రుచికరమైన భోజనం ఎలా...?

ABN , First Publish Date - 2022-08-13T04:20:28+05:30 IST

రాష్ట్రంలోని పలు హాస్టళ్ళలో ఇటీవల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నాణ్యతపై డీఈవోలను నివేదిక కోరింది. రుచి, శుచి, శుభ్రతపై పూర్తి సమాచారం సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీస్తున్న ప్రభుత్వం అందుకు సరిపడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు.

రుచికరమైన భోజనం ఎలా...?

 మధ్యాహ్న భోజన పథకానికి నిధుల లేమి

 ఆరు నెలలుగా కార్మికులకు అందని వేతనాలు  

 అరకొర చెల్లింపులతో ఏజెన్సీల అవస్థలు  

 మెనూ అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఆదేశాలు  

 ప్రభుత్వ మార్గదర్శకాలపై హెచ్‌ఎంల అసహనం 

మంచిర్యాల, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు హాస్టళ్ళలో ఇటీవల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నాణ్యతపై డీఈవోలను నివేదిక కోరింది. రుచి, శుచి, శుభ్రతపై  పూర్తి సమాచారం సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్న భోజనం  నాణ్యతపై ఆరా తీస్తున్న ప్రభుత్వం అందుకు సరిపడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ధరలు పెంచాల్సింది పోయి తనిఖీలకు ఆదేశించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

మెనూ అమలు అసాధ్యం....?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డుతోపాటు నాణ్యమైన భోజనం ఇచ్చేలా మెనూ రూపొం దించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలంటే కష్టతరం గా ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. ఒక గుడ్డు ధర ప్రస్తుతం మా ర్కెట్‌లో రూ.5 ఉండగా ప్రభుత్వం రూ.4 చెల్లిస్తోంది. బియ్యం మినహా ఇతర సామగ్రి ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చాల్సి ఉన్నందున ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు సరిపోవడం లేదు. అరకొర బిల్లులతో అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథ మిక, ఉన్నత పాఠశాలలు 714 ఉన్నాయి. వీటిలో 43,249 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి రోజు భోజన పథకం అమలు చేయాల్సి ఉంది. 

అరకొర చెల్లింపులతో అవస్థలు 

మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు ప్రభుత్వం అరకొర నిధులు చెల్లిస్తుండడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఒకొక్కరికి రూ.4.95, హైస్కూల్‌ విద్యా ర్థులకు రూ.7.45 చెల్లిస్తోంది. ప్రైమరీ పాఠశాలలో పది మంది విద్యార్థు లకు ఒక రోజు రూ.49.50 చెల్లిస్తుండగా ఖర్చు రూ.65 దాటుతోందని చెబుతున్నారు. పది మంది విద్యార్థులు ఉన్న చోట కనీసం రూ.65 ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి వంద గ్రాముల చొప్పున బియ్యం మినహా మిగతా సరుకులన్ని నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అన్నం వండేందుకు గ్యాస్‌ను ప్రభుత్వం సమకూరుస్తుండగా కూరలు వండేందుకు అయ్యే ఖర్చు నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సరుకులను ఉద్దెరకు తీసుకువచ్చి నెట్టుకు వస్తున్నారు. ఇలా ప్రతీ పది మంది విద్యార్థులకు రూ.15 అదనంగా చెల్లించాల్సి వస్తోందని, నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నం టుతున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు.

హెచ్‌ఎంల పెదవివిరుపు 

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై ప్రధానోపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. మధ్యాహ్న భోజనం రోజు ఎంత మంది తిన్నారనే వివ రాలను అధికారులకు పంపాలనే దానిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో బోధన పర్యవేక్షణ కుంటుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజు  మెనూ వివరాలను పాఠశాల గోడలపై రాయాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో  వివరాలు సరిగా లేకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటారు.  పాఠశాల విద్యా కమిటీ విద్యార్థులతో కూడిన కమిటీల సమక్షంలో బియ్యం తూకం వేసి నిర్వాహ కులకు ఇవ్వాలని నిబంధనలు విధించారు. వంట పాత్రలు శుభ్రంగా లేకపోయినా, విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు అపరిశుభ్రంగా ఉన్నా  దానికి  హెచ్‌ఎంను బాధ్యున్ని చేస్తూ మార్గదర్శ కాలు జారీ చేశారు. దీని వల్ల తనిఖీ అధికారులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆరు నెలలుగా అందని వేతనాలు 

మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా ప్రభుత్వం వేతనాలు విడుదల చేయలేదు. ప్రైమరీ, హైస్కూల్‌లలో పని చేస్తున్న కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున వేతనం ఇస్తోంది. మార్చి 15న మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.2 వేలు వేతనం చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఐదు నెలలు గడుస్తున్నా పెంచుతామన్న వేతనాల ఊసెత్తడం లేదు. పెండింగ్‌ వేతనాలతోపాటు సీఎం హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.2 వేలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.  

రేట్లు పెంచాలి....

దాసరి రాజేశ్వరి, మిడ్‌డే మీల్స్‌ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు

ప్రభుత్వం రుచి, శుచి కోరుతున్న విధంగానే మధ్యాహ్న భోజనం వండి వార్చేందుకు సరిపడా బిల్లులను మంజూరు చేయాలి. పెరిగిన  సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. బిల్లులు చెల్లించనిదే దుకాణాలలో సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా గుడ్లను మంజూరు చేయాలి. అలాగే ప్రతి నెల 10వ తేదీ లోపు బిల్లులు చెల్లించాలి. నిర్వాహకులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.   


Updated Date - 2022-08-13T04:20:28+05:30 IST