ఫేక్‌ అని ఎస్పీ ఎలా చెబుతారు?: లోకేశ్‌

ABN , First Publish Date - 2022-08-11T08:04:40+05:30 IST

ఫేక్‌ అని ఎస్పీ ఎలా చెబుతారు?: లోకేశ్‌

ఫేక్‌ అని ఎస్పీ ఎలా చెబుతారు?: లోకేశ్‌

ఏ ల్యాబ్‌ పరిశీలించిందో ప్రజలకు చెప్పాలి: టీడీపీ

అమరావతి(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, ఆగస్టు 10: ‘‘ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఏ ప్రాతిపదికన చెప్పగలిగారు? సదరు వీడియో వాస్తవమైనదా లేక కల్పితమైనదా అని నిర్ధారించి చెప్పేందుకు వ్యవస్థలు, విధివిధానాలు ఉండగా... అదంతా ఫేక్‌ అని అనడం ఎస్పీ బాధ్యతారాహిత్యం. ఏ ల్యాబ్‌ ఆ వీడియోను పరిశీలించి, కల్పితమైనదని చెప్పిందో ప్రజల ముందు ఉంచాలి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇటీవల పరదాల బిజినెస్‌ బాగా పెరిగింది. సీఎం జగన్‌ ఏ జిల్లాకు వెళ్లినా 420 మాదిరిగా నక్కినక్కి భయపడుతూ పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొదలెట్టిన ఈ పరదాల బిజినెస్‌ ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించింది. మంగళగిరి అభివృద్ధికి సీఎం జగన్‌ రెండు బడ్జెట్లలో సుమారు రూ.2,600కోట్లు కేటాయించి, జీవోలను సైతం ఇచ్చారు. కానీ, ఆచరణలో ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారు’’ అని లోకేశ్‌ విమర్శించారు. కాగా, విశ్వవిద్యాలయాలను కూడా వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని లోకేశ్‌ విమర్శించారు. ‘‘రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం అరాచక పాలనకు అద్దం పడుతోంది. జగన్‌రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్‌టీయూ సూపరింటెండెంట్‌ నాగభూషణం వీఆర్‌ఎస్‌ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడాలి’’ అని లోకేశ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-08-11T08:04:40+05:30 IST