Abn logo
Sep 23 2021 @ 00:32AM

సత్యం దగ్ధమైతే న్యాయం ఎలా సాధ్యం

నేరం జరిగిపోయిందనేది రుజువు అవసరం లేని వాస్తవం. అందుకు ఆరేళ్ల చిన్నారి మృతదేహమే తిరుగులేని సాక్ష్యం. పల్లంకొండ రాజు (30) అనే యువకుడి పైన గట్టి అనుమానం. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు. బతికున్న మనుషులెవరూ నిజం చెప్పే ధైర్యం చేయలేని సమాజంలో నిజం చెప్పగలిగేదీ, అతని మరణాన్ని విశ్లేషించేదీ ప్రాణం లేని అతని శరీరమే. 


ఆ రెండు మృతదేహాలూ నిజాలు చెప్పగలిగే సాక్ష్యాలు. చట్టం ప్రకారం, జీవించి ఉన్న వ్యక్తికి అనేకానేక అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. నిజం చెప్పడానికి నాలుక ఉంటుంది కానీ చెప్పించేందుకు స్థిరంగా నిలబెట్టే వెన్నెముక ఉండదు. న్యాయశాస్త్ర అనుభవాల ప్రకారం మృతదేహం అబద్ధం చెప్పదు. బతికున్నపుడు ఆ శరీరంపై జరిగిన దాడుల నిజానిజాలను వెలికి తీసేందుకు శవం మీద మిగిలిన గాయాల మరకలు, శరీరం లోపలి దెబ్బతిన్న భాగాలు కుట్రలోతులను కూడా తెలియజేస్తాయి. మృతదేహం ఒక గొప్ప సాక్ష్యం. పడిపోయి కూడా నిలకడగా చెప్పగల సాక్ష్యాన్ని ఎవరు వింటారు, ఎవరు పరిశీలిస్తారు? మమ్ములను చూడండిరా బాబూ అని అరిచే శవ సాక్ష్యపు నిజాలను వెలికి తీసేదెవరు? సక్రమంగా నిష్పక్షపాతంగా, నిర్భయంగా శవపరీక్ష చేయడం ఈ రోజుల్లో ఒక పెద్ద సాహసం. మరి అటువంటి సాహసులు ఉన్నారా? రాజు పోస్ట్‌మార్టం పరీక్ష నిష్పాక్షికంగా నిర్భయంగా చేయగలిగారా? 


చిన్నారి పైన అత్యాచారం తరువాత హత్య జరిగిందని శవపరీక్షలో మాత్రమే తెలిసింది. ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కనుక ఏం జరిగిందో నోటితో చెప్పజాలదు. నేరం చేసిన వాడు చెప్పనే చెప్పడు. చుట్టూ ఉండే జనానికి, అక్కడ లేని తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియదు. ఆమెపైన ఏ నేరం జరిగిందో తెలుసుకోవడానికి బాలిక శవపరీక్ష నివేదిక ఉపయోగపడింది. అదే సూత్రం పాటించి, శవపరీక్ష నిష్పాక్షికంగా జరిపించి ఉంటే రాజును హత్య చేశారా లేక రాజే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తేలిపోయేది. కాని అందుకు అవకాశమే లేకుండా సత్వర శవదహనం చేయించేశారు. శరవేగంగా శవపరీక్ష చేయడం అంతకన్న వేగంగా శవదహనం చేయడం వల్ల సాక్ష్యం దగ్ధమైపోయింది. 


మొదటి నేరానికి సాక్ష్యం హతురాలి శరీరం. అంత్యక్రియలు జరగక ముందు శవపరీక్ష నిర్వహించారు. రెండో నేరానికి ఏం మిగిలింది? నమ్మడానికి వీల్లేని శవపరీక్ష నివేదిక, వెలికి తీయడానికి వీల్లేకుండా దగ్ధం చేసిన మృతదేహం బూడిద మినహా! నిందితుడైనా నేరస్థుడైనా నేర వివరాలు తెలిసిన వాడయినా రాజు మాత్రమే. రాజు ఒక్కడే ఈ నేరం చేశాడా, మరెవరైనా ఉన్నారా? తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. రాజును చంపేసిన తరువాత ఆ నేరం రుజువు చేయగలిగే అవకాశం లేకుండా పోయింది. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? 


