ఆ భూమి కథేంటి?

ABN , First Publish Date - 2020-12-03T06:44:05+05:30 IST

జక్కులనెక్కలం భూ బాగోతంపై రెవెన్యూ యంత్రాంగం విచారణ ప్రారంభించింది.

ఆ భూమి కథేంటి?
రైతులను విచారిస్తున్న గన్నవరం తహసీల్దారు నరసింహారావు

జక్కులనెక్కలం భూ బాగోతంపై గన్నవరంలో విచారణ! 

వీఆర్వో సహా రైతులను కార్యాలయానికి పిలిపించిన తహసీల్దారు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జక్కులనెక్కలం భూ బాగోతంపై రెవెన్యూ యంత్రాంగం విచారణ ప్రారంభించింది. జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఆదేశాల మేరకు గన్నవరం తహసీల్దారు నరసింహారావు బుధవారం విచారణ ప్రారంభించారు. జక్కులనెక్కలం గ్రామంలోని సర్వే నెంబర్‌ 32, 33ల్లో గతంలో సాగు పట్టాలను పొందిన రైతులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోను గన్నవరంలోని తన కార్యాలయానికి పిలిపించారు. 

పరిహారంపై అభ్యంతరాలున్నాయా? ఇందుకు రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్‌ చేశారా? అని రైతులను తహసీల్దారు ప్రశ్నించినట్టు తెలిసింది. సీలింగ్‌ భూములను సాగు పట్టాలుగా తీసుకున్న వారంతా ప్రస్తుతం ఉన్నారా? చేతులు మారాయా? చేతులు మారితే తెరమీదకు వచ్చిన వారెవరు? పరిహారం ఎవరికి దక్కింది? అనే అంశాలపై విచారించినట్టు సమాచారం. వీఆర్వోపై కూడా తహసీల్దారు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. భూములు చేతులు మారి ఉంటే, వాటి వివరాలను అందచేయాలని ఆదేశించినట్టు తెలిసింది. చేతులు మారిన వారి పేరుతో రికార్డులను ట్యాంపరింగ్‌ చేయటానికి ప్రయత్నించావా? పాస్‌బుక్స్‌ జారీ చేయటంతో పాటు, అడంగల్‌లో కూడా పేర్లను మార్చారా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రాథమిక విచారణ తరువాత క్షేత్రస్థాయిలో కూడా మరింత లోతుగా విచారించాలని, దశల వారీగా అంశాల ప్రాతిపదికన విచారణ జరిపి, జేసీ మాధవీలతకు సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. 


జేసీ అంతర్గత విచారణ  

జక్కులనెక్కలంలో వెలుగుచూసిన భూ బాగోతంపై జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ప్రత్యేక దృష్టి సారించారు. ‘రెవెన్యూ చేతివాటం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆమె వెంటనే విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో కీలక పత్రాలు వెలుగులోకి రావటంతో.. బుధవారం ‘సీన్‌ రివర్స్‌’ శీర్షికన మరో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో జేసీ అంతర్గత విచారణను ప్రారంభించారు. గన్నవరం రెవెన్యూ అధికారులను విజయవాడ పిలిపించారు. జక్కులనెక్కలం భూముల రికార్డులను కూడా తెప్పించి పరిశీలించినట్టు తెలిసింది. అనంతరం స్థానికంగా విచారణ జరపాలని తహసీల్దారును ఆదేశించినట్టు తెలుస్తోంది. 


వీఆర్వోతో పాటు కథ నడిపించిన వైసీపీ నేతల్లో గుబులు  

 జక్కులనెక్కలం భూ బాగోతంపై రెవెన్యూ యంత్రాంగం విచారణకు ఆదేశించటంతో ఈ ఘటనలో ప్రత్యక్ష పాత్ర పోషించిన వీఆర్వోతోపాటు, తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపి, ఆంధ్రజ్యోతి కథనాలపై అక్కసు వెళ్లగక్కిన వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. అవినీతి వ్యవహారం రుజువైతే జేసీ క్రిమినల్‌ కేసుకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని తెలియటంతో, విచారణలో వీఆర్వో తమ పేర్లను ఎక్కడ బయట పెడతారో అని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. 

Updated Date - 2020-12-03T06:44:05+05:30 IST