భారత్, అమెరికాల మధ్య కరోనా పరీక్షలు, రికవరీ రేటు వ్యత్యాసం ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2020-05-29T02:43:11+05:30 IST

అమెరికా ఇప్పటివరకు 1.5 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్టు

భారత్, అమెరికాల మధ్య కరోనా పరీక్షలు, రికవరీ రేటు వ్యత్యాసం ఎలా ఉందంటే..

వాషింగ్టన్: అమెరికా ఇప్పటివరకు 1.5 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఇన్ని పరీక్షలు నిర్వహించలేదని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం.. అమెరికా ఇప్పటివరకు కోటి 57 లక్షల 66 వేల 114 పరీక్షలు చేసింది. ఇందులో 18 లక్షల 97 వేల 701 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా చేసిన పరీక్షల్లో 12 శాతం మందికి పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటివరకు కేవలం 33 లక్షల పరీక్షలను మాత్రమే నిర్వహించడం గమనార్హం. అంటే.. భారత్ కంటే అమెరికా ఐదు రెట్లు ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించింది. పైగా ఇక్కడ విశేషమేంటంటే.. అమెరికా జనాభా 35 నుంచి 40 కోట్లలోపే ఉంటుంది. భారత్ జనాభా 130 నుంచి 140 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి జనాభా పరంగా చూసుకుంటే అమెరికా కంటే భారత ప్రభుత్వమే ఎక్కువ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఐసీఎమ్ఆర్ డేటా ప్రకారం భారత్ ఇప్పటివరకు 33 లక్షల 62 వేల 136 పరీక్షలు నిర్వహించింది. గత కొద్ది రోజులుగా భారత ప్రభుత్వం నిత్యం లక్షకు పైగా పరీక్షలు నిర్వహిస్తోంది. మరోపక్క భారత్‌లో ఇప్పటివరకు 1,58,333 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఇది 5.26 శాతంగా ఉంది. అమెరికాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు న్యూయార్క్‌లో రాగా.. భారత్‌లో అత్యధిక పాజిటివ్ కేసులు మహరాష్ట్ర నుంచి వచ్చాయి. న్యూయార్క్‌లో 3,66,638 కరోనా కేసులు రాగా.. 29,289 మంది మరణించారు. మహరాష్ట్రలో 56,948 కేసులు రాగా.. 1,897 మంది చనిపోయారు. రికవరీ రేటు విషయానికి వస్తే.. అమెరికాలో రికవరీ రేటు 25.82 శాతం ఉండగా.. భారత్‌లో 42 శాతంగా ఉంది.

Updated Date - 2020-05-29T02:43:11+05:30 IST