ఎట్లా అమ్ముతారు?

ABN , First Publish Date - 2021-02-09T06:43:04+05:30 IST

మూడుదశాబ్దాలుగా ఎదురులేకుండా సాగిపోతున్న సంస్కరణల రథానికి మొట్టమొదటి సారి పెద్ద ప్రతిఘటనను దేశరాజధానిలో రెండు నెలలుగా చూస్తున్నాము...

ఎట్లా అమ్ముతారు?

మూడుదశాబ్దాలుగా ఎదురులేకుండా సాగిపోతున్న సంస్కరణల రథానికి మొట్టమొదటి సారి పెద్ద ప్రతిఘటనను దేశరాజధానిలో రెండు నెలలుగా చూస్తున్నాము. వ్యవసాయచట్టాలను సమర్థించేవారు కూడా రైతుల ఐక్యతను, దీక్షాబలాన్ని ప్రశంసిస్తున్నారు. ఆరేళ్లుగా అంకుశమే లేని అధికార ఐరావతం మీద స్వారీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఎదురుదెబ్బ తింటున్నది కూడా రైతు ఉద్యమంలోనే. ఇది చాలదన్నట్టు, దక్షిణాదిలో కూడా తనపై వ్యతిరేకతకు తానే ఆజ్యం పోసుకుంటూ విశాఖ ఉక్కు అమ్మివేత పథకాన్ని కేంద్రం ప్రకటించింది. పబ్లిక్ రంగ సంస్థలను అన్యాక్రాంతం చేసే కార్యక్రమం అన్ని ప్రభుత్వాలలో జరిగినప్పటికీ, మరీ తెగబడి వ్యవహరిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి గట్టి ప్రతికూలత విశాఖ ఉక్కు ఉద్యమ సందర్భంగానే ఎదురుకానున్నదా? 


ఉద్యమ నిర్మాణం జరిగి, నిలకడగా సాగి, ప్రభుత్వంపై పెద్ద ఒత్తిడి తేగలగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ ఉద్యమం నమూనా సాధ్యపడకపోవచ్చు. ఫలితాలతో, పర్యవసానాలతో సంబంధం లేకుండా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏకమొత్తంగా అమ్మేయాలనే నిర్ణయం వెనుక, కేంద్ర మంత్రివర్గం అవగాహనారాహిత్యం, చరిత్ర తెలియని అజ్ఞానం, ఏదైనా చేయగలమన్న అహంకారం ఉన్నాయి. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కారణంగా ఏర్పడిన చిన్నచూపు కూడా ముఖ్యమైన కారణం. ఉద్వేగాలు, మనోభావాలు, గాఢమైన అనుబంధాలు- గుడిగోపురాల విషయంలో మాత్రమే ఉండవు. తమ జీవనోపాధులన్నీ అల్లుకున్న పందిరిలాంటి అభివృద్ధి వ్యవస్థల చుట్టూ కూడా ఉంటాయి. అది ఒక చెరువు కావచ్చు, ఒక నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, ఒక కర్మాగారం కావచ్చు, ఒక రవాణామార్గం కావచ్చు, మనుషుల గతంతో, వర్తమానంతో జ్ఞాపకాలుగా అనుభవాలుగా పెనువేసుకుని ఉండే ఒక భవనం కావచ్చు, ఒక పూరిగుడిసె కావచ్చు.. వాటిని గాయపరిస్తే, వాటిని తొలగించాలని చూస్తే మనుషులకు కోపం వస్తుంది. తుపాకి తూటాలకు ఎదురునిలిచి సమష్టి కోసం సాధించుకున్న కర్మాగారం కదా, తమకు బతుకూ మెతుకూ అయిన పంటభూములను వదులుకుని వరించిన అభివృద్ధి కదా, ఆంధ్రుల హక్కు కదా, ఎట్లా దాన్ని అమ్మేయాలనుకుంటారు? 


ఎంతో ఆరాటపడితే, ప్రాణాలొడ్డి పోరాడితే కానీ విశాఖ ఉక్కు రాలేదు. దళిత నాయకుడు అమృతరావు సుదీర్ఘ దీక్ష చేసి ఆ వాగ్దానం సాధించారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు రోడ్లమీదకు వచ్చి జైళ్లకు పోయి, దెబ్బలు తిని, చచ్చిపోయి ఆ ఉద్యమాన్ని నిర్మించారు. ఇచ్చిన మాటను ప్రభుత్వాలు వెంటనే చెల్లించలేదు. పదిహేనేళ్లకు పనిమొదలయితే, పాతికేళ్లకు ప్రారంభోత్సవం జరిగింది. ఇంతా చేసి, కేంద్రం పెట్టిన పెట్టుబడి 5 వేల కోట్లు. ఈ మూడు దశాబ్దాలలో నలభైవేల కోట్లకు పైగానే డివిడెండ్లు, పన్నుల రూపంలో కేంద్రానికి అవి తిరిగి ముట్టినయి. లక్ష కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. భారీ ఉత్పత్తికి తగినంత సామర్థ్యమున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల వల్ల, సొంతానికి నష్టం, పరులకు లాభం కలిగించే కేంద్రప్రభుత్వ విధానాల వల్ల, ఒక్క సొంత ఇనుపగనిని కూడా కేటాయించకుండా ఆర్థికభారం వేస్తున్నందువల్ల, ఈ మధ్య కాలంలో కొంత నష్టం వస్తున్నది. 2005 నుంచి 2014 దాకా వరుసగా లాభాలే వచ్చాయి. ప్రస్తుతం ఈ సంవత్సరంలో కూడా, పెరిగిన సామర్థ్యంతో లాభార్జన మొదలయింది. ఎందుకు మరి అమ్మడం? 


ఇరవైవేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఇస్తోంది. లక్షలాది మందికి పరోక్ష జీవనాధారమైంది. అంత మాత్రమేనా? విశాఖ రూపురేఖలనే మార్చివేసిన ఆర్థిక క్రమానికి విలువ కట్టగలరా? వెల్లివిరిసిన అనేకానేక చిన్నాచితకా మనుగడలను లెక్క వేయగలరా? ఒక ప్రైవేటు కంపెనీ చుట్టూ ఇంతటి విస్తరణ ఉంటుందా? అసలు ఒక ఫ్యాక్టరీ ప్రజలది అనే భావన కలిగించే స్థైర్యమే వేరు. వ్యక్తిగత లాభం మాత్రమే సామర్థ్యాన్ని పెంచుతుందని, సమష్టి యాజమాన్యం బాధ్యతారాహిత్యానికి దారితీస్తుందని నూతన ఆర్థిక విధానకర్తల వాదం శుష్కమైనదని విశాఖ ఉక్కు విజయగాథ నిరూపిస్తుంది. 


తెలంగాణ చరిత్రతో ముడిపడిన ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి వాటిని, జాతికి ఎంతో సేవ చేసిన ఐడిపిఎల్, ప్రాగాటూల్స్ మొదలైన వాటిని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మూసివేయడమో అమ్మి వేయడమో చేశారు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా చారిత్రక స్ఫూర్తిని నిలబెట్టే చర్యలేవీ తీసుకోలేదు, పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. ఉద్వేగాలు కూడా ఏ ఒత్తిడీ తేలేకపోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజల మధ్య ఒక ఐక్యత, సంఘీభావం కలగడానికి ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఒక అవకాశం. విభజనను నివారించడం మీదనే కేంద్రీకరించిన సమైక్య ఉద్యమం కారణంగా, కేంద్రం నుంచి న్యాయమైన పరిహారాలు, వాగ్దానాలు దక్కలేదు. నేతల అవకాశ వాదం కారణంగా, పార్లమెంటులో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా దక్కలేదు. ఇప్పుడు ఉన్న గొప్ప ఆదరువును కూడా అపహరించే ప్రయత్నం జరుగుతున్నది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, సకల పక్షాలూ ఏకమైతే తప్ప, ఒకే లక్ష్యసాధన పైనే గురిపెడితే తప్ప, ఈ ప్రమాదాన్ని నివారించలేరు. నిజానికి ఇది ఒక పెనుముప్పు, గుర్తించగలిగితే, దీని వెనుక ఒక గొప్ప అవకాశం కూడా ఉంది!

Read more