ఎంతెంత దూరం..?

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

కడపను వైఎ్‌సఆర్‌, అన్నమయ్య అని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నోటిషికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాగా..

ఎంతెంత దూరం..?

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి

రైల్వేకోడూరు, చిట్వేలి నుంచి జిల్లా కేంద్రానికి 85 కి.మీల పైనే

50 కి.మీ లోపే తిరుపతి 

సిద్ధవటం ప్రజలు రాయచోటికి రావాలంటే 

కడప దాటాల్సిందే..

తిరుపతిలో కలపాలని రైల్వేకోడూరు వాసులు..

జిల్లా కేంద్రం చేయండి లేదా కడపలో ఉంచండి.. ఇదీ రాజంపేట వాసుల డిమాండ్‌

భౌగోళికంగా రాయచోటే ఆమోదయోగ్యమంటున్న ఆ ప్రాంత ప్రజలు


కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ రాగానే ప్రభుత్వ నిర్ణయంపై రాజంపేట, రైల్వేకోడూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. 117 ఏళ్లుగా రెవెన్యూ డివిజన్‌గా సేవలు అందించిన రాజంపేటను కాదని రాయచోటిని ఎలా జిల్లా కేంద్రం చేస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. రైల్వేకోడూరు నుంచి తిరుపతికి 50 కి.మీ.లోపే. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 85-90 కి.మీలు ఉంటుంది. సానిపాయి ఘాట్‌ రోడ్డులో ప్రయాణం నరకమే. లేదంటే 140 కి.మీలు ప్రయాణం చేసి కడప మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో కోడూరు నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజంపేట నియోజవర్గానికి చెందిన సిద్దవటం మండలం నుంచి కడపకు 20 కి.మీల దూరం. రాయచోటికి వెళ్లాలంటే కడప దాటి వెళ్లాలి. ఫలితంగా రైల్వేకోడూరును తిరుపతిలో.. రాజంపేటను కడపలో కలపాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.


(కడప-ఆంధ్రజ్యోతి): కడపను వైఎ్‌సఆర్‌, అన్నమయ్య అని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నోటిషికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాగా.. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు. జిల్లా కేంద్రం అన్ని నియోజకవర్గాలకు అనుకూలంగా మధ్యలో ఉండాలనే లక్ష్యంగా రాయచోటిని చేశారనే వాదన ఉంది. అదే క్రమంలో తమకు అతిదగ్గరలో ఉండే శ్రీబాలాజీ తిరుపతి జిల్లాలో కలిపితేనే అనుకూలంగా ఉంటుందని రైల్వేకోడూరు ప్రజలు అంటున్నారు. అయితే.. ఇటు రాజంపేట, రైల్వేకోడూరు, అటు మదనపల్లె, పీలేరు, తంబళపల్లె నియోజకవర్గాలకు మధ్యలో.. భౌగోళికంగా.. ప్రజల రాకపోకలకు అనుకూలంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడం సరైన నిర్ణయమని ఆ ప్రాంత ప్రజులు పేర్కొంటున్నారు.


రైల్వేకోడూరు - రాయచోటి 85 కి.మీలు

రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలో రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు మండలాలు ఉన్నాయి. రైల్వేకోడూరు మండలంలో 152 గ్రామాలు ఉన్నాయి. లక్షకు పైగా జనాభా ఉంది. ఇది కొత్తగా ఏర్పాటు చేసే అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తుంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్‌. లేదంటే శ్రీబాలాజీ జిల్లాలో కలపాలంటున్నారు. కారణం.. రాయచోటి ఈ నియోజవర్గానికి సుమారు 85-90 కి.మీ.ల దూరంలో ఉంటుంది. రైల్వేకోడూరు మండలంలోని కుక్కలదొడ్డి, బాలపల్లి, శెట్టిగుంట, జ్యోతికాలనీ గ్రామాలు తిరుపతికి 15-20 కి.మీల దూరంలో ఉన్నాయి. కడప జిల్లాలోనే ఉన్నా తిరుపతితోనే అనుబంధం ఎక్కువ. అవసరం ఏదైనా తిరుపతికి వెళ్లాల్సిందే. రాజంపేటనే జిల్లా చేయాలి, లేని పక్షంలో శ్రీబాలాజీ జిల్లాలో తమను కలపాలనే డిమాండ్‌ తెరపైకి తెస్తున్నారు. చిట్వేలి, పుల్లంపేట, పెనగనూరు మండలాల్లోనూ ఇదే వాదన వినిపిస్తోంది.


