ఇంటి నిర్మాణాలు.. నత్తనడక!

ABN , First Publish Date - 2021-08-23T05:44:39+05:30 IST

ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలు బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఇంటి నిర్మాణాలు..  నత్తనడక!
తాడికొండలో జగనన్న కాలనీలో వర్షం నీళ్లలో ఉన్న స్ధలాలు

శంకుస్థాపనలోనే నిలిచిన జగనన్న కాలనీలు

మీ ఇల్లు మీరే కట్టుకోవాలంటూ ఒత్తిడి

అట్టహాసంగా గ్రౌండింగ్‌ కార్యక్రమం

మార్కింగ్‌తో సరిపెట్టారు..

ఆ తర్వాత నిర్మాణాల పురోగతి లేదు..

కేవలం పదిశాతమే ఇంటి నిర్మాణాలు ప్రారంభం

వర్షాకాలం రాకతో ఇక్కట్లు

చెరువులను తలపిస్తున్న లేఅవుట్లు

మౌలిక వసతులూ కరువు  

పేదల ఇంటి కల సాకారం అయ్యేనా..?  

  

జిల్లాలో మొత్తం 1,474 జగనన్న కాలనీ లేఅవుట్లకు 586 కాలనీల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం లబ్ధిదారులు 2,64,969.. మొదటి పేజ్‌లో 1,22,435 ఇళ్లు నిర్మించతలపెట్టారు. అందులో 91,346 గృహాలు మొదలుపెట్టారు. 

 ప్రభుత్వం చెబుతున్న లెక్కలివి..! కానీ క్షేత్రస్థాయిలో ఇన్ని గృహ నిర్మాణాలు జరుగుతున్నాయా..? అని పరిశీలిస్తే లేదనే సమాధానం వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లతో జూలై మొదటి వారంలో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. జగనన్న ఇంటి పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ గ్రౌండింగ్‌ తీసుకోవాలని హడావుడి చేసింది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి మీ ఇల్లు మీరే కట్టుకోవాలి.. ముందుగా శంకుస్థాపన చేయండి అంటూ వెంటపడ్డారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇంటి నిర్మాణాలు మొదలు కాలేదు. లేఅవుట్లలో కనీస వసతులు లేవు.. పైగా వర్షాకాలం.. ఈ పరిస్థితుల్లో ఇంటి నిర్మాణాలు నత్తనడకనే సాగుతున్నాయి. 

ఫ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మూడు విడతలుగా ఇస్తుంది. సబ్సిడీపై ఇనుపరాడ్లు, సిమెంటు, ఇసుక అందచేస్తుంది. ఇంటి పునాదికే రూ.లక్ష పైగా అవుతుందని మొత్తం నిర్మాణానికి దాదాపు రూ.5లక్షలు తామెక్కడ తేవాలని లబ్ధిదారులు వాపోతున్నారు. 

  

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 22: ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలు బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయ భూముల్లో ఇళ్ల లేవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేవు.. చుట్టూ బురద.. వెళ్లేందుకు దారిలేదు.. మెరక తోలించినా, అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీటి వసతి.. ఇవేమీ లేకుండానే లబ్ధిదారులను ఇల్లు కట్టుకోమంటున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆప్షన్లను ఇచ్చింది. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ ఎక్కువమంది తమ అభిప్రాయాన్ని తెలిపినా.. అలా కుదరదంటూ మీరే కట్టుకోవాలని చెప్పింది. దీంతో గ్రౌండింగ్‌ పేరిట శంకుస్థాపనలు చేయించారు. వలంటీర్లు లబ్ధిదారులతో నివేశన స్థలాల వద్ద గృహాలు మొదలు పెడుతున్నట్టు జియోటాగింగ్‌ చేశారు. కొందరు బేస్‌మెంట్‌ కూడా వేసుకుని బిల్లుల కోసం చూస్తున్నారు. ఈలోగా వర్షాకాలం కూడా వచ్చింది. దీంతో అడుగు ముందుకు పడడం లేదు. మెటీరియల్‌ను కాలనీ వద్దకు చేర్చుకోవటానికి బాడుగ ఖర్చుతడిసి మోపెడవుతుందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మొత్తం మీద జిల్లాలో పదిశాతం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో పసుమర్రు పరిధిలో ఏర్పాటుచేసిన లేఅవుట్లలో మొదటి దశలో 4,565 మందికి గృహ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అయితే నిర్మాణాలు ప్రారంభించిన వారు మాత్రం 200లోపే ఉన్నారు. వారిలో కొంతమంది రూ.లక్షకు పైగా వ్యయం చేసి బేస్‌లెవల్‌ నిర్మాణం పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులు జరగకపోతుండటంతో ఆయా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కొండవీడు, సొలస, యడ్లపాడు గ్రామాల లేఅవుట్లలో ఒక్కరు కూడా ఇళ్లు నిర్మాణం ప్రారంభించలేదు.

