Abn logo
Jul 29 2021 @ 01:46AM

కేంద్రం ఎలా పంపకం చేస్తుంది?

రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తి ఆమోదం కాని తీరులో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్య మేమీ లేదు. కాని ఇటీవల తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ కృష్ణ బోర్డుకు రాసిన లేఖ చూస్తే ఈ దేశంలో ఒక రాజ్యాంగం వుందని తదనుగుణంగా చట్టాలు రూపొందింప బడి అమలు జరుగుతాయనే సృహ ఆయనకున్నట్లు కన్పించడం లేదు. నదీ జలాల పంపిణీకి నియమింప బడే ట్రిబ్యునల్స్ తీర్పులు అందరికీ శిరోధార్యమని తుదకు ట్రిబ్యునల్స్ అవార్డులను సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించే అవకాశం లేదని పైగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 సబ్ సెక్షన్ 8 (a) (1)ఏం చెబుతుందో సదరు ఇంజనీరింగ్ చీఫ్‌కు తెలియదని నమ్మలేము.


రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 సబ్ సెక్షన్ 8(a)(1)ఏం చెబుతుందంటే ఈ చట్టం కింద నియమింపబడే బోర్డు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు నియమింప బడిన ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేయ వలసి వుందని స్పష్టంగా పేర్కొన్నది. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉనికినే గుర్తించనందున యాభై – యాభై శాతం నీటి పంపకం సిద్ధాంతం ఇంజనీరింగ్ చీఫ్ తెర మీదకు తెచ్చారు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మరో వింత వాదన లేఖలో పొందు పర్చారు. పెన్నా బేసిన్‌లో 300 టియంసిలు నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవంలో రాయలసీమలో అట్టి నిర్మాణాలు లేవు. ఒక వేళ ఉన్నా తెలంగాణకు సంబంధం లేదు. కర్ణాటకలో భారీ వర్షాలు పడితే పెన్నా, కుందు, చిత్రావతి నదులకు వరద వస్తుంది. ఇప్పటికీ రాయలసీమ వర్షాధారంగా పెన్నా కుందు నదుల ఆధారంగా బతుకు వెళ్ల దీస్తోంది. కాకుంటే తెలంగాణ ప్రభుత్వం పోతి రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పకడ్బందీగా టెలీ మీటర్లు పెట్టించు కొని ఆంధ్ర ప్రదేశ్ వాడుకొనే కృష్ణ నీళ్లను గణించాలని బోర్డును కోరడంలో న్యాయం ఉంది. గాని పెన్నా బేసిన్‌లో రిజర్వాయర్‌లు నిర్మించుతున్నారని ఒక సాంకేతిక నిపుణుడుగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అభ్యంతరం పెట్టారంటే రాజకీయ కోణం తప్ప మరొకటి కాదు. తమకు 771 టియంసిలు కేటాయించాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ను కోరినట్లు కూడా ఇంజనీరింగ్ చీఫ్ లేఖలో పేర్కొన్నారు. 


రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు పొడిగింపబడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణాంశాలు నమోదు చేసే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు 11వ షెడ్యూల్‌లో వున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోసం అభ్యర్థించితే ట్రిబ్యునల్ తిరస్కరించింది. కృష్ణ నదిలో క్యారీ ఓవర్ కింద ఉన్న 150 టియంసిలు తప్ప మిగులు జలాలు చెప్పింది. తుదకు రెండు రాష్ట్రాల అభ్యర్థనపై అంగీకరించిన అంశం ఇంజనీరింగ్ చీఫ్ మరుగు పర్చారు. ఆఖరుగా తెలంగాణ 771 టియంసిలతో కలుపుకొని రెండు రాష్ట్రాలు వేయి టియంసిలకు పైగా టెండర్ పెట్టాయి. లేని నీళ్ల కోసం ట్రిబ్యునల్ వద్ద పోట్లాట తప్ప మరొకటి కాదు ఒక వేళ బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో తెలంగాణకు అన్యాయం జరిగినా కృష్ణ బేసిన్ లోని నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరిగిన సందర్భంలో తప్ప రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగి నపుడు కానే కాదు. అందువల్ల కృష్ణ బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగాలని తెలంగాణ కోర వచ్చు. 


తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ వాదన ఇలా వుండగా ‘కృష్ణా కీచులాటలో కేంద్రానికే లబ్ధి’ శీర్షికతో డాక్టర్ భిక్షం గుజ్జా, డాక్టర్ శివ కుమార్ల వ్యాసం ఈనెల 20న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ ఆర్టికల్ హెడ్డింగ్, ముగింపు సందర్భంగా రెండు రాష్ట్రాలకు చేసిన సూచనలు ఎంతో ఆమోద యోగ్యంగా ఉన్నా ఆర్టికల్‌లో ఎక్కువ భాగాలు తెలంగాణ లేవ నెత్తు తున్న అసంబద్ధ వాదనలను పోలి వున్నాయి. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు అవిభక్త రాష్ట్రానికి 1005 టియంసిల నీటిని ట్రిబ్యునల్–2 కేటాయించింది. (ప్రస్తుతం అది అమలులో లేదనే అంశం గుర్తించక పోవడం ఒకింత ఆశ్చర్యకరమే) ఈ కేటాయింపులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలి. (కేవలం క్యారీ ఓవర్ కింద ఉన్న 150 తప్ప మిగిలిన నీరు ఎవరికెంతో స్పష్టంగా పేర్కొని ఉంది) కృష్ణ పరివాహ ప్రాంతంలో 66 శాతం తెలంగాణ 35 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ మేరకు ఉమ్మడి కేటాయింపులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంచే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని’ పేర్కొన్నారు. అంటే ట్రిబ్యునల్‌తో నిమిత్తం లేకుండా పరీ వాహ ప్రాంత సిద్ధాంతం మీద కేంద్రం నీటి పంపిణీ జరగాలన్న తెలంగాణ వాదనను పరోక్షంగా వీరు వ్యక్తం చేశారు. ఏ నదీ జలాలనైనా కేంద్రప్రభుత్వం రాష్ట్రాల మధ్య పంపకం చేసిన సందర్భం లేదు. వివాద మున్న నదీ జలాలను 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు నియమింప బడే ట్రిబ్యునల్స్ కేటాయింపులు చేయాలి. ఏ ట్రిబ్యునల్ తీర్పునైనా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొనే అవకాశం లేదు. పైగా ఇప్పుడు అమలులో ఉన్నది బచావత్ ట్రిబ్యునల్ అవార్డు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ కూడా విభజన చట్టంలో పేర్కొన్నట్లు అమలు చేయాలే గాని రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి రాక పోతే కేంద్ర ప్రభుత్వం పంపకం ఏలా చేస్తుందో సాగునీటి రంగ నిపుణులకే తెలియాలి. 


బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత తీసుకొని కృష్ణ జలాలను శాస్త్రీయ పద్ధతిలో పంపిణీ చేసింది. వంద సంవత్సరాల్లో పాతిక సంవత్సరాల నీటి కొరతను అంచనాగా తీసుకొన్నది. గోదావరి ట్రిబ్యునల్ కూడా ఇదే పరిస్థితి అవలంభించింది. గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల మధ్య లేని గొడవలు కృష్ణ జలాల్లోనే ఎందుకు వచ్చింది? అవసరాలు ఎక్కువ!.. లభ్యత తక్కువ. అందుకే నిత్యం పోట్లాట తప్పడం లేదు. అదేవిధంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు వినియోగంలో వున్న నీటి కేటాయింపులు జోలికి వెళ్లకుండా మిగిలిన నీటిని 65 శాతం నీటి లభ్యత తీసుకొన్నది. 


వాస్తవమేమంటే ఏ ట్రిబ్యునల్ అయినా కేటాయించిన నీరు తమ రాష్ట్ర అవసరాలకు సరిపోక పోవడంతో చట్టాలకు తుదకు రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పడంలో రెండు తెలుగు రాష్ట్రాల గొడవ ప్రథమం కాదు. ఆఖరిదీ కాబోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతి పాదించబడి గోదావరి జలాలు కృష్ణ బేసిన్కు తరలించే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ తన వాటా నీళ్లు పెన్నా బేసిన్‌కు తరలించడం ఎట్లా నేర మౌతుంది?. రాష్ట్ర విభజన చట్టం మేరకు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద నియమింపబడిన ట్రిబ్యునల్ తీర్పును ఉభయ తెలుగు రాష్ట్రాలు ఔదల దాల్చక తప్పదు. అయితే గియితే కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకైనా తెలంగాణ ఔదల దాల్చ వలసి వుంది. ఆలా కాకుండా చెరి సగం అనే వాదన కృష్ణ బోర్డు లేక కేంద్ర జలవనరుల శాఖ తుదకు సుప్రీంకోర్టు కూడా మార్పు చేసే అవకాశం లేదు. ఏ రాష్ట్రమైనా నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేయ వచ్చు. కాని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలును అడ్డు కోవడం సాధ్యం కాదు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు