Abn logo
May 2 2020 @ 00:09AM

ఒంటరిని ఎలా అవుతాను?

Kaakateeya

వారిద్దరిదీ పాతికేళ్ల ప్రేమబంధం... జీవితనౌక సాఫీగా సాగుతున్న సమయంలో సహచరుడు అకస్మాత్తుగా దూరమైతే ఆమె గుండె తట్టుకోగలదా? కలిసి నిర్మించుకున్న ఎన్నో కలలు... ఊసులాడుకున్న ఎన్నో జ్ఞాపకాలు... పదే పదే గుర్తుకొస్తుండగా ‘‘ మాది వివాహబంధం కాదు, అదొక అన్యోన్య సంగమం. ప్రస్తుతం నేను, పిల్లలిద్దరితో కలిసి పడవలో ఒంటరి ప్రయాణం చేస్తున్నాను’’ అంటూ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సహచరి సుతపా సిక్దర్‌ తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఆమె అంతరంగాన్ని, ఆత్మస్థయిర్యాన్ని ఆవిష్కరిస్తోంది.  


న్యూఢిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ (ఎన్‌ఎస్‌డీ)లో ఇర్ఫాన్‌ఖాన్‌, సుతపా సిక్దర్‌ తొలిసారి కలుసుకున్నారు. అక్కడ వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరి శ్వాస సినిమా అయినప్పుడు చర్చలు తలెత్తడం సహజం. ఆ క్రమంలో అభిప్రాయాలతో పాటు మనసులూ కలిశాయి. ఫిబ్రవరి 23, 1995లో వాళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. 25 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అంతిమంగా ఇర్ఫాన్‌ నటుడిగా నిలదొక్కుకుంటే, సుతపా ఫిల్మ్‌ డైలాగ్‌ రైటర్‌గా స్థిరపడ్డారు. ‘ఖామోషీ’, ‘శబ్ద్‌’, ‘కహానీ’ లాంటి సినిమాలకు డైలాగ్‌లు రాసిన ఆమె, సినీ నిర్మాతగా మారారు. ఆవిడ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ‘మదారి’, ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌ సింగిల్‌’... రెండు సినిమాల్లోనూ ఇర్ఫాన్‌ కథానాయకుడిగా నటించడం విశేషం. 


కేన్సర్‌తో కలిసి పోరాటం!

2018లో ఇర్ఫాన్‌కు న్యూరోఎండోక్రైన్‌ ట్యూమర్‌ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో ఆ దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెరుగైన వైద్యం కోసం ఇర్ఫాన్‌ కుటుంబం వెంటనే లండన్‌ వెళ్లిపోయింది. ఆ సమయంలో ఇర్ఫాన్‌ గురించి సుతపా ఓ వ్యాఖ్యను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. వారి మధ్య అనుబంధానికి అద్దం పట్టే ఆ పోస్ట్‌లో సుతపా.... ‘‘నా ప్రియ స్నేహితుడు, జీవిత భాగస్వామి ఓ గొప్ప యోధుడు. తనకు ఎదురైన ప్రతి అవరోధాన్నీ  అధిగమించడానికి ఆయన ఎంతో యుక్తితో పోరాడుతున్నారు. ఆయనతో పాటు నన్నూ ఓ యోధురాలిగా మార్చినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉంటాను. ప్రస్తుతం నా ముందున్న యుద్ధక్షేత్రంలో జయించడానికి బోలెడన్ని సవాళ్లు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. వాటిని మేమిద్దరం కలిసి జయించగలమనే నమ్మకం నాకుంది.’’ ఇలా సుతపా ఇర్ఫాన్‌తో తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు బోలెడు. ఇర్ఫాన్‌ కూడా పలు ఇంటర్వ్యూలలో భార్య గురించి ప్రస్తావించిన సందర్భాలూ ఉన్నాయి.


రసగుల్లాతో గుండె గుల్ల!