రేపల్లె పట్టణంలోని 18వ వార్డులో 60 ఎకరాల విస్తీర్ణంలో 2,784 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. ఇందులో కేవలం 189 గృహ నిర్మాణ పనులు ప్రారంబించారు. కనీసం 10శాతం మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రాకపోవడం గమనార్హం.

నరసరావుపేట పట్టణ పేదల కోసం ఉప్పలపాడు వద్ద ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల నుంచి స్పందన కరువైంది. సుమారు ఆరువేల ప్లాట్లు ఇక్కడ వేశారు. వీటిలో ఒక్కటీ పౌండేషన్‌ స్థాయికి నిర్మాణం జరగలేదు. 10 గృహాలకు పౌండేషన్‌ కోసం పిల్లర్లు నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఆరు పిల్లర్ల నిర్మాణానికి జేసీబీ నిర్వాహకులు రూ.2,700 వసూలు చేస్తున్నారని వారు తెలిపారు.  

దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల పురపాలక సంఘాల పరిధిలో 500 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దాచేపల్లిలో  కొద్దిమంది లబ్ధిదారులు ఇళ్లనిర్మాణానికి పూనుకున్నారు. నడికుడిలో 724 ఇళ్లకు కేవలం 15 మంది మాత్రమే ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 

తాడికొండ మండలంలో 15 గ్రామాల్లో 1,360 మందికి గ్రౌండింగ్‌ పూర్తి కాగా.. కేవలం ఇరవైశాతం మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఇసుక కొరత కూడా వారిని వేధిస్తోంది. ఇల్లు నిర్మించుకోకపోతే స్థలం వెనకకు తీసుకుంటామని వలంటీర్లు, అధికారులు అంటున్నారని, అందుకే అప్పు తీసుకువచ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు లబ్ధిదారులు  బహిరంగంగానే వాపోతున్నారు.

తెనాలి అర్బన్‌ ప్రాంతంలో ఇంటి నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి.  రూరల్‌ మండలంలో కొన్నిచోట్ల బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. సంగంజాగర్లమూడి యడ్లపాడు వెళ్లే దారి వెంబడి జగనన్న కాలనీ మాగాణి భూమిని తలపిస్తోంది. కేవలం వాటర్‌  కనెక్షన్‌ ఒకటి ఇచ్చి సరిపెట్టారు. ప్రధాన రోడ్డు నుండి కాలనీకి చేరాలంటే సరైన మార్గం కూడాలేదు.  

వినుకొండ నియోజకవర్గంలో మొదటివిడతగా వినుకొండ పట్టణంలోని 3,567, వినుకొండ మండలంలో 605, నూజెండ్ల మండలంలో 1243.. మొత్తం 5,415 నివాస గృహాలను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని అధికారులతో పాటు స్థానికనేతలు లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అయితే కేవలం వలంటీర్ల ఒత్తిడి కారణంగా లబ్ధిదారులు నివాసస్థలాల వద్ద ఫొటోలు దిగారే తప్ప ఇళ్ల ప్రారంభించిన దాఖాలు లేవు. ఏనుగుపాలెంలో  105 గృహాలకు 50 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు.   

మాచర్ల పట్టణంలో మాత్రమే నిర్మాణాలు ప్రారభించారు. రెంటచింతల మండలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కారంపూడి, మాచర్ల మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 

బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీలలో నీరు నిలిచి నిర్మాణాలకు ఆటంకంగా మారింది. పొలాలలో స్థలాలిచ్చి మెరక చేయకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని ప్యాడిసన్‌పేట, బేతనీకాలనీ, మూలపాలెం రోడ్డులో మూడుచోట్ల కలిపి 3,402మందికి నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారు. అందులో 800 గృహాలకు తొలుత గ్రౌండింగ్‌ చేశారు. కానీ నిర్మాణాలు ప్రారంభించలేదు. 

సత్తెనపల్లి పట్టణవాసులకు మొత్తం 3,697 గృహాలు మంజూరుకాగా 200లోపు గృహాలు మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు 1273 గృహాలు మంజూరుకాగా 250కిపైగా గృహాలకు నిర్మాణాలు జరుగుతున్నాయి.  నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాల్లో జగనన్న కాలనీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 


బేస్‌మెట్‌ కట్టాను.. బిల్లులు రాలేదు..

ప్రభుత్వం నివేశన స్థలం ఇవ్వడంతో సంబరపడ్డాను. ఎవరి ఇల్లు వారే కట్టుకోవాలన్నారు. రూ.లక్షా ఇరవైవేలు అప్పు చేసి బేస్‌మెంట్‌ వరకు నిర్మించాను.  ప్రభుత్వం నుంచి 40 సిమెంటు బస్తాలు మాత్రం ఇచ్చారు. వర్షాలు పడుతుంటే అవి పాడవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. 

- తవ్వా సుధాకర్‌, గృహనిర్మాణ లబ్ధిదారుడు, చిలకలూరిపేట. 

Updated Date - 2021-08-23T05:44:39+05:30 IST