చదువులు ఎలా?

ABN , First Publish Date - 2022-07-26T04:30:02+05:30 IST

విద్యార్థులకు పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. పుస్తకం లేకుంటే విద్య సాధ్యపడదు. తరగతి గదిలో బోధించిన పాఠాలను ఇంటివద్ద మరోసారి చదువుకునేందుకు కచ్చితంగా పుస్తకం అవసరమే. కానీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మాత్రం పుస్తకాల్లేకుండానే బోధన సాగిపోతోంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వ జూనియ

చదువులు ఎలా?

అందని ఇంటర్మీడియట్‌ పుస్తకాలు 

47,547 మంది విద్యార్థుల నిరీక్షణ

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

విద్యార్థులకు పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. పుస్తకం లేకుంటే విద్య సాధ్యపడదు. తరగతి గదిలో బోధించిన పాఠాలను ఇంటివద్ద మరోసారి చదువుకునేందుకు కచ్చితంగా పుస్తకం అవసరమే. కానీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మాత్రం పుస్తకాల్లేకుండానే బోధన సాగిపోతోంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ, ఇప్పటివరకు వారికి పుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 217 కళాశాలలు ఉండేవి. ప్రస్తుతం జిల్లాలో 156 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతుండగా.. ఇప్పటివరకు 18వేల మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. 29,547 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయకపోతే చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు ఎప్పుడు వస్తాయో.. ఉన్నతాధికారులకు సైతం సమాచారం లేకపోవడంతో అయోమయం చెందుతున్నారు. 

పాత పుస్తకాలే గతి

కొన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు పాత పుస్తకాలను విద్యార్థుల నుంచి సేకరించి కొంతమంది విద్యార్థులకు అందజేస్తున్నారు.  ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీకి సంబంధించి పాఠ్యపుస్తకాలు లేవు. ఆర్ట్స్‌ గ్రూపులకు సంబంధించి అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సంబంధిత కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటికి డిమాండ్‌ పెద్దగా కనిపించడంలేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో పేదలు, గ్రామీణులే ఎక్కువ. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందిస్తేనే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పుస్తకాలు అందించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ముద్రణ సమస్య 

ఈ నెల 1 నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభించాం. ప్రస్తుతానికి పుస్తకాలు రాలేదు. ప్రింటింగ్‌లో సమస్య ఉందని తెలిసింది. ప్రస్తుతం పాత విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకుని.. కొత్తవారికి ఇస్తున్నాం. ప్రతిఏడాది 30వేల మంది విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కావాలని ప్రతిపాదనలు పెడుతుంటాం. ఈ దఫా మాత్రం పుస్తకాల పంపిణీలో ఆలస్యమైంది. 

- తవిటినాయుడు, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి, ఇంటర్‌ మీడియట్‌ విద్యామండలి. 



Updated Date - 2022-07-26T04:30:02+05:30 IST