కేన్సర్‌ కాటేసినా, సుతపా వల్లనే తానింకా జీవించి ఉన్నానని ఇర్ఫాన్‌ మరణానికి ముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను కేన్సర్‌ మీద పోరాడే యోధుడినైతే, తనను యోధుడిగా మార్చింది తన భార్యేనని అన్నారాయన. ఓ ఇంటర్య్యూలో... ‘‘నేనివాళ ఇలా బతికి ఉన్నానంటే ఆ క్రెడిట్‌ ఆమెదే! నేను ఆమె కోసమే బతికి తీరాలి. మాది జైపూర్‌. బెంగాలీ అయిన సుతపా నాకు రసగుల్లాలు పరిచయం చేసింది. తెల్లగా, మెత్తగా రసం ఊరే రసగుల్లాలతోనే నా నోరు తీపి చేసేది తను ప్రతి శుభసందర్భంలో! మొహం మొత్తి తినకపోతే, ‘పాలు విరిచి తీసిన చెనాతో తయారైన తీపి వంటకం ఇది. పాలు మరిగించి చేసిన పాలకోవా లాంటిది కాదు కాబట్టి, ఆరోగ్యానికి మంచిది. తినండి’ అంటూ బలవంతం చేస్తుంది.’’ అంటూ ఇర్ఫాన్‌ సుతపాకు తనకూ మధ్య ఉన్న అనుబంధాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. 


లోటు కాదు, భర్తీ!

భర్తతో తనకున్న అనుబంధాన్ని ఫేస్‌బుక్‌ పోస్టుల ద్వారా షేర్‌ చేసుకునే సుతపా, ఇర్ఫాన్‌ మరణం తర్వాత సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారిలా... 

‘‘మిలియన్ల కొద్దీ అభిమానులు మాతో పాటు రోదిస్తుంటే నేను ఒంటిరిని ఎలా అవుతాను? ఆయన మరణం తీరని లోటుగా కాకుండా, ఆయన నేర్పిన విషయాల భర్తీగా భావించాలని అందరినీ కోరుకుంటున్నా. ఆ విషయాలను ఆచరణలో పెట్టవలసిన సమయం ఇదే! ఈ సందర్భంగా ఇర్ఫాన్‌కు సంబంధించిన విషయాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘‘ఇదంతా ఓ అద్భుతం’’! ఆయన ఎప్పుడూ ఒకే వాస్తవానికి కట్టుబడి ఉండలేదు. ఆయన మీద నాకున్న పగ అంతా, ఆయన నన్ను తన పర్‌ఫెక్షన్‌తో పాడుచేశారనే! ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే ఆయన తత్వం, నన్ను కూడా ఏ విషయంలోనూ రాజీ పడనివ్వకుండా చేసింది. ఆయన ప్రతి దాన్లో లయను కనిపెడుతూ ఉంటారు. అదే తత్వం నాకూ అలవడింది. ఎంత కష్టం వచ్చినా, ఎంతటి ఆనందం కలిగినా సందర్భాలతో పని లేకుండా ఆయన నేర్పిన లయతో నాట్యం చేయడం నాకు అలవాటైంది. మా జీవితాలు సినిమాలకు తక్కువేమీ కావు. స్వాగతించని అతిథులు ఎందరో వచ్చారు. వైద్యుల రిపోర్టులు సినిమా స్ర్కిప్టులయ్యాయి. దాంతో ఆయన ప్రతిభ దెబ్బతినకుండా ఉండడం కోసం, ఆయన నన్ను కోరిన ప్రతిసారీ పర్‌ఫెక్షన్‌ కోసం పాటు పడ్డాను. 


ఈ ప్రయాణంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తుల్ని కలుసుకున్నాం. వైద్యులతో కలిసి రెండున్నరేళ్లు ప్రయాణించాం. ఈ ప్రయాణం ఎంత వేదనతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో, బాధతో సాగిందో చెప్పలేను. మా ఇద్దరిదీ 35 ఏళ్ల అన్యోన్య ప్రయాణం. మాది వివాహబంధం కాదు, అదొక అన్యోన్య సంగమం. ప్రస్తుతం నేను, పిల్లలిద్దరితో కలిసి పడవలో ఒంటరి ప్రయాణం చేస్తున్నాను. పిల్లలు (బాబిల్‌, అయాన్‌) తెడ్డు వేస్తున్నారు. మా పడవనూ, ప్రయాణాన్నీ ఇర్ఫాన్‌ ‘‘అటు కాదు, ఇటు తిప్పండి’’ అంటూ నిర్దేశిస్తున్నారు. జీవితం సినిమా కాదు కాబట్టి రీటేక్‌లు ఉండవు. కాబట్టి ఆయన దిశానిర్దేశంలో తుపానులకు ఎదురొడ్డి, పడవను పిల్లలు క్షేమంగా గమ్యానికి చేర్చాలని కోరుకుంటున్నాను.’’


Advertisement
Advertisement