పాలన సాగేదెలా... ?

ABN , First Publish Date - 2022-05-08T05:21:20+05:30 IST

జిల్లా ఏర్పడి నెల రోజులు దాటినా పాలన గాడిలో పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పాలన సాగేదెలా... ?
అరకొరగా ఉన్న ఫర్నీచర్‌తో సర్దుకుపోతున్న ఖజానా కార్యాలయ ఉద్యోగులు

ఇంకా బాధ్యతలు చేపట్టని పలు శాఖల అధిపతులు

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల్లో సిబ్బంది


కొందరికి సంతోషం.. మరికొందరికి బాధను మిగులుస్తూ.. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడిపోయింది. జిల్లా ఏర్పడి నెల రోజులు దాటినా పాలన గాడిలో పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిపాలన సజావుగా సాగాలంటే.. అన్ని శాఖలకు అధిపతి అయిన కలెక్టర్‌ ఒకరితోనే సాధ్యం కాదు.. అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తేనే.. ప్రజలకు కావాల్సిన రీతిలో పరిపాలన సాగుతుంది. జిల్లా ఏర్పడిన తర్వాత.. దాదాపుగా అన్ని శాఖల అధికారులకు పోస్టింగులు ఇస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఇంకా పలు కీలక శాఖల అధికారులు బాధ్యతలు తీసుకోలేదు.


(రాయచోటి - ఆంధ్రజ్యోతి):

కొత్త జిల్లా కేంద్రంలో సుమారు 70 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. కలెక్టర్‌తో పాటు.. మిగిలిన శాఖలకు కూడా అధికారులను కేటాయించారు. ఇందులో ఇంకా సుమారు 9 ముఖ్యమైన శాఖల అధికారులు బాధ్యతలు తీసుకోలేదు. పట్టణ పేదరిక నిర్మూలన,  నీటి యాజమాన్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సూక్ష్మసేద్యం వంటి కీలక శాఖలకు జిల్లా అధికారులు లేరు. రెండు రోజుల కిందట జిల్లా గ్రామీణ ప్రాంత అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన నీలకంఠారెడ్డిని ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు ఇన్‌చార్జ్‌గా నియమించింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా మూడు రోజుల కిందట పీలేరుకు డాక్టర్‌ లోక్‌వర్ధన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ముఖ్యమైన జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎవరూ బాధ్యతలు తీసుకోలేదు. అదేవిధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డీడబ్య్లుఎంఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయం సేవల అధికారి (డీసీహెచ్‌ఎ్‌స), వికలాంగ శాఖ అదనపు సంచాలకులు (ఏడీ డిసేబుల్డ్‌), మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పీడీ, డీఎండబ్ల్యువో, మెప్మా పీడీ వంటి కీలకమైన శాఖలకు ఇంకా అధికారులు రాలేదు. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు అందడం లేదు. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలకు అధికారులను భర్తీ చేయాల్సి ఉంది. 


కనీస సౌకర్యాలు లేక.. 

కలెక్టరేట్‌ మినహా ఒకటో.. రెండో కార్యాలయాలలో దాదాపు కొంత మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. మిగిలిన అన్నిచోట్ల కనీస సౌకర్యాలు లేక అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల కనీసం తాగునీటి సౌకర్యం లేదు. ఇంటి వద్ద నుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున సమయం అయిపోతోందని, టిఫిన్‌ చేయకుండా ఆఫీసుకు వెళితే ఇంక అంతే సంగతులు. అక్కడ సమీపంలో ఎక్కడా టిఫిన్‌ కూడా దొరకదు. చాలా కార్యాలయాల్లో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. బాత్‌రూంకు వెళ్ళడానికి నీటి సౌకర్యం కూడా లేదు. రాజంపేట రోడ్డులోని మైనార్టీ ఐటీఐ కళాశాల ఆవరణలో వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ, పీఆర్‌ ఇంజనీరింగ్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మార్క్‌ఫెడ్‌, ఆర్‌డబ్య్లుఎస్‌, ఫిషరీ్‌సతో పాటు ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ సిబ్బందికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వుల కింద తిరుపతి, చిత్తూరు, కడప నుంచి కొత్త జిల్లాకు సిబ్బందిని కేటాయించారు. అయితే పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఈ కార్యాలయాలకు సమీపంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం.. కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని చెప్పవచ్చు. విధులు నిర్వహించడానికి కనీసం ఇంటర్నెట్‌ సౌకర ్యం కూడా లేక.. మొబైల్‌లో నెట్‌తో విధులు నిర్వహిస్తున్నారు. ఫర్నీచర్‌ సౌకర్యం లేక.. కడప నుంచి సిబ్బందే సొంత ఖర్చుతో తెచ్చి ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కలెక్టరేట్‌ వెనుకనే.. జిల్లా ఖజానా కార్యాలయం, పౌర సంబంధాల శాఖ, అగ్నిమాపక శాఖ, ముఖ్య ప్రణాళికా శాఖ, జిల్లా సర్వే, భూమి రికార్డులు, పన్నుల రాబడి శాఖ ఇలా పలు శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా తాగునీటి సౌకర్యం లేదు. మహిళా సిబ్బంది మరుగుదొడ్లక వెళ్ళాలన్నా అవకాశం లేదు. మరుగుదొడ్ల గదులకు తలుపులన్నీ పగిలిపోయి ఉన్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే మహిళా సిబ్బంది కలెక్టరేట్‌లో ఉన్న మరుగుదొడ్లను వినియోగించుకోవాల్సి వస్తోంది. అన్ని గదుల ముందు చెత్త కనిపిస్తోంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది కొందరు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా పని చేయాల్సిందే.. అయితే కనీస సౌకర్యాలు లేకుంటే. ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా దాదాపు అన్ని శాఖల్లోనూ సిబ్బంది సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ప్రజల సమస్యలపై పర్యటనలు చేస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు ఒకసారి తమ కార్యాలయాలను పరిశీలించాలని సిబ్బంది కోరుతున్నారు.  ఒకవైపు కీలక శాఖల అధికారులు లేక..మరోవైపు సిబ్బందికి కనీస సౌకర్యాలు లేక.. మరోవైపు పరిపాలన సాగడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అటువైపు దృష్టి సారించకపోతే.. పరిపాలన గాడి  తప్పే ప్రమాదం ఉంది.



Read more