గూడు.. గోడుగోడు

ABN , First Publish Date - 2021-08-02T05:56:25+05:30 IST

గత ప్రభుత్వం కేంద్రం పేదల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు క్రమేపి శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టణాల్లో పేదల కోసం నిర్మించిన ఇళ్లను రెండేళ్లకుపైబడి పాడుబెట్టారు.

గూడు.. గోడుగోడు
రుద్రవరం వద్ద నిలిచిపోయిన గృహాల్లో భారీగా పెరిగిన పిచ్చి మొక్కలు

శిథిలావస్థలో టిడ్కో ఇళ్లు

రెండున్నరేళ్లుగా పాడుబెట్టారు

టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

నేటికీ పూర్తికాని మౌలిక వసతులు 

ఇంటి కోసం ఎదురు చూపుల్లో లబ్ధిదారులు   



పేదల సొంతింటి కల కలగానే మిగిలింది. ప్రతిఒక్కరికి గూడు అవకాశం కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో ఆధునిక టెక్నాలజీతో పురపాలక సంఘాల్లో టిడ్కో భవన సముదాయాలు నిర్మించింది. అయితే ప్రభుత్వం మారడంతో నాటి ప్రభుత్వం కట్టిన ఇళ్లను పాడుబెట్టారు. రూ.కోట్లు వెచ్చించి కట్టిన భవన సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని పట్టణాల్లో ఆయా ప్రాంగణాలు చిట్టడివులను తలపిస్తున్నాయి. అరకొర పనులు.. మౌలిక వసతులు కల్పిస్తే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకునే అవకాశం ఉన్నా.. రెండున్నరేళ్లుగా పాలకులు ఆ ఊసే మరిచారు. ప్రతిపక్షాల ఆందోళనలతో ఆరు నెలల క్రితం లబ్ధిదారులకు ధృవీకరణపత్రాలు అందజేసేరే కాని.. మిగిలిన పనులు పూర్తిపై దృష్టి సారించడంలేదు. దీంతో లబ్ధిదారుల తమ వాటా ధనాన్ని వడ్డీలకు తెచ్చి కట్టారు. ఆ అప్పులకు ఒకవైపు వడ్డీలు పెరిగిపోతుండగా మరోవైపు ఇంకా అద్దె ఇళ్లలోనే ఉండాల్సి వస్తుండటంతో ఆర్థిక భారంతో పేదలు సతమతమవుతున్నారు. 

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

గత ప్రభుత్వం కేంద్రం పేదల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు క్రమేపి శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టణాల్లో పేదల కోసం నిర్మించిన ఇళ్లను రెండేళ్లకుపైబడి పాడుబెట్టారు. ఇప్పటికే కొన్ని గృహాల తలుపులు, కిటికీలు పాడైపోయాయి. పూర్తయిన టిడ్కో ఇళ్లకు వసతులు కల్పించే పనులకు సంబంధించి వ్యయం అంచనాలు రూపొందించే ప్రక్రియలోనే ఇంకా అధికారులు ఉన్నారు. ఇటీవల  300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు. అయితే వాస్థవ పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లకు సంబంధించి మౌలిక వసతులు కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ పనులు పూర్తి చేసేదెప్పుడో.. లబ్ధిదారులకు గృహయోగం కలిగేది ఎప్పుడో ఎవరికీ తెలియదు. గృహాలు నిర్మాణ మధ్యలోనే ఆగిపోవటంతో నూతన ప్రభుత్వం తమకు ఇళ్ళు ఎప్పుడు ఇస్తుందోనని కొందరు... అసలు ఇస్తుందోలేదోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 28,304 టిడ్కో గృహాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు. వీటిలో 13,256 గృహాలు పూర్తయాయని తెలుస్తోంది. 8,890 గృహాల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఈ గృహాలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజి, రహదారులు వంటి పనులు పూర్తి చేయాలి. 

  అసాంఘిక కార్యకలాపాలు

విశాల ప్రాంగణంలో ఆధునికంగా నిర్మించిన టిడ్కో ఇళ్లు.. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్నాయి. మున్సిపల్‌ కేంద్రాల శివార్లలో ఇవి ఉండటంతో మందుబాబులకు మంచి అవకాశంగా మారాయి. రెండున్నరేళ్లుగా వీటి గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో  పలు ఇళ్ల తలుపులు, కిటికీలు విరిచేశారు. కరోనా నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో టిడ్కో గృహ సముదాయాలను క్వారంటైన్‌ సెంటర్లుగా వినియోగించారు. ప్రస్తుతం మళ్లీ వాటిని వదిలేయడంతో మందుబాబులకు అవకాశంగా మారింది. తెనాలి పూలే కాలనీలోని గృహాలు మందుబాబులు మద్యం తాగేందుకు నెలవుగా మారాయి.


 - గుంటూరు అడవితక్కెళ్లపాడు ప్రాంతంలో 4,192 గృహాలు నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. అయితే రెండేళ్లు ఎటువంటి నిర్వహణ లేకపోవటంతో అక్కడ వేసిన సిమెంట్‌ రోడ్లన్ని పూర్తిగా పాడైపోయాయి. అలానే ఆ ప్రాంతమంతా కంప చెట్లు మొలచి చిట్టడవిని తలపిస్తోంది. గృహ సముదాయాల నడుమ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి చిన్నపాటి చెరువులను తలపిస్తోంది. డ్రెయినేజి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలి. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. కొన్ని టవర్స్‌కు రంగులు వేయాల్సి ఉంది.  