కడప మీదుగా రాయచోటికి

రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలు ఉన్నాయి. రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల ప్రజలు రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో కడపలో ఉంచినా సంతోషిస్తామని అంటున్నారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటైతే సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల ప్రజలు జిల్లా కేంద్రం రాయచోటికి చేరాలంటే కడప మీదుగా దాదాపు 65-80 కి.మీలు వెళ్లాలి. సిద్దవటం మండలంలో 106 గ్రామాలు, 18 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుత జిల్లా కేంద్రం కడపకు సిద్దవటం మండల కేంద్రం నుంచి 22 కి.మీలు, భాకరాపేట నుంచి 16 కి.మీలు దూరం ఉంది. కడప నగరానికి కేవలం 2-8 కి.మీల దూరంలో ఉన్న లింగంపల్లి, టక్కోలి, మాచుపల్లి, మూలపల్లి గ్రామాల ప్రజలు అన్నమయ్య జిల్లా ఏర్పడితే జిల్లా కేంద్రం రాయచోటి వెళ్లాలంటే కడపకు వచ్చి 55 కి.మీలు వెళ్లాలి. తతమను లను కడప జిల్లాలో చేర్చాలని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. కోదండరామస్వామి కొలువైన ఒంటిమిట్ట అటు రాజంపేటకు 28 కి.మీలు, ఇటు కడపకు 25 కి.మీల దూరంలో ఉంది. ఈ మండల ప్రజలు రాయచోటికి వెళ్లాలంటే కడపకు వచ్చి వెళ్లాల్సిందే. 75 కి.మీలు దూరమవుతుంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయండి, లేదంటే కడప జిల్లాలో కలపాలని అంటున్నారు. అయితే.. టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలు రాయచోటి మధ్య దూరం 20-24 కి.మీలే. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటేనే ఉపయోగమని ఆ మండలాల ప్రజలు అంటున్నారు.


వ్యాపారులు, విద్యార్థులకు ఇబ్బంది 

- మందల రామకృష్ణ, వ్యాపారి, రైల్వే కోడూరు 

అన్నమయ్య జన్మస్థలమైన రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలి. రాయచోటి చేయడంతో రైల్వేకోడూరు నుంచి పనుల కోసం 90 కి.మీలు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య జనానికి ఇబ్బందులు తప్పవు. సరైన రోడ్డు సౌకర్యాలు కూడా లేవు.


శ్రీబాలాజీలో కలపండి 

- సుగవాసి శివయ్య, రైల్వేకోడూరు 

రైల్వేకోడూరుకు తిరుపతి కేవలం 50 కి.మీల దూరంలోనే ఉంది. ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్లాల్సిందే. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే మా ప్రధాన డిమాండ్‌. లేనిపక్షంలో మాకు ఇబ్బంది లేకుండా మమ్ములను శ్రీబాలాజీ తిరుపతి జిల్లాలో కలపండి. 


రాజంపేట లేకపోతే కడపలో చేర్చండి 

- రామదాసు, సీనియర్‌ న్యాయవాది, ఒంటిమిట్ట

117 ఏళ్లుగా డివిజన్‌ కేంద్రం, 65 ఏళ్లుగా పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలి. లేదంటే కడపలో చేర్చాలి. సిద్దవటం, ఒంటిమిట్ట, అట్లూరు మండలాలు అట్లూరు కోర్టు పరిధిలోకి వస్తాయి. తాజాగా అట్లూరు కడప జిల్లా, సిద్దవటం, ఒంటిమిట్ట అన్నమయ్య జిల్లాలోకి వస్తాయి. కోర్టు విభజన ఎలా చేస్తారు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి.


భౌగోళికంగా రాయచోటే అనుకూలం 

- నాగిరెడ్డి, జిల్లా సాధన సమితి అధ్యక్షులు, రాయచోటి

కరువుతో తల్లడిల్లిన రాయచోటి ప్రాంతం జిల్లా కేంద్రమైతే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. పారిశ్రామికీకరణకు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాయచోటి మీదుగా జాతీయ రహదారి ఉంది. తాగునీటికి వెలిగల్లు ప్రాజెక్టు ఉంది. తక్షణ ఆఫీసుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 32 మండలాల ప్రజల రాకపోకలకు అనుకూలంగా మధ్యలో ఉంది. ఒక విభజన జరిగినప్పుడు ఒకట్రెండు ప్రాంతాలకు కొంత ఇబ్బంది కలగవచ్చు. మెజార్టీ ప్రాంతాలకు అనుకూలమా..? కాదా..? అన్నదే పరిగణలోకి తీసుకోవాలి. భౌగోళికంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని చేయాలనే నిర్ణయం అందరికి ఆమోదయోగ్యమైనది.

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST