడం, లేదా సగం గుండు కొట్టడం, మీసాలు తీసేయడం వంటివి అనాగరికమైన, దుర్మార్గమైన చర్యలు. కులవ్యవస్థ ఈ దేశంలో నిరంతర అసమానతలను విధిస్తూ, వాటిని అతిక్రమించేవారికి దారుణమైన శిక్షలను అమలుచేసింది. కాలం మారినా, వివక్ష రూపాలు మారినా కూడా శిక్షా రూపాలు కొన్ని అదే పద్ధతిలో కొనసాగుతున్నాయి. ఎంతగా ఆధునిక కాలంలో ప్రయాణిస్తున్నామనుకున్నా, మన వేళ్లు ఇంకా వేల ఏళ్ల కిందటి నేలలోనే ఉన్నాయి. నిచ్చెనమెట్ల వ్యవస్థ, అసమానతలు సహజమనుకునే మూర్ఖత్వం, అధికారం తలకెక్కిన అహంకారం- మనం సమకాలంలో అనేక రూపాలలో చూస్తున్నాం. కుల వ్యవస్థపై పోరాటం అందరూ చేయవలసిందే, పై మెట్టున ఉన్నవారు ఔదార్యం, వివేకం చూపవలసిందే. కానీ, గౌరవప్రదమైన, శాశ్వతమైన పరిష్కారం మాత్రం అట్టడుగు వర్గాల వారు గట్టిగా నిలబడడం మీదనే, ప్రతిఘటించడం మీదనే ఆధారపడి ఉన్నది. తాము  ఎవరికో ఓట్లము కాదు, ఎవరి వెనుకో నడిచే అమాయకులం కాము అని గుర్తించి, తమదైన ఒక దారిని ఎంచుకోవలసి ఉన్నది. అన్ని రకాల రాజకీయ చైతన్యాలకు ఆలవాలమైన ఆంధ్రదేశంలో దళితులు నిరంతర బాధితులుగానే మిగిలిపోవడం విచారకరం. l

Updated Date - 2020-09-02T06:46:49+05:30 IST