-  మాచర్లలో టిడ్కో గృహాల పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే ఆ ప్రదేశంలో రెండున్నరేళ్లుగా ఎటువంటి వసతులు ఏర్పాటు కాలేదు. టిడ్కో గృహాల నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత పాలకులు రెండున్నరేళ్లుగా పట్టించుకోలేదు. దీంతో వందలాది మంది లబ్ధిదారుల సొంతింటి కల సాకారానికి ఎదురుచూస్తున్నారు.

- వినుకొండలోని వెల్లటూరు రోడ్డు సమీపంలో 4096 టిడ్కో గృహాల నిర్మాణానికి 1440 ఇళ్ల పనులు గతంలో ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టు రద్దు చేసి  మరొకరికి పనులు అప్పగించారు. 1440 గృహాలకు లబ్ధిదారుల వాటా వసూలు చేయగా వీటిలో 240 గృహాలు దాదాపు పూర్తి చేశారు. మౌలికవసతులు కల్పించాల్సి ఉంది. 1200 గృహాలు ఫౌండేషన్‌ దశలోనే ఆగిపోయాయి.   



- రేపల్లెలోని పట్టణ పేదల కోసం 11 ఎకరాలలో 1373 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆయా ఇళ్లకు సంబంధించి కేటగిరీల వారీగా లబ్ధిదారులు రెండు కిస్తీలు కట్టారు. ఇళ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గృహ సముదాయం నీటితో నిండిపోయింది. బేస్‌ లెవల్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌, 3వ అంతస్తుపైన ఉన్న ఇనుప సువ్వలు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయి.

- తెనాలి జగ్గడిగుంటపాలెం సమీపంలో రూ.55 కోట్లతో 2019 ఫిబ్రవరిలో 1200 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించి గృహప్రవేశాలు చేయించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన అరకొర పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. అదేవిధంగా పూలే కాలనీలో 1100 మందికి బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు అరకొరగా సాగుతున్నాయి. ఈ ప్రాంగణమంతా పిచ్చి చెట్లతో చిట్టడివిగా మారింది. నిర్వాహణ లేక భవనాల లోపల అంతా దుమ్ము పేరుకుపోయింది. 

 - చిలకలూరిపేటలోని మంచినీటి చెరువు రహదారిలోని 52 ఎకరాలలో గత ప్రభుత్వ హయాంలో 5,712 టిడ్కో గృహాలను నిర్మించారు. వీటిలో 340 ఇళ్ల పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన రెండోదశ పనులు ఈ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. గృహసముదాయ ఆవరణలో కంపచెట్లు పెరుగుతున్నాయి. గృహాల ముందు పిచ్చిమొక్కలు, రహదారులపై తీగలు అల్లుకుంటున్నాయి. ఇళ్లు బూజుపట్టి దుమ్ముతో నిండిపోయాయి. వాటిని అలానే వదిలేస్తే దెబ్బతినే ప్రమాదం ఉంది.

- నరసరావుపేటలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన 1504 టిడ్కో గృహాల నిర్మాణం పూర్తై రెండేళ్ళు గడిచింది. నేటికి ఒక్క లబ్ధిదారుడికి కూడా అప్పగించలేదు. మౌలిక వసతులు కల్పించలేదు.    1504 గృహాలకు రూ.7.52 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారు. మౌలిక వసతులకు రూ.19 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచానా వేశారు.  

- పిడుగురాళ్ల మున్సిపాలిటీకి సీతారామపురం న్యూ రైల్వేస్టేషన్‌ సమీపంలో 4,480 టిడ్కో ఇళ్లు 80 శాతం పనులు పూర్తి చేశారు.     2019 జనవరిలో అప్పటి ఎమ్మెల్యే యరతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా అందజేశారు.     పెయింటింగ్‌, లైటింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గృహ సముదాయాల్లో సిమెంట్‌రోడ్లు, పార్కులు నిర్మించాల్సి ఉంది. రెండున్నరేళ్లుగా కొత్తగా ఏ పనీ చేపట్టలేదు. దీంతో గృహ సముదాయాల్లో పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లు పెరిగిపోతున్నాయి.  

- తాడేపల్లి మండలం పెనుమాకలో టిడ్కో గృహల పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా ఆరు నెలల క్రితం అందజేశారు.  అయితే ఆయా ఇళ్ల వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రెయినేజి, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సదుపాయాల వంటి మౌలికవసతులు నేటి వరకు కల్పించలేదు. పిచ్చిమొక్కలు, గడ్డినడుమ అధ్వానంగా ఉన్నాయి. వర్షం వస్తే అంతర్గత రోడ్లు బురదమయమై ఉంటున్నాయి.  

- పొన్నూరులో 20 ఎకరాల్లో చేపట్టిన టిడ్కో గృహనిర్మాణాలు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలనాపాలన కరువై కునారిల్లుతున్నాయి. 2,368 టిడ్కో గృహాలు పాడుపడ్డాయి. 2021 జనవరిలో ప్రతిపక్షాల ఆందోళనలతో రెండో సారి లబ్ధిదారులను ఎంపిక చేసి 2,156 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. అయితే అవి నివాసయోగ్యంగా లేకపోవడంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయలేదు. 

- అమరావతి రాజధాని గ్రామాల్లోని పేదల కోసం ఏడు ప్రాంతాల్లో టిడ్కో గృహ సముదాయాలను నిర్మించారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పించాలి.    వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో గృహాల ఊసే లేదు. తుళ్లూరు మండలంలో అనంతవరం, ఐనవోలు, తుళ్లూరు, మందడం, దొండపాడు, మంగళగిరి మండలం కృష్ణాపాలెంలో ఇళ్లు నిర్మాణాలు జరిగాయి. అయితే ఇవి పాడుబడిపోతున్నాయి.  

Updated Date - 2021-08-02T05:56:25+05:30 IST