ఇదేం పురోగతి!

ABN , First Publish Date - 2021-09-17T05:53:10+05:30 IST

ఇళ్ల నిర్మాణంలో జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలబెడతామని గృహనిర్మాణ శాఖ మంత్రి... జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పలుమార్లు వాగ్దానం చేశారు.

ఇదేం పురోగతి!

ముందుకు సాగని జగనన్న కాలనీలు

బేస్‌మట్టాల కంటే దిగువునే పేదల ఇళ్లు

75శాతం ఇళ్ల నిర్మాణం బేస్‌మట్టం కంటే దిగువన..

మొక్కుబడి పర్యటనలకే పరిమితమౌతున్న ఇన్‌చార్జ్‌ మంత్రి

 

జిల్లాలో పేదలందరికీ జగనన్న ఇళ్ల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి.. అన్నచందంగా ఉంది. 84,018 ఇళ్లకు గ్రౌండింగ్‌ పూర్తి చేయగా అందులో 78,860 బేస్‌మట్టాల కంటే దిగువన ఉన్నాయి. అంటే దాదాపు 75శాతం ఇళ్ల నిర్మాణాలు పునాది దాటలేదు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇళ్లు నిర్మించుకొనేలా చైతన్యపరచకుండా వలంటీర్లు, సెక్రటరీలతో ఇంటిపట్టా వెనక్కు తీసుకుంటామనే బెదిరింపులు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  


గుంటూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణంలో జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలబెడతామని గృహనిర్మాణ శాఖ మంత్రి... జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పలుమార్లు వాగ్దానం చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.1.50 లక్షలు మాత్రమే... అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం రూ.నాలుగైదు లక్షల విలువ చేసే స్థలాన్ని ఇచ్చిందని ఘనంగా పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు పురోగతి చూస్తే రాష్ట్రంలోనే చివరిస్థానాల్లో జిల్లా కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రత్యేకించి జాయింట్‌ కలెక్టర్‌ని కూడా పోస్టింగ్‌ చేశారు. అయినాసరే పురోగతి కనిపించడం లేదు. 75 శాతం పైగా ఇళ్లు ఇంకా బేస్‌మట్టాల కంటే దిగువున ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది. 

 

ముగ్గుపోసి వదిలేశారు... 

బేస్‌మట్టాల కంటే దిగువున అంటే కేవలం శంకుస్థాపన, ముగ్గుపోసి చాలామంది వదిలేశారు. ఈ పథకం ప్రారంభం కావడాని కంటే ముందు తామే ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకొంటే తాము సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పింది. ఈ మాటతోనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పైగా గుంటూరు నగరంలోని లబ్ధిదారులకు ఎక్కడో 12 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పేరేచర్ల, లాం ప్రాంతాల్లో లేఅవుట్లు వేశారు. అక్కడికి వెళ్లి ఇళ్లు నిర్మించుకోవడం అసాధ్యంగా లబ్ధిదారులు భావిస్తున్నారు.


పూరి స్థాయి అధికారి లేరు..

 కాగా గృహనిర్మాణ శాఖకి పూర్తిస్థాయి అధికారి లేరు. గతంలో ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వేరే జిల్లాకు సాగనంపారు. ఇప్పుడు తెనాలి ఈఈ బసవయ్యకి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు కేటాయించారు. లబ్ధిదారులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఇళ్లు నిర్మించుకొనేలా చైతన్యపరచకుండా వలంటీర్లు, సెక్రటరీలు మీకు అవి నిలిపేస్తాం. ఇవి నిలిపేస్తాం, ఇచ్చిన ఇంటి పట్టా వెనక్కు తీసుకొంటామన్న హెచ్చరికలు చేస్తోండటంతో పురోగతిలో ఏమార్పు రావడం లేదు. పైగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

  

90 రోజుల్లో ఇల్లు నిర్మించుకోకపోతే స్థలాల రద్దు

 జేసీ (హౌసింగ్‌) అనుపమాంజలి

ప్రభుత్వం నుంచి గృహనిర్మాణానికి అనుమతి పొందిన లబ్ధిదారులు 90 రోజుల్లో ఇల్లు నిర్మించుకోకపోతే నివేశన స్థలం రద్దు చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌) అనుపమాంజలి అన్నారు. చిలకలూరిపేట మునిసిపాలిటీ పరిధిలో పసుమర్రు లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న గృహాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైనవారికి బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పసుమర్రు గ్రామంలోని సచివాలయాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర, తహసీల్దార్‌ జి.సుజాత తదితర అధికారులు పాల్గొన్నారు.

 

ఫేజ్‌-1లో ఇళ్ల నిర్మాణం లక్ష్యం ఇలా...

మొత్తం మంజూరు చేసిన ఇళ్లు 1,19,126

రిజిస్ట్రేషన్లు పూర్తి అయిన వాటి సంఖ్య 1,14,149

గ్రౌండింగ్‌ అయిన ఇళ్ల సంఖ్య 84,018

ఇందులో బేస్‌మట్టాల కంటే దిగువున ఉన్నవి 78,860

బేస్‌మట్టం స్థాయిలో ఉన్న నిర్మాణాలు   3,770

శ్లాబు దశలో ఉన్నవి    711

శ్లాబు పూర్తయిన వాటి సంఖ్య    677

Updated Date - 2021-09-17T05:53:10+05:30 IST