రాజు ముఖం మీద ఉన్న గాయాలు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడం వల్లనే ఏర్పడలేదని తేలితే రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన నిలబడదు. రైలు ఇంజన్ ముందు దుముకి జీవితం ముగించాడనుకుంటే, ఆ శరీరం జాగ్రత్తగా పట్టాల మీద ఉండడానికి బదులు ఎక్కడో విసిరినట్టు పడి ఉండేది. పట్టాల మీద తల పెట్టి పడుకుని ప్రాణం తీసుకుందామని అతను అనుకుని ఉంటే శరీరం మూడు ముక్కలై ఉండేది. పరుగెత్తే రైలు కింద పడి ఎంతో జాగ్రత్తగా ఆత్మహత్య చేసుకోవడం సాధ్యం కాదు. అన్నిటికీ మించి, పరుగెత్తే రైలు ముందు నిలబడాలన్నా పట్టాల పైన తల పెట్టాలన్నా చాలా ఎక్కువ ధైర్యం అవసరం. రాజు అంత ధైర్యం చేసి ఉంటాడా? రైలు ముందు పడితే అటువంటి దెబ్బలే తగులుతాయా?


ఈ సంక్లిష్టమైన వివాదానికి సంబంధించిన నిజాలు కేవలం శవపరీక్షలోనే వెల్లడవుతాయి. అయితే ఆ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలే ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. 2019లో దిశ అత్యాచారం, హత్య జరిగిన సంఘటనలో నిందితులు నలుగురిని కాల్చేసిన ఆరోపణల పైన ఒక పిల్ విచారించిన సుప్రీంకోర్టు మళ్లీ శవపరీక్ష జరపాలని ఆదేశించింది. మొదటి శవపరీక్షను నమ్మలేదు. రఘురామ రాజు విషయంలోనూ అదే జరిగింది. పోలీసులు కొట్టిన దెబ్బల గాయాలపై ఏపీ వైద్యులు ఇచ్చిన నివేదికను విశ్వసించక సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆర్మీ ఆసుపత్రి మరోసారి వైద్యపరీక్షలు జరిపి గాయాలున్నాయని నిర్ధారించింది. ఈ కేసులో నేరం జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో వైద్యపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఎంతో ముందుచూపుతో ఆదేశాలు జారీ చేసింది.


దిశ కేసులో నలుగురి నిందితుల మృతదేహాలను దహనం చేయలేదు కనుక మళ్లీ శవపరీక్ష చేయడానికి వీలైంది. కాని ఆరేళ్ల చిన్నారి కేసులో అనుమానితుడి శవాన్ని తగలబెట్టిన తరువాత న్యాయస్థానాల్లో నిజం రుజువు చేసే అవకాశం పూర్తిగా లేకుండాపోయింది. రాజు శవాన్ని తొందరపడి ఎందుకు కాల్చారన్నది ప్రశ్న. ఏ నిజం బయటపడుతుందని వీరు భయపడుతున్నారు? డాక్టర్లు ఎందుకు నిష్పాక్షికమైన వైద్యనివేదికలను, శవపరీక్షా నివేదికలను ఇవ్వలేకపోతున్నారు? భయం కావచ్చు. ఒత్తిడులు కావచ్చు. ప్రలోభాలు కూడా ఉండవచ్చు. రఘురామరాజుపై పోలీసుల థర్డ్ డిగ్రీ హింస జరిగిందా లేదా అనేది చాలా సీరియస్ విషయం. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న తరువాతనే ఆంధ్ర డాక్టర్ల వైద్యనివేదిక అబద్ధాలపుట్ట అని తేలింది. 


డాక్టర్లు కావాలని తప్పుడు నివేదిక ఇస్తే, అందుకు కారణం ప్రాణాంతకమైన బెదిరింపులయి ఉంటే వారు శిక్షార్హులు కాదు. కానీ వారు కూడా ఉత్సాహంగా సాక్ష్యాలను తారుమారుచేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నిలదీయాల్సిందే. పోలీసులే ఒత్తిడి చేసి ఉంటే అందుకు వారు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. అయితే దారుణం ఏమంటే అసలు ఆ మాటే ఎవరూ మాట్లాడడం లేదు. 


