కొవిడ్‌ ముప్పులేని పాఠశాలలు ఎలా?

ABN , First Publish Date - 2020-05-29T05:52:55+05:30 IST

కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ఎంతో విషమ పరిస్థితులను సృష్టించింది. అన్ని విద్యా సంస్థలు అకస్మాత్తుగా మూసివేయడం అనివార్యమైంది. అయితే కొవిడ్ తర్వాత పాఠశాలలు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు...

కొవిడ్‌ ముప్పులేని పాఠశాలలు ఎలా?

ప్రతి పాఠశాల కొవిడ్ రహిత పాఠశాలగా పునర్నిర్మాణమవ్వాలి. ఇందుకు నాణ్యమైన విద్యతోపాటు బాలల ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది.


కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ఎంతో విషమ పరిస్థితులను సృష్టించింది. అన్ని విద్యా సంస్థలు అకస్మాత్తుగా మూసివేయడం అనివార్యమైంది. అయితే కొవిడ్ తర్వాత పాఠశాలలు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఒక ప్రత్యేక వ్యూహం అవసరం. సాధారణ పరిస్థితులతో పోలిస్తే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మునుపటిలా కాకుండా కొవిడ్ రహిత సంస్థలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలను ‘సేవ్ ద చిల్డ్రన్‌’ సంస్థ పొందుపరచింది. అవి: కొవిడ్ రహిత పాఠశాల యాజమాన్యం; పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత; కరికులమ్; అభ్యసనను పెంపొందించడం; పౌష్టికాహారం; వ్యాయామం, క్రీడలు, బాలల రక్షణ. 


ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలు ఉమ్మడిగా ప్రతి పాఠశాలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని పాఠశాలను నిర్వహించుకోవాలి. అందుకు ప్రధానంగా ఈ క్రింద వివరించిన విషయాలను సూక్ష్మదృష్టితో పరిశీలించాలి. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం, తరచు చేతులు పరిశుభ్రం చేసుకోవడం వంటి విషయాలు శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అవలంబించడానికి అనేక అవరోధాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు: పిల్లల నమోదు ప్రకారం తగిన తరగతి గదులు లేకపోవడం; పారిశుద్ధ్య సదుపాయం కొరత; తగినంత త్రాగునీటి సదుపాయం లేకపోవడం; చేతుల శుభ్రతకు సరిపడేటందుకు కావలసిన సబ్బు, శానిటైజర్ వంటి సామాగ్రి కొనుగోలుకు నిధుల కొరత; చిన్న చిన్న తరగతి గదులలో ఎక్కువ మంది పిల్లలు కూర్చోవడం; తల్లిదండ్రులకు, పిల్లలకు పరిశుభ్రతపై అవగాహనలోపం; బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు లేకపోవడం. ఈ పరిస్థితుల్లో ప్రతి పాఠశాల కొవిడ్ రహిత పాఠశాలగా పునర్నిర్మాణం కావాలంటే నాణ్యమైన విద్యతోపాటు పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం ఒక ప్రామాణికంగా చేర్చబడాలి. ఇవి సాధించడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాల్ని పాఠశాలలు, ప్రభుత్వం అమలుచేయాలి. వాటిని వివరంగా చూద్దాం.


విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ ఆదేశానుసారాలను తూ.చ. తప్పక పాటించాలి. అన్ని పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను తరగతులు ప్రారంభించే ముందు 100% రసాయన ప్రక్రియల ద్వారా శుద్ధిచేయాలి. ఈ విద్యాకేంద్రాలకు సరిపడినంత శానిటైజేషన్ ఆరోగ్య సామాగ్రి అనగా సబ్బులు, మాస్కులు, శానిటైజర్లు సరిపడిన మోతాదులో సమకూర్చాలి. పాఠశాల నిర్వహణకు పనిగంటలు, విద్యాప్రణాళిక వంటి వాటిని పాఠశాలలే ఏర్పరచుకోవడానికి స్వయంప్రతిపత్తిని కల్పించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను బట్టి షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం ఆరోగ్యకరం. భౌతిక దూరం పాటించాల్సిన నియమం దృష్ట్యా రెండు మూడు తరగతులను జోడించి ఒక షిఫ్టుగా ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి, పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్లను పాఠశాల స్థాయిలోగాని, క్లస్టర్ స్థాయిలోగాని ఏర్పాటుచేసి సుశిక్షితులైన కౌన్సిలర్లను నియమించాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కొవిడ్ పరీక్షలను నిర్వహించాలి. అస్వస్థతతో ఉన్న విద్యార్థులను ఆరోగ్య పరీక్షలకు పంపించాలి. ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తిని గాక, పాఠశాలలో ఉన్న వసతులు–విద్యార్థుల నిష్పత్తినే పరిగణనలోకి తీసుకోవాలి. 


