నిధులేవీ..?

ABN , First Publish Date - 2021-01-19T05:33:59+05:30 IST

జిల్లాలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం’లో భాగంగా ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించనుంది. యూఎల్‌బీ (మున్సిపాలిటీలు) పరిధిలో 62,633, అన్నమయ్య అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (అనుడా) గ్రామాల్లో 33,016 కలిపి 95,649 ఇళ్లను మంజూరు చేశారు.

నిధులేవీ..?
రైల్వేకోడూరులో నిర్మించే కాలనీ లే-ఔట్‌

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కాలనీల్లో మౌలిక వసతులు ఎలా..?

ఇల్లు కట్లాలంటే నీళ్లు, కరెంట్‌ తక్షణ అవసరం 

గతేడాదే రూ.389 కోట్లకు ప్రతిపాదన

ఫేజ్‌-1 కింద తాత్కాలికంగా తాగునీటి సరఫరాకు రూ.99 కోట్లు

విద్యుత సరఫరాకు నిధుల కొరత


రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జిల్లాలో 737 కాలనీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 95,649 ఇళ్లు మంజూరు చేసింది. ఇల్లు కట్టాలంటే నీరు, విద్యుత్తు తక్షణ అవసరం. ఫేజ్‌-1 కింద తాగునీటి సరఫరాకు రూ.99 కోట్లు మంజూరు చేశారు. అవికూడా తాత్కాలిక పనులకే. బోరు తవ్వి, విద్యుత మోటారు, ప్లాస్టిక్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసేలా డిజైన చేశారు. విద్యుత మోటార్‌ ఏర్పాటు చేయాలంటే కరెంట్‌ ఉండాల్సిందే. ఆ శాఖకు ఒక్కపైసా నిధులు ఇవ్వలేదు. నిధుల లేమితో మౌలిక వసతులు కల్పించేదెలా..? నీళ్లు, కరెంట్‌ లేనిదే ఇల్లు కట్టేదెలా..? అధికారులు, లబ్ధిదారుల్లో వేధిస్తున్న ప్రశ్నలివి.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం’లో భాగంగా ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించనుంది. యూఎల్‌బీ (మున్సిపాలిటీలు) పరిధిలో 62,633, అన్నమయ్య అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (అనుడా) గ్రామాల్లో 33,016 కలిపి 95,649 ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాల కోసం అబ్ధిదారులకు మూడు ఆప్షన్స ఇచ్చారు. ఆప్షన్స ఎంపిక పూర్తి కాగానే నిర్మాణాలకు పునాదిరాయి వేసేలా సన్నాహాలు చేస్తున్నారు.


తాత్కాలిక పనులకు రూ.99 కోట్లు

అర్బనలో 40, గ్రామాల్లో 697 కలిపి 737 కాలనీలు నిర్మించనున్నారు. వీటికి శాశ్విత తాగునీటి సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేయమని గతేడాదే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో 697 కాలనీల్లో తాగునీటి సరఫరా శాశ్విత పనులకు రూ.131.20 కోట్ల నిధులు కావాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీ పట్టణాల్లో నిర్మించే 40 కాలనీలకు రూ.70 కోట్లు అవసరమని నివేదిక ఇచ్చారు. ఈ లెక్కన రూ.201.20 కోట్లు అవసరం ఉంది. అయితే.. పేజ్‌-1 కింద 331 కాలనీలు మాత్రమే ఎంపిక చేశారు. అందులో పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 40 కాలనీలకు రూ.70 కోట్లు, గ్రామాల్లో నిర్మించే 291 కాలనీలకు రూ.29 కోట్లు కలిపి రూ.99 కోట్లు మంజూరు చేశారు. పల్లెసీమ కాలనీల్లో బోరు తవ్వి, విద్యుత మోటారు, ప్లాస్టిక్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసేలా ప్లాన చేశారు. ఫేజ్‌-2 కింద మరో 406 కాలనీల్లో తాత్కాలిక తాగునీటి సరఫరాకు మరో రూ.40-45 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. అందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. నిధులు ఇస్తేనే నీటి సరఫరా.. లేదంటే ఇళ్ల నిర్మాణాలకు కష్టాలే. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో రెండు మూడు కి.మీల దూరంలో కాలనీలు కడుతున్నారు.


కరెంట్‌ లైన్లకు నిధులేవీ..?

ఇప్పటికే 737 కాలనీల్లో విద్యుత పంపిణీ పనులకు రూ.186 కోట్లు అవసరమని విద్యుత శాఖ నివేదిక తయారు చేసింది. ఫేజ్‌-1 కింద అర్బన పరిధిలోని 40 కాలనీలలో విద్యుత సరఫరా పనులకు రూ.102 కోట్లు, గ్రామాల్లో 291 కాలనీలకు రూ.34 కోట్లు కలిపి రూ.136 కోట్లు తక్షణ అవసరం ఉందని ఆ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. ఇప్పటికీ నిధులు ఇవ్వకపోగా ఈ పనులు ఎవరి ఆఽధ్వర్యంలో జరగాలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఫేజ్‌-2 కింద మరో 406 గ్రామాలకు సరాసరి రూ.45 నుంచి రూ.50 కోట్లు అవరసం ఉంటుంది. ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు బోరు తవ్వి విద్యుత మోటర్‌ ఏర్పాటు చేస్తే.. ఆ మోటర్‌ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే కరెంట్‌ ఎంతో కీలకం. విద్యుత కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు సరేసరి.


ఫేజ్‌-1 కింద రూ.99 కోట్లు మంజూరు చేశారు

- రాజశేఖర్‌, పీడీ, గృహనిర్మాణ శాఖ, కడప

జిల్లాలో ఫేజ్‌-1 కింద అర్బన పరిధిలో నిర్మించే 40 కాలనీల్లో తాగునీటి సరఫరాకు రూ.70 కోట్లు, గ్రామాల్లో నిర్మించే 291 కాలనీలకు రూ.29 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఫేజ్‌-2 కింద సంబంధిత ఇంజనీర్లు ప్రతిపాదనలు తయారు చేస్తారు. మౌలిక వసతులకు ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం. రోడ్లు, డ్రైనేజీ పనులు ఉపాధి హామీ నిధులతో చేపడతారు.

Updated Date - 2021-01-19T05:33:59+05:30 IST