నిర్భయ వంటి ఘటనల్లో నేరాలను నిజంగా నిర్ధారించాలంటే నిష్పక్షపాత వైద్యబృందం అవసరం. రక్షకభటులు, వైద్యులు ఒక్కటై, అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తుతూ తప్పుడు వైద్యనివేదికలు, తప్పుడు శవపరీక్ష నివేదికలు ఇస్తూ పోతే పౌరుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉన్నట్టే కదా. ఈ నివేదికల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తే న్యాయస్థానాలను న్యాయమూర్తులను కూడా జనం నమ్మడానికి వెనుకాడతారు. 


రాజు మృతదేహం పట్టాలపై దొరికిందని తెలియగానే పౌరసంఘాలు, మహిళా, మానవహక్కుల సంఘాలు అప్రమత్తమై తాత్కాలిక సిజె ఇంటికి వెళ్లి ఒక మెమొరాండం సమర్పించారు. మంత్రిగారు ఎన్‌కౌంటర్ చేసి తీరతామని అన్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్‌కౌంటర్ చేయడమే న్యాయమనే కొత్త న్యాయసూత్రాన్ని చెప్పారని, ఇందుకు అనుగుణంగా రాజును చంపేసే ఉంటారని, కనుక సక్రమంగా పోస్టుమార్టం చేయాలని, రాజు శవాన్ని దహనం చేయకుండా నిలిపివేయాలని వారు కోరారు. మరోవైపు శవపరీక్ష జరపడం, వెనువెంటనే దహనం చేయడం కూడ జరిగిపోయాయి. మరునాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయస్థానం వెంటనే స్పందించి న్యాయ విచారణ జరపాలని ఆదేశించింది. కాని అక్కడ మిగిలిందేమిటి? మృతదేహాన్ని దహనం చేయగా మిగిలిన బూడిద. డాక్టర్లు ఇచ్చిన ఓ శవ నివేదిక. 


నేరగాడని మనమంతా నమ్ముతున్న రాజు మనముందు లేడు. అతని భార్య, తల్లి ఉన్నారు. వారిని, వారి బంధువులను పోలీసులు నిర్బంధించారు. రాజు దొరకకపోతే తమను జైలుకు పంపిస్తామని పోలీసులు అన్నారని, రాజు దొరికాడు కనుకనే తమను వదిలారని వారు చెప్పారు. రాజు నేరస్థుడని, కనుక అతడి తల్లిని, భార్యను కూడా నమ్మవద్దని సోషల్ మీడియాలో జనసైన్యం తీర్పులు చెబుతున్నారు! దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సహా అనేక అనుమానాస్పద ఎన్‌కౌంటర్ల నిజానిజాలు తేల్చాలని ప్రజాసంఘాలు, మీడియా (ఇదివరకు) పోరాడుతున్నాయి. మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా రెండురోజుల్లో నేరస్థుడు ఎవరో పోలీసుల సాయంతో కనిపెట్టి, వారే నేరగాళ్లని నిర్ధారించేస్తున్నాయి. కామాంధుడని, రేపిస్టు అని, హంతకుడని తీర్పుచెప్పి అతడు ఎలాగైనా చావడమే న్యాయమనీ, దేవుడు విధించిన శిక్ష అనీ సుప్రీంకోర్టు స్థాయిలో నెటిజన్లు ప్రకటిస్తున్నారు. ఈ అనుమానాస్పద మరణాలపై విచారణ, కోర్టుల్లో ప్రాసిక్యూషన్లు జరపడం, జైళ్లలో శిక్షలు అనుభవింపజేయడం లేదా ఉరితాళ్లు, తలారులు వంటివన్నీ వృథా అనే ధోరణిలోకి జనాన్ని తోసేస్తున్నారు. యథావిధిగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే అనాగరక న్యాయాన్ని సరికొత్త రీతిలో అమలు పరుస్తున్నారు. అయితే ఆ నిర్వాకాన్ని ఇప్పుడు నకిలీ ఎన్‌కౌంటర్ అనడం లేదు. ఆ హంతక అన్యాయానికి ఆత్మహత్య అనే సరికొత్త నామకరణం చేశారు.

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

డీన్, మహీంద్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా