కట్టుకోకుంటే.. కష్టమే

ABN , First Publish Date - 2021-09-02T05:37:23+05:30 IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు కూడా నివేశన స్థలాలు మంజూరు చేశారు.

కట్టుకోకుంటే.. కష్టమే

పేదల ఇళ్ల నిర్మాణాలపై ఒత్తిళ్లు 

పొదుపు గ్రూపు మహిళలకు బెదిరింపులు

సంక్షేమ పథకాలన్నీ కట్‌ చేస్తామని హెచ్చరిక

ధ్రువీకరణ పత్రంపై లబ్ధిదారుల చేత సంతకాలు


ఇల్లు వచ్చింది.. సొంతింటి కల తీరుతుందనుకున్నారు. ఇల్లు ఏమో కాని కష్టాలు కన్నీటిని తెప్పిస్తుంది. నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు  వారి పాలిట శాపంలా మారింది. కట్టిస్తామన్న వారు మడమ తిప్పారు. కరోనా కష్ట కాలంలో ఇల్లు గడవడమే గగనంగా ఉంది.. కట్టుకోలేమంటే.. ఠాట్‌ వీల్లేదు ఎలాగైనా కట్టుకోవాల్సిందే.. లేదంటే కష్టమే అంటూ లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పొదుపు గ్రూపు మహిళలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇల్లు కట్టుకోకుంటే సంక్షేమ పథకాలన్నీ కట్‌ అని హెచ్చరిస్తున్నారు.  తొలి విడతగా జిల్లాలో 1,22,435 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ధేశించారు. అందులో భాగంగా 91,346 మందితో శంకుస్థాపనలు చేయించారు. వీటిని వచ్చే ఏడాది జూన్‌ లోపు పూర్తి చేయాల్సి ఉన్నది. శంకుస్థాపనలు అయితే చేయించారు తప్ప 90 శాతం మందికి పైగా నిర్మాణం చేయడం లేదు. దీంతో ఎలాగైనా వారితో ఇల్లు కట్టేలా చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. 


గుంటూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు కూడా నివేశన స్థలాలు మంజూరు చేశారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం కావడంతో కుటుంబం గడవడానికే చేతిలో నగదు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలానే గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేక సతమతమౌతున్నారు. ఈ పరిస్థితుల్లో లేఅవుట్లలో ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. తొలి విడతలో వేసిన లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాకుండా అవి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రదేశాలకు దూరంగా ఉంటున్నాయి. ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నా పదేళ్ల తర్వాత కాని అక్కడికి వెళ్లి నివాసం ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. అలానే నిర్మాణం ప్రారంభించిన ఇళ్లకు కూడా బిల్లులు సక్రమంగా చెల్లింపులు జరగడం లేదు. దీంతో ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలం ఒక ఆస్తిగా పడి ఉంటుందని, కొంత అభివృద్ధి చెందాక నిర్మించుకుందామన్న ఆలోచనలో పలువురు పేదలు ఉన్నారు. అయితే అలా కుదరదు తక్షణం ఇల్లు కోవాల్సిందేనని అధికారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలావుంటే పేదలందరికీ ఇళ్ల పథకం కింద పొదుపు సంఘాలకు రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నగదుని నెలకు రూ.1 వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, నిర్ణీత సమయంలో ఇల్లు నిర్మాణం చేపట్టకపోయినా/రుణం తిరిగి సక్రమంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు గ్రూపు సభ్యులంతా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఓ ధ్రువీకరణ పత్రంపై లబ్ధిదారుల చేత సంతకం పెట్టిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ప్రధానంగా అన్ని సంక్షేమ పథకాలు నిలిపేయడాన్ని పొందుపరిచారు. ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపడతామన్న నిబంధన చేర్చడం పొదుపు సంఘాల మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది. ఈ ధ్రువీకరణ పత్రంపై గ్రామ/వార్డు సచివాలయాల సెక్రెటరీలు, వలంటీర్లు బలవంతంగా సంతకాలు పెట్టిస్తోన్నారు. దీంతో  సంతకాలు చేసేందుకు ఎక్కువమంది నిరాకరిస్తున్నారు. 


ఏమి నేరం చేశామని క్రిమినల్‌ చర్యలు?

పొదుపు ఉద్యమం 20 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అప్పట్లో సీఎంగా చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశారు. ఆ తర్వాత దానిని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. పావలా వడ్డీ, సున్నా వడ్డీ అంటూ పొదుపు గ్రూపులకు వారివారి అర్హతలను బట్టి రుణాలను ఇస్తూ రాయితీలు కల్పిస్తున్నారు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణం సకాలంలో చెల్లించకపోతే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపడతామని హెచ్చరించిన దాఖలాలు ఎన్నడూ లేవు. అలాంటిది ప్రస్తుతం తమకు స్థలం అంటగట్టి అక్కడ ఇల్లు కట్టుకోవాలని.. అందుకు రుణం ఇప్పిస్తామని చెప్పి తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యులను చేస్తూ తమ చేతనే సంతకం పెట్టించాలని చూస్తోండటంపై పొదుపు సంఘాల మహిళలు తీవ్ర ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారు.   

Updated Date - 2021-09-02T05:37:23+05:30 IST