వయసు 29 ఏళ్లు. బరువు డెబ్బై కేజీలు. తగ్గాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-03-04T18:03:56+05:30 IST

పీసీఓడీ సమస్య ఉన్న ఆడవారిలో అండాశయాలు ఆండ్రోజెన్స్‌ అనే హార్మోనులను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, రక్తం అధికంగా పోవడం, అవాంఛిత రోమాలు రావడం, జుట్టురాలడం లాంటి లక్షణాలు కనబడతాయి

వయసు 29 ఏళ్లు. బరువు డెబ్బై కేజీలు. తగ్గాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(04-03-2022)

ప్రశ్న: నాకు ఇరవై తొమ్మిదేళ్లు. బరువు డెబ్బై కేజీలు. పీసీఓడీ  సమస్య ఉంది. అది తగ్గాలంటే బరువు తగ్గాలన్నారు. బరువు తగ్గేందుకు ఏ డైట్‌ తీసుకోవాలి?


- మునికుమారి, చిత్తూరు


డాక్టర్ సమాధానం: పీసీఓడీ సమస్య ఉన్న ఆడవారిలో అండాశయాలు ఆండ్రోజెన్స్‌ అనే హార్మోనులను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, రక్తం అధికంగా పోవడం, అవాంఛిత రోమాలు రావడం, జుట్టురాలడం లాంటి లక్షణాలు కనబడతాయి. కొంత మందిలో అండాశయాల్లో నీటితిత్తులు (సిస్ట్స్‌) కూడా ఏర్పడతాయి. ఈ సమస్య వల్ల గర్భధారణ కష్టమవుతుంది, వంధత్వం (ఇన్ఫెర్టిలిటి) వచ్చే అవకాశం ఉంది. పీసీఓడీ ఉన్నవారు సాధారణంగా అధికబరువు సమస్యతో బాధపడు తుంటారు. అలాటంప్పుడు ఆహారం, వ్యాయామం విషయాల్లో జాగ్రత్తలతో బరువు తగ్గినప్పుడు పీసీఓడీ లక్షణాలు కొంత అదుపులోకి వస్తాయి. ఆహారంలో ముఖ్యంగా రక్తంలో గ్లూకోజును సక్రమంగా నియంత్రించగలిగే పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. అంటే, పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు కూడా ముఖ్యం. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే తృణధాన్యాలు,  పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవి అధిక మోతాదులో తీసుకోవాలి. తినే ఆహారంలో కనీసం అరవై శాతం కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. పండ్లు మితంగా తీసుకోవచ్చు. చక్కెర, బెల్లం, తేనె, తెల్లబియ్యం, మైదా, ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌  పూర్తిగా మానెయ్యాలి. వ్యాయామాలు చేసే వీలు లేకపోతే రోజూ కనీసం గంట సేపు, ఐదు కిలోమీటర్లు నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-03-04T18:03:56+05:30 IST