ఆరోగ్య పరిశుభ్రత విషయంలో పాటించాల్సిన నియమాలను డిస్‌ప్లే బోర్డు ద్వారా ప్రకటించాలి. పిల్లలు కనీసం 20 సెకన్లు చేతులు శుభ్రపరచేలా సూచించాలి, పర్యవేక్షించాలి. పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలి. తగినంత నీటివసతి కల్పించాలి, సరిపడినన్ని వాష్ ఫ్లాట్‌ఫామ్స్ నిర్మించాలి. పాఠశాల ప్రాంగణంలో చెత్తనువేసే చెత్తకుండీలను ఏర్పరచాలి. పాఠశాల స్థాయి వాష్ కమిటీలను ఏర్పాటుచేయాలి. శానిటరీ నాప్‌కిన్‌లు పారవేయడానికి ప్రత్యేక కుండీలను ఏర్పరచాలి.


లాక్‌డౌన్ దృష్ట్యా నిలిచిపోయిన పాఠ్యాంశాలు, హోమ్‌వర్క్‌లను దృష్టిలో ఉంచుకొని పిల్లలను ఒత్తిడికి గురిచేయరాదు. పాఠ్యాంశాల కన్నా పిల్లలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి అదనపు అభ్యసనాకృత్యాలను ఏర్పరచాలి. సిలబస్‌ను కుదించి తక్కువ పని గంటలతో పిల్లలలో మానసిక ఉత్సాహాన్ని పెంపొందించాలి. 60% పాఠ్యబోధనలు 40% అదనపు బోధనాభ్యసన కృత్యాలను ఏర్పరచాలి. ప్రతి సబ్జెక్టుకు వర్క్ షీట్లను ఏర్పరచి, విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నించాలి. పిల్లలతో, తల్లిదండ్రులతో తరచు చర్చలు చేయాలి. పిల్లల భవిష్యత్తుపట్ల తల్లిదండ్రులకున్న భయాందోళనలను కౌన్సిలింగ్ ద్వారా తొలగించాలి. సిసిఇ ద్వారా జరిగే పరీక్షా విధానాలను బలపరచాలి. ఫ్లెక్సిబిల్‌ పరీక్షా విధానాన్ని అమలుపరచాలి. పిల్లలను వారికై వారు చదవడం, రాయడం, చిత్రాలను గీయడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. ఐసిటి ద్వారా కూడా పాఠ్యాంశాలను బోధించడానికి క్లస్టర్‌ లెవెల్‌/ స్కూల్‌ లెవెల్‌ లో శాటిలైట్ ఐసిటి సెంటర్లను ఏర్పరచి దూరవిద్యను కూడా అందించాలి.


పాఠశాలల్లో మధ్యాహ్నభోజన వసతి ఉన్నది కనుక ఈ సమయంలో పాఠశాల ప్రాంగణంలో మధ్యాహ్నభోజనం నిర్వహించడంకన్నా కొన్ని నెలలపాటు పిల్లలకు డ్రై–రేషన్ సమకూర్చడం మంచిది (పొడి బియ్యం, కూరగాయలు, గుడ్లు). పాఠశాల సమయంలో విటమిన్ బిస్కెట్‌లను (ప్యాకెట్స్ రూపంలో) ఇస్తే మంచిది. వ్యక్తిగత వ్యాయామానికి సంబంధించిన క్రీడలను నిర్వహించాలి. అనగా యోగా, ధ్యానం వంటివి. వ్యక్తిగత క్రీడలను ప్రోత్సహించేందుకు కావాల్సిన క్రీడా సామాగ్రిని ఏర్పరచాలి.


బాలలలో ఏవైనా శారీరక, మానసికపరమైన ఇబ్బందులు ఉన్నయెడల గుర్తించి పరిష్కరించాలి. పిల్లల కుటుంబాలలో ఏదైనా కలహాలు సంభవించిన యెడల వాటి ప్రభావం పిల్లలపై పడకుండా జాగ్రత్త వహించాలి. పై విషయాలను వివిధ విద్యావేత్తల, విశ్లేషకుల అనుభవాల సారం ఆధారంగా పొందుపరచడం జరిగింది. పై విషయాలను ప్రతి పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాలు తూ.చ. తప్పకుండా పాటించడానికి ప్రభుత్వం తగిన నిధులను, సదుపాయాలను సమకూర్చాలి. ఇప్పుడున్న కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పరిమితిని పెంచాలి. ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఫీజులు రూపంలో వసూలు చేసిన రుసుమును ఎక్కువశాతం బాలల సంక్షేమానికి వినియోగించాలి.

మల్లాడి శ్రీనగేష్ 

ఎడ్యుకేషన్ లీడ్ -సౌత్ ఇండియా, సేవ్ ద చిల్డ్రన్

Updated Date - 2020-05-29T05:52:55+05